ఎన్టీఆర్ లేఖతో అయినా ఫ్యాన్స్ ఆగ్రహం తగ్గుతుందా..?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నేడు ఆర్ ఆర్ ఆర్ టీమ్ చేదు వార్త పంచింది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఫస్ట్ లుక్ వీడియో వస్తుందని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి భంగపాటే ఎదురైంది. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో రావడం లేదని ప్రకటించారు. ఒక విధంగా చెప్పాలంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాజమౌళిపై తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు. కాగా వాళ్ళ ఆవేశానికి, ఆగ్రహానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు ఎన్టీఆర్. ఓ సుధీర్గమైన లేఖ విడుదల చేసి, ప్రయత్నం చేశాం కుదరలేదు అన్నట్లు నచ్చజెప్పారు. అలాగే తన పుట్టినరోజు వేడుకలు కూడా నిర్వహించ వద్దని క్షేమంగా ఉండండి అని వేడుకున్నాడు.

ఎన్టీఆర్ తన విన్నప సారాంశం ఇలా సాగింది… ‘ఈ విపత్తు సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నా. అందరం కలిసి పోరాడితే ఈ సమస్య నుంచి సురక్షితంగా బయటపడతామని నమ్ముతున్నా. ప్రతి ఏటా నా పుట్టినరోజున మీరు చూపించే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఒక ఆశీర్వచనంగా భావిస్తా. ఈ ఏడాది మాత్రం మీరు ఇంటి పట్టునే ఉంటూ, అధికారుల సూచనలను పాటిస్తూ భౌతిక దూరానికి కట్టుబడి ఉండాలని నా విన్నపం. ఇదే మీరు నాకు ఇచ్చే అతి విలువైన బహుమతి. అలాగే, ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రం నుంచి ఈ సందర్భంగా ఎటువంటి ఫస్ట్‌లుక్ లేదా టీజర్‌ విడుదల కావడం లేదనే విషయం మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురి చేసిందని నేను అర్థం చేసుకోగలను.

ఫస్ట్‌లుక్‌, టీజర్‌ మీ ఆనందం కోసం సిద్ధం చేయాలని చిత్ర బృందం ఎంతగా కష్టపడిందో నాకు తెలుసు. కానీ ఒక ప్రచార చిత్రం మీ ముందు ఉండాలి అంటే అన్ని సాంకేతిక విభాగాలు కలిసి శ్రమించాలి. అధికారిక ఆంక్షల వల్ల అది కుదరలేదు. రాజమౌళి గారి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రం ఒక సంచలనం కలిగిస్తుందన్న నమ్మకం నాకు ఉంది. ఈ చిత్రం మిమ్మల్ని తప్పక అలరిస్తుంది. నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూ.. మీ ఎన్టీఆర్‌’ అని లేఖలో పేర్కొన్నారు. మరి ఎన్టీఆర్ విన్నపం తరువాత అయినా ఫ్యాన్స్ కూల్ అవుతారో లేదో చూడాలి.

1

2

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus