సినిమా పాటకు అందం తెచ్చిన సాహితీ వేత్తలలో వేటూరి సుందర రామ్మూర్తి ఒకరు. శాస్త్రీయ సాహిత్యాన్ని సినిమా పాటలకు అనుగుణంగా మార్చి తెలుగు పాటకు వన్నెలు అద్దిన కవి ఆయన. వందల చిత్రాలకు ఆయన వేలల్లో పాటలు రాశారు. ఆహ్లాదకరమైన మెలోడీలే కాకుండా, మాస్ మాసాల సాంగ్స్ కూడా ఆయన రాసేవారు. ఆయనలో స్పాంటినిటీ చాలా ఎక్కువట. ఓ పాట నేపథ్యం చెవితే వెంటనే సంధర్బోచితమైన పాట రాసి ఇచ్చేసేవారట.
చిరంజీవి నటించిన చూడాలనివుంది సినిమా కోసం జరిగిన చిన్న సంఘటనే ఇందుకు నిదర్శనం. 1998లో దర్శకుడు గుణశేఖర్, నిర్మాత అశ్విని దత్ కాంబినేషన్ లో వచ్చిన చూడాలనివుంది పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో ఓ పాట కోసం వేటూరిని అశ్వినీ దత్ కలిశారట. అశ్విని దత్ వేటూరి గారితో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో ”అబ్బనీ తీయ్యని దెబ్బ..” పాట తరహాలో మణిశర్మ గారి ట్యూన్ కి పాట కావాలని అడిగారట.
అప్పుడు వెంటనే వేటూరి ” అబ్బబ్బ ఇద్దు అదిరేలా ముద్దు..’ అనే పల్లవి చెప్పి ఎలా ఉంది అన్నారట. అశ్విని దత్ నవ్వి బాగుంది అన్నారట. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో ఒక అబ్బ ఉంటేనే అంత పెద్ద హిట్ అయ్యింది, ఈ పాటలో రెండు అబ్బ లు పెట్టాను ఇంకా పెద్ద హిట్ అవుతుంది అన్నారట. చూడాలనివుంది సినిమాలో సౌందర్య, చిరంజీవిపై వచ్చే ఆ మెలోడీ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.