మాస్ మసాలా సినిమాలు, ఫ్యాక్షన్ చిత్రాలు తెలుగు తెరను దున్నేస్తున్న కాలంలో ఇండస్ట్రీని లవ్ ట్రాక్ వైపు నడిపించిన సినిమా ‘‘ఆనందం’’. తెలుగులో తెరకెక్కిన ప్రేమకథా చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీ ‘ఆనందం’. అప్పుడు థియేటర్లలో కలెక్షన్ వర్షం కురిపించిన ఈ సినిమా ఇప్పుడు టీవీల్లో వచ్చినా సరే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కామెడీ సినిమాల స్పెషలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనువైట్ల తెరకెక్కించిన ఈ ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ అప్పటికీ , ఇప్పటికీ, ఎప్పటికీ ఫ్రెష్ లుక్‌తో ఎంటర్‌టైన్ చేస్తూనే వుంటుంది.
ఈ సినిమా ఎందరికో లైఫ్ ఇచ్చింది. దర్శకుడిగా శ్రీనువైట్ల కెరీర్‌ను మలుపు తిప్పగా.. హీరో ఆకాశ్‌ను ఓవర్‌నైట్ స్టార్‌ని చేసింది. మ్యూజిక్ డైరెక్టర్‌గా అప్పుడప్పుడే ఇండస్ట్రీకి పరిచయమైన దేవీశ్రీప్రసాద్‌ను మరింత దూసుకెళ్లేలా చేసింది. కాలేజీలో హీరో-హీరోయిన్ల అల్లర్లు, ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే లవ్ ట్రాక్, హౌస్ ఓనర్స్‌గా బ్రహ్మానందం, ఎం.ఎస్ నారాయణ, కాలేజీలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం, చిత్రం శీను, శివారెడ్డి, బబ్లూ పండించిన కామెడీ ఈ సినిమాకు అదనపు బలం.
ఈ సినిమా విడుదలై ఇటీవలే 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2001లో విడుదలైన ఆనందం సినిమా ఆంధ్రదేశంలో కుర్రకారుని ఒక ఊపు ఊపింది. ఎన్నో థియేటర్లలో ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా 200 రోజులు ప్రదర్శించబడింది. ఇంతటి సంచలనం సృష్టించిన ఈ సినిమాపై పక్క ఇండస్ట్రీల చూపు కూడా పడింది. అందుకే తమిళంలో ‘ఇనిదు ఇనిదు కాదల్ ఇనిదు’, కన్నడలో ‘ఆనంద’ పేరుతో రీమేక్ అయి మంచి టాక్‌తో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది.