ఇప్పుడంటే ఎక్కువ షోలు చెయ్యడం లేదేమో కానీ.. అప్పట్లో స్టార్ యాంకర్ లిస్ట్ లో ఉండేది ఉదయభాను. అనర్గళంగా మాట్లాడుతూ.. యమజోరు గా యాంకరింగ్ చేస్తూ వచ్చేది ఉదయభాను. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటూ వస్తోన్న ఉదయభాను.. ఇటీవల జీ.హెచ్.ఎం.సి ఎన్నికల గురించి అలాగే ఓటు గురించి కొన్ని కామెంట్స్ చేసింది సుమ. ఈ వీడియోలో ఆమె మాట్లాడిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా అలాగే ఆలోచింపచేసే విధంగా ఉందని చెప్పొచ్చు.
ఉదయభాను మాట్లాడుతూ.. “అభివృద్ధి జరిగిందా? అవినీతి పెరిగిందా..? అనే విషయాలను కళ్లారా చూస్తున్నాం.. చెవులారా వింటున్నాం. సామాన్యుడి కల నెరవేరిందా అంటే మాహానేతలు అత్యద్భుతంగా మాట్లాడుతూ ఉంటారు. అందరికీ మీడియా ఉంది, ఎవరి మాధ్యమాలు వారివి. మాటల గారడీ, అంకెల గారడీతో మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. ఏది నిజం? ఏది అబద్ధం? ఈ ప్రశ్నకు సమాధానం వేరే ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మన జీవితాలే సాక్ష్యం. సమాధానం మన మనస్సాక్షికి బాగా తెలుసు. జీవితం ఒక యుద్ధమైతే, దాన్ని గెలవడానికి మనకున్న ఆయుధం ఓటు హక్కు.
దాన్ని నిర్వీర్యం చేయొద్దు. కచ్చితంగా ఓటు వేసి తీరుదాం. అప్పుడే ప్రశ్నించగలం. పిడికిలి ఎత్తగలం.మన ఓటు హక్కును వందలు, వేలు వెదజల్లు కొంటున్నారంటే లక్షణంగా లక్షలు లక్షలు దోచేస్తారు. కోటాను కోట్లు దర్జాగా దోచేస్తారు. రాబడి ఉంటేనే కదా.. పెట్టుబడి పెట్టేది. కానీ అది దానం కాదు. మన మన స్వేదం, మన రుధిరం, మన భారతావని భవితం. కావున ప్రలోభాల కోసం కాదు ప్రగతి కోసం ఓటేద్దాం. ప్రజాస్వామ్నాన్ని కాపాడుకుందాం” అంటూ ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది.