సినిమాకి డైరెక్టర్ ‘కెప్టెన్ ఆఫ్ ది షిప్’ అంటుంటారు. టెక్నికల్ టీంకి వచ్చేసరికి ఎక్కువ పారితోషికం డైరెక్టర్లకే ఉంటుంది. కానీ ఒక బ్లాక్ బస్టర్ సినిమాకి దర్శకుడి కంటే సినిమాటోగ్రాఫర్ ఎక్కువ పారితోషికం అందుకున్నాడట. బాలీవుడ్లో రూపొందిన ‘తేరే మేరే సప్నే’ సినిమాకి ఈ అద్భుతం జరిగింది. ఆ సినిమాకి సినిమాటోగ్రాఫర్ అంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నది మరెవరో కాదు.. మన టాలీవుడ్ డైరెక్టర్ తేజ (Teja). ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఆయనే ఈ విషయం చెప్పుకొచ్చారు.
తేజ మాట్లాడుతూ.. ” ‘తేరే మేరే సప్నే’ అనే సినిమాని అమితాబ్ బచ్చన్ గారు ప్రొడ్యూస్ చేశారు. అది ప్రొడ్యూసర్ గా ఆయనకు మొదటి సినిమా. మొదట ఆ సినిమా కథ నన్ను వినమన్నారు. నాకు అది చెత్తగా అనిపించింది. దీంతో నేను ‘కథ బాలేదు.. మీరు తీయకండి’ అని చెప్పాను. అందుకు వాళ్ళు ‘ప్రాజెక్టు అనౌన్స్ చేసేశాం. అర్షద్ వార్సి, సిమ్రాన్ అందరూ కొత్తవాళ్లు. మేము తీయాల్సిందే. ఆ కథ నువ్వే రెడీ చెయ్యి’ అని అన్నారు. ‘నేను కథ రెడీ చేయడం ఏంటి?’ అని ఆశ్చర్యంగా అడిగాను. ‘నీకు స్టోరీ సెన్స్ ఉందని మాకు తెలుసు.. కూర్చుని చేయి’ అన్నారు. సరే అని చెప్పి మార్పులు అయ్యి చేసి కథ రెడీ చేశాను.
సినిమా షూటింగ్ వెళ్తుంది అనుకున్న టైంలో జయ బచ్చన్ గారు ఫోన్ చేశారు. ‘ఆ డైరెక్టర్ భయపడుతున్నాడు. నువ్వే ఏదో ఒకటి చేయి’ అన్నారు. ‘వాడు భయపడితే నేనేం చేయాలి’ అని అన్నాను. ‘అలా కాదు ఏదో ఒకటి చేసి వాడిని ప్రిపేర్ చేయమని’ అన్నారు. సరే ముందుగా 2,3 పాటలు తీద్దాం. అప్పుడు డైరెక్టర్ కి ధైర్యం వస్తుంది.. తర్వాత సినిమా తీద్దాం అని చెప్పాను. దానికి వాళ్ళు కూడా ఒప్పుకుని సాంగ్స్ షూటింగ్ స్టార్ట్ చేశారు. 2 సాంగ్స్ తర్వాత సినిమా షూటింగ్ మొదలుపెట్టాం. మయూరి సుధ వాళ్లపై ఫస్ట్ సీన్ తీస్తున్న టైం అది. డైరెక్టర్ యాక్షన్ అన్నాడు.. తర్వాత కట్ చెప్పి.. ‘వన్ మోర్’ అన్నాడు.
ఎందుకు ‘వన్ మోర్’ అని అడిగాను. అందుకు అతను 29 సెకన్లలో చెప్పాల్సిన డైలాగులు 32 సెకన్లలో చెప్పారు. అందుకే వన్ మోర్ చెప్పాను అన్నాడు. సరే వన్ మోర్ చేశాం. డైరెక్టర్ ఆర్టిస్టుల వైపు చూడటం లేదు.. స్టాప్ వాచ్ వైపే చూస్తున్నాడు. ‘అదేంటి ఆర్టిస్టుల వైపు చూడకపోతే వాళ్ళ పెర్ఫార్మన్స్..ల గురించి ఎలా తెలుస్తుంది అని నేను అడిగాను’. అందుకు అతను నువ్వు(తేజ సినిమాటోగ్రాఫర్) (Teja) చూస్తున్నావ్ కదా అన్నాడు. ఆ సినిమా మొత్తం అలాగే తీశాం. షూటింగ్ చివరి 10 రోజులు అయితే అతను షూటింగ్ కే రాలేదు. తర్వాత ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.
దీంతో అతనికి లక్ష పారితోషికం ఇచ్చారు. నాకు రూ.8 లక్షలు పారితోషికం ఇచ్చారు. నెక్స్ట్ సినిమాకి నాకు రూ.9 లక్షలు ఇచ్చారు. అతనికి రూ.40 లక్షలు ఇచ్చారు. అదేంటి సినిమా తీసింది అంతా నేను. అతనికి రూ.40 లక్షలు .. నాకు రూ.9 లక్షలు ఏంటి అని చెప్పి.. నేనే డైరెక్టర్ గా మారిపోవాలని డిసైడ్ అయ్యాను. అలా రామోజీ రావు గారికి కథ చెప్పి ‘చిత్రం’ ఓకే చేయించుకున్నాను” అంటూ అసలు విషయం చెప్పుకొచ్చాడు.