తెలుగు, తమిళ చలన చిత్ర ప్రపంచంలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ మహానటి సావిత్రి డిసెంబర్ 6, 1936 లో జన్మించారు. ఈరోజు ఆమె యొక్క 90వ జయంతి. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో సామాన్య తెలుగు మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆమె చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయింది. పెదనాన్న కొమ్మారెడ్డి వెంకట్రామయ్య పెంపకంలో ప్రేమతో, పట్టుదలతో పెరిగిన ఈ పాప ఆరంభంలోనే కళలపై ఆసక్తి చూపించేది. నాటకరంగం నుంచి సినిమా ప్రపంచంలోకి అడుగులు వేసిన సావిత్రి, చిన్న పాత్రలతో మొదలై తక్కువ కాలంలోనే అగ్రనటీగా ఎదగడం ఆమె ప్రతిభకు నిదర్శనం.
కానీ సావిత్రి గారి గొప్పతనం కేవలం నటనతో మాత్రమే కాదు ఆకాశమంత గొప్ప మనస్తత్వం ఆమెకు మాత్రమే సొంతం. దానధర్మాల విషయంలో ఆమె ఎముకలేని చెయ్యి అని సినీ పరిశ్రమ నేటికీ గుర్తు చేసుకుంటుంది. ఒకసారి నిండుగా నగలతో ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిని కలిసేందుకు వెళ్లిన ఆమె, అక్కడే తాను ధరించిన అన్ని నగల్ని ప్రధానమంత్రి సహాయనిధికి దానం చేయడం ఆమె గొప్ప మనసుకు, ఔదార్యానికి ఉదాహరణ.

ప్రొడ్యూసర్లకు భారం కాకుండా, ప్రత్యేక అలవాట్లు లేకుండా, సెపరేట్ స్టాఫ్ ను కోరేవారు కాదు ఆమె, అంతే కాక జూనియర్ ఆర్టిస్టులతో ఎంతో స్నేహంగా సొంత వాళ్ళలాగా మెలిగేవారు. కాగా తమిళ స్టార్ జెమిని గణేశన్‌తో వివాహం, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు ఆమె జీవితంలో చేదు అధ్యాయాలు. చివరి దశలో పేదరికం, అనారోగ్యం ఆమెను శోషించాయి. ఒక సంవత్సరం కోమాలో ఉండి కేవలం 46 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారామె.

తరువాత 2018లో ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకుని సిల్వర్ స్క్రీన్ పై తెరకెక్కిన “మహానటి” చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళ ప్రశంసలు అందుకుంది. సావిత్రి పాత్రలో నటించిన కీర్తీ సురేష్ జాతీయ ఉత్తమ నటి అవార్డు సాధించడం ఆమె మహోన్నతను మరొకసారి నిరూపించింది. మహానటి నుంచి నేటితరం నటీనటులు నేర్చుకోవాల్సింది….స్టార్డమ్‌కి మించి మనసు ఉండాలి. మనిషిగా మంచిగా ఉండటం గొప్ప నటన కంటే పెద్ద కళ.
