డిల్లీ బ్యూటీ తాప్సీ కొంత విరామం అనంతరం తెలుగులో నటించిన హారర్ కామెడీ ఎంటర్ టైనర్ “ఆనందో బ్రహ్మ”. “పాఠశాల” ఫేమ్ మహి వి.రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్ లు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం నేడు విడుదలైంది. ఇప్పటికే చాలా హారర్ కామెడీ చిత్రాలను చూసి చూసి బోర్ కొట్టేసిన తెలుగు ప్రేక్షకులని ఈ డిఫరెంట్ హారర్ ఫిలిమ్ ఏమేరకు అలరిస్తుందో చూడాలి..!!
కథ : సిద్ధు (శ్రీనివాసరెడ్డి) గుండెకు సంబంధించిన రోగంతో బాధపడుతూ ఉంటాడు, ఒక బార్ లో అటెండర్ గా వర్క్ చేస్తుంటాడు. బాబు (షకలక శంకర్) సినిమా హీరో అవ్వాలనే అత్యాశతో ఉన్న ఒక్క సెలూన్ ను అమ్ముకొని రోడ్డు మీద పడతాడు. పండిట్ (తాగుబోతు రమేష్) తాగుడుకు బానిస కాకపోయినా.. ఒక్కసారి తాగితే తానేం చేస్తున్నాడో తెలియక కొడుకు ఆపరేషన్ కోసం దాచుకొన్న డబ్బును ఓ బెట్ లో పోగొట్టుకుంటాడు. రాజు (వెన్నెల కిషోర్) చెవుడుతోపాటు రేచీకటి కూడా ఉండడంతో తాను గార్డ్ గా పని చేసే ఒక “ఎ.టి.ఎమ్”లోని క్యాష్ ను కొట్టేసినా చూడలేక-వినలేక ఆ దొంగతనానికి బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది.
ఈ నలుగురి ఇబ్బందులు వేరైనా.. వారి సమస్యలు మాత్రం తీరేది డబ్బుతోనే. అందుకే ఓ దెయ్యాల కొంపలో నాలుగు రోజులు ఉండి.. డీల్ ప్రకారం సెటిల్ మెంట్ లో 20% తీసుకొని తమ సమస్యలు తీర్చుకోవాలనుకొంటారు. కట్ చేస్తే.. ఆ ఇంట్లో తాప్సీ అండ్ ఫ్యామిలీ దెయ్యాలుగా నివసిస్తుంటారు. ఒకవేళ ఆ ఇల్లు డీల్ ప్రకారం సేల్ అయిపోతే తమకు ఉండడానికి మరో ఇల్లు దొరకదు అని భావించి ఆ ఇంట్లో ఉండడానికి వచ్చిన నలుగుర్నీ భయపెట్టి ఆ ఇంట్లోంచి గెంటేయాలని నిశ్చయించుకొంటారు. కానీ.. ఆ నలుగురికీ ఉన్న చిత్రవిచిత్రమైన వైకల్యం, అలవాట్ల వల్ల వాళ్ళని భయపెట్టడం ఆ దెయ్యాల తరం కూడా కాదు. అసలు తాప్సీ అండ్ ఫ్యామిలీ దెయ్యాలుగా ఎందుకు మారారు, చివరికి ఇంట్లోంచి ఆ నాలుగుర్నీ భయపెట్టి పంపించగలిగారా లేదా అనేది “ఆనందో బ్రహ్మ” కథాంశం.
నటీనటుల పనితీరు : సినిమా ప్రమోషన్స్ లో తాప్సీది ప్రధాన పాత్ర అన్నట్లు చేసిన ప్రచారానికి “తాప్సీ”ది ఫుల్ లెంగ్త్ రోల్ అనుకోని థియేటర్లకి వచ్చిన ఆడియన్స్ షాక్ అయ్యేలా తాప్సీ ఓ ప్రత్యేక పాత్రకి పరిమితమైంది. భయపడే దెయ్యంగా మేకప్ వరకూ పర్లేదు కానీ.. హావభావాల ప్రదర్శనతో మాత్రం మెప్పించలేకపోయింది. ఇంకాస్త బాగా చేసి ఉంటే బాగుండు అనిపిస్తుంది తాప్సీని చూసినప్పుడల్లా. శ్రీనివాసరెడ్డి పాత్ర “శంకర్ దాదా” సినిమాలో పరేష్ రావల్ క్యారెక్టర్ ను తలపిస్తుంది. భయమేసినప్పుడల్లా నవ్వుతూ భయాన్ని కంట్రోల్ చేసుకొనే వ్యక్తిగా శ్రీనివాసరెడ్డి చక్కని పెర్ఫార్మెన్స్ తో అలరించాడు.
