టాలీవుడ్లో ఓ సెంటిమెంట్ ఉంది. రాజమౌళి (S. S. Rajamouli) దర్శకత్వంలో ఒక హీరో సినిమా చేస్తే.. కచ్చితంగా అతని నెక్స్ట్ సినిమా డిజాస్టర్ అవుతుంది అని..! 90 శాతం అందరి హీరోల సినిమాల విషయంలో ఇదే రిపీట్ అయ్యింది. ‘దేవర’ (Devara) తో ఆ సెంటిమెంట్ ను ఎన్టీఆర్ (Jr NTR) బ్రేక్ చేసినట్టు.. మొదటి 2 రోజులు ఫ్యాన్స్ చెప్పుకున్నారు. ఆ సినిమాకు తక్కువ బిజినెస్ జరగడం వల్ల.. అది బాక్సాఫీస్ వద్ద సేఫ్ అయ్యింది. కానీ కంటెంట్ పరంగా ఎన్టీఆర్ కి సాలిడ్ హిట్ ఇచ్చిన సినిమా కాదు.
నేచురల్ స్టార్ నాని (Nani) కూడా ఒకానొక టైంలో ఈ సెంటిమెంట్ కి తలవంచక తప్పలేదు. రాజమౌళి దర్శకత్వంలో ‘ఈగ’ చేశాడు నాని. అందులో అతను చేసింది 20 నిమిషాల నిడివి గల పాత్ర. అయినా సరే ‘ఈగ’ (Eega) తర్వాత నాని చేసిన సినిమాలు ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ (Yeto Vellipoyindhi Manasu) ‘పైసా’ (Paisa) ‘ఆహా కళ్యాణం’ (Aaha Kalyanam) వంటివి డిజాస్టర్స్ అయ్యాయి.సముద్రఖని (Samuthirakani) దర్శకత్వంలో చేసిన ‘జెండా పై కపిరాజు’ (Janda Pai Kapiraju) ఆర్థిక లావాదేవీల కారణంగా రిలీజ్ ఆగిపోయింది. అలాంటి టైంలో కొత్త డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) తో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ (Yevade Subramanyam) చేశాడు నాని.
మొదట్లో ఈ సినిమాపై అంచనాలు లేవు. కానీ 2015 మార్చి 21న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. నానికి ఒక డీసెంట్ హిట్ ఇచ్చి ఆడుకుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నిన్న రీ- రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ రిలీజ్ అయిన 2015 మార్చి 21 నే ‘జెండా పై కపిరాజు’ సినిమా కూడా రిలీజ్ అయ్యింది. అమలా పాల్ (Amala Paul) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నాని డబుల్ రోల్ చేశాడు.
కానీ ఈ సినిమా ఆడలేదు. ఇది రిలీజ్ అవ్వడం వల్ల ‘ఎవడే..’ ఓపెనింగ్స్ కి ఇబ్బంది ఎదురైంది. తర్వాత ‘ఎవడే..’ కి హిట్ టాక్ రావడం వల్ల ‘జెండా పై కపిరాజు’ ని ఆడియన్స్ పట్టించుకోలేదు. అయితే ఒక హీరో నటించిన 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వడం అనేది.. రేర్ ఫీట్. గతంలో బాలకృష్ణ (Nandamuri Balakrishna), కృష్ణ (Krishna) వంటి హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఈ జనరేషన్లో చూసుకుంటే.. నాని విషయంలో మాత్రమే ఆ రేర్ ఫీట్ రిపీట్ అయ్యింది. చాలా మందికి ఈ విషయం తెలిసుండకపోవచ్చు.