2026 సంక్రాంతికి ఓ అండర్ డాగ్ లాంటి సినిమా ‘అనగనగా ఒకరాజు'(Anaganaga Oka Raju). నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కిన సినిమా ఇది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మారి అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వాస్తవానికి ఈ సినిమాని ‘మ్యాడ్’ దర్శకుడు కళ్యాణ్ శంకర తెరకెక్కించాలి. 2022 లోనే టైటిల్ గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేశారు. శ్రీలీలని హీరోయిన్ గా అనుకున్నారు. తమన్ సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు.
కానీ కథ, కథనాల విషయంలో నవీన్ పోలిశెట్టి సంతృప్తి చెందకపోవడం.. అలాగే అతను విదేశాల్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ పాలవ్వడం వంటి ఇతర కారణాల వల్ల.. ‘అనగనగా ఒక రాజు’ మధ్యలోనే ఆగిపోయింది. తర్వాత కళ్యాణ్ శంకర్ ‘మ్యాడ్’ తో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘మ్యాడ్ స్క్వేర్’ కూడా చేశారు. నవీన్ పోలిశెట్టి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా చేశారు.మొత్తానికి కొత్త దర్శకుడితో ‘అనగనగా ఒక రాజు’ సినిమాని పూర్తి చేశారు.

జనవరి 14న సంక్రాంతి కానుకగా భారీ పోటీలో రిలీజ్ చేస్తున్నారు. కంటెంట్ పై గట్టి నమ్మకం ఉందని నాగవంశీ బలంగా చెబుతున్నారు. ప్రతి సినిమాకి ఆయన ఇలాగే చెబుతారు అనే సెటైర్లు వేసుకున్నా.. నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ అలాగే సంక్రాంతి టైమింగ్ ఈ సినిమాకు ప్లస్ అవుతుందని అంతా భావిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడం డిస్ట్రిబ్యూటర్స్ ని టెన్షన్ పెడుతుంది.
ఈరోజు అనగా జనవరి 7న కూడా కొంత ప్యాచ్ వర్క్ ను షూట్ చేస్తున్నారట.నాగవంశీ నిర్మించే ప్రతి సినిమాకి చివరి నిమిషంలో ఇలాంటి హడావిడే ఉంటుంది అని ఇండస్ట్రీ జనాలు చెబుతున్నారు. మరి ఈ విషయంపై నిర్మాత నాగవంశీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