షకలక శంకర్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. స్ప్లిట్ పర్సనాలిటీతో శంకర్ చేసే కామెడీ ఎపిసోడ్స్ చూసి ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వాల్సిందే. ముఖ్యంగా.. రాందేవ్ బాబా, కె.ఏ.పాల్ ల ఇమిటేషన్ ఎపిసోడ్స్ విశేషంగా అలరిస్తాయి. తాగుబోతు రమేష్ తన ఉతపదమైన “అబ్బా తమ్ముడూ” అంటూ తాగిన మత్తులో దెయ్యాన్ని సైతం చెవిపట్టి బెదిరించే ఎపిసోడ్స్ లో ఒదిగిపోయాడు. ఇక వెన్నెలకిషోర్ రేచీకటితో బాధపడే చెవిటివాడిగా ఆరోగ్యక్రమైన హాస్యాన్ని పండించాడు. రాజీవ్ కనకాల మరోమారు తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొన్నాడు. మిగతా ఆర్టిస్టులందరూ కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు : కృష్ణకుమార్ సౌండ్ మిక్సింగ్ టెక్నిక్స్ బాగున్నాయి. డి.టి.ఎస్ మిక్సింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే ప్రేక్షకులు హారర్ ఫీల్ ను ఇంకాస్త బాగా ఎంజాయ్ చేసేవారు. అనీష్ తరుణ్ కుమార్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. డిఫరెంట్ లేదా సరికొత్త ఫ్రేమ్స్ ఎక్కడా లేకపోయినప్పటికీ.. లైటింగ్ అండ్ కలర్ మిక్సింగ్ లో తీసుకొన్న జాగ్రత్తలు సినిమాకి ప్లస్ అయ్యాయి. కలర్ గ్రేడింగ్ కూడా మెచ్చుకోదగ్గ విధంగా ఉంది. దర్శకుడు మహి వి.రాఘవ రాసుకొన్న కథలో కొత్తదనం లేకపోయినా.. ఆ కథను నడిపించడం కోసం రాసుకొన్న క్యారెక్టర్స్ బాగున్నాయి. ముఖ్యంగా విచిత్రమైన వైకల్యాల కారణంగా దెయ్యాలకి భయపడకుండా రివర్స్ లో ఆ దెయ్యాలే భయపడేలా చేసే ఎపిసోడ్స్ ను బాగా కన్విన్సింగ్ గా పిక్చరైజ్ చేశాడు. కాకపోతే.. ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేయడం కోసం నడిపిన స్క్రీన్ ప్లేలో క్లారిటీ మిస్ అయ్యింది.
ఓపెనింగ్ ఫ్రేమ్ లో బాలసుబ్రమణ్యం ఫోటోలను ఎందుకు చూపించాడు, చివరి ట్విస్ట్ ను ఎందుకు అంతలా హోల్డ్ చేశాడో సరిగా క్లారిటీ ఇవ్వలేదు. అప్పటిదాకా చాలా జాగ్రత్తగా హోల్డ్ చేసిన ట్విస్ట్ కూడా పెద్దగా ఎఫెక్ట్ చూపించదు. పైగా.. దెయ్యాలుగా మారిన వాళ్లందరికీ తమని ఎవరు చెంపారు, అసలు తామెలా చనిపోయారు అనే విషయం తెలియకపోవడంలో లాజిక్ ఎంటనే విషయాన్ని సరిగా ఎక్స్ ప్లైన్ చేయలేదు. సో, ఇలాంటి లూప్ హోల్స్ ను పక్కనపెట్టేసి కామెడీ ఎపిసోడ్స్ ను మాత్రం చక్కగా రాసుకొన్నాడు. దాంతో.. కథకుడిగా ఫెయిల్ అయినా డైరెక్టర్ గా ఫర్వాలేదనిపించుకొన్నాడు మహి వి.రాఘవ.
విశ్లేషణ : మెయిన్ స్టోరీలోకి ఆడియన్స్ ని తీసుకెళ్లడానికే ఫస్టాఫ్ మొత్తం వాడేయడం, ఎంటర్ టైన్మెంట్ ఫస్టాఫ్ లో ఎక్కువగా లేకపోవడం, క్లైమాక్స్ కన్విన్సింగ్ గా లేకపోవడం, అన్నిటికీ మించి ప్రీక్లైమాక్స్ ఎపిసోడ్ లో “ఫ్లాష్” అనే హాలీవుడ్ క్యారెక్టర్ ను బేస్ చేసుకొని డిజైన్ చేసిన చిన్నపాటి యాక్షన్ ఎపిసోడ్ కూడా ఆకట్టుకొనే స్థాయిలో లేదు. సో, షకలక శంకర్ కామెడీని ఎంజాయ్ చేయడం కోసమే “ఆనందో బ్రహ్మ” చిత్రాన్ని సరదాగా ఒకసారి చూడవచ్చు.