మంగళవారం సాయంత్రం ప్రకాశ్‌రాజ్ ప్యానల్ ప్రెస్‌మీట్ అయ్యాక… అనసూయ బయటికవెళ్లే ప్రయత్నం చేస్తుండగా… మీడియా ప్రతినిధులు తమ మైకులతో ఆమె దగ్గరకు వచ్చారు. ‘మా’ ఎన్నికల విషయంలో ఆమె చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ… కొన్ని ప్రశ్నలు అడిగారు. తొలుత కాస్త కూల్‌గా సమాధానాలు చెప్పిన అనసూయ… ఆ తర్వాత ఉగ్రరూపం దాల్చింది. ‘నా ప్రమేయం లేకుండా… నా పేరు వాడుకుంటే ఏకంగా కోర్టుకెక్కుతా అంటూ కడిగిపారేసింది’. అసలు ఏమందైంటే…
ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి ఈసీ మెంబర్‌గా పోటీ చేసిన అనసూయ ఓడిపోయారు. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపు సందర్భంగా తొలుత ఆమె విజయం సాధించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సోమవారం జరిగిన లెక్కింపులో ఆమె ఓడిపోయినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. దీనిపై అనసూయ వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. దీనిపై అనసూయను మీడియా ప్రశ్నించింది. ‘‘నేను భారీ మెజారిటీతో గెలిచానని కొన్ని ఛానళ్లు చెప్పాయి. అసలు ఆ సమయానికి ఓట్ల లెక్కింపు పూర్తవ్వలేదు. మరి ఎలా వార్తలు ఇచ్చారో?’’ అని మీడియాను తిరిగి ప్రశ్నించింది అనసూయ.
‘‘ప్రెసిడెంట్ ఓట్ల లెక్కింపు మొదలు పెట్టకుండానే ఫలితాలను మీడియా ప్రకటించేసింది. అలా ఎందువకు జరిగిందో చెప్పగలారా? అయినా నేను చాలా ధైర్యవంతురాలిని. ఓడిపోయానని ఎదుటవాళ్లు చెబితే ఒప్పుకొనే దాన్ని కాదు. నా గురించి తెలుసుకోకుండా తప్పుడు వార్తలు రాస్తే కోర్టును ఆశ్రయిస్తా’’ అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది అనసూయ. చూస్తుంటే అనసూయ కోపం ఈ ఒక్క విషయంపైనే కాకుండా… గతంలో జరిగిన విషయాల మీద కూడా ఉన్నట్లు తెలుస్తోంది.