Tollywood: ఫిల్మ్‌ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆగ్రహం.. సినిమాల పరిస్థితేంటి?

టాలీవుడ్‌లో కొత్త ముసలం మొదలైంది. నిన్నటి వరకు ప్రశాంతంగా సాగిన సినిమాల చిత్రీకరణలు ఇప్పుడు ఉన్నఫళంగా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం టాలీవుడ్ ఫిల్మ్ ఫెడరేషన్ తీసుకున్న సంచలన నిర్ణయం. వేతనాలు పెంచే వరకూ షూటింగ్స్ బంద్ చేయాలని ఫెడరేషన్‌ నిర్ణయించింది. వేతనాలు 30 శాతం పెంచి ఇచ్చిన వారి షూటింగ్స్‌లోనే సోమవారం నుండి పాల్గొంటామని ఫెడరేషన్ నాయకులు తేల్చి చెప్పారు. అంతేకాదు పెంచిన వేతనాలు ఏ రోజుకు ఆ రోజే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా కాకుంటే బంద్ చేస్తామని హెచ్చరించారు. మరోవైవు ఈ విషయంలో ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Tollywood

ఫిల్మ్‌ ఫెడరేషన్‌ కొత్తగా తీసుకున్న ఈ నిర్ణయం తెలుగు సినిమా, వెబ్‌ సిరీస్‌ల షూటింగ్ ఎక్కడ జరిగినా వర్తిస్తుందని, అలాగే ఇతర భాషా చిత్రాలకు కూడా ఇదే అమలవుతుందని తెలిపారు. వేతనాల విషయంపై గత కొద్ది రోజులుగా ఫిల్మ్ ఫెడరేషన్ – ఫిల్మ్ ఛాంబర్ మధ్య చర్చలు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఫెడరేషన్ నాయకులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫెడరేషన్‌ తీసుకున్న ఈ నిర్ణయం నేపథ్యంలో ఈ రోజు జరగాల్సిన అల్లరి నరేశ్‌ కొత్త సినిమా ముహూర్తం వాయిదా పడింది. అలా ఈ ఎఫెక్ట్‌ పడిన తొలి సినిమాగా అల్లరి నరేశ్‌ సినిమా మారింది.

ఇక వేతనాల విషయంలో ఫిల్మ్‌ ఫెడరేషన్‌ పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఫిల్మ్‌ ఛాంబర్‌ వ్యాఖ్యానించింది. ప్రస్తుత చట్టాల ప్రకారం, నైపుణ్యం ఉన్నవారికి, లేని వర్కర్లకు ఇప్పటికే కనీస వేతనాల కంటే ఎంతో ఎక్కువ ఇస్తున్నామని తెలిపింది. ఫెడరేషన్‌ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల షూటింగ్‌ దశలో ఉన్న సినిమాలకు భారీ నష్టాన్ని కలిగిస్తాయని ఛాంబర్‌ ప్రతినిధులు అంటున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం, పరిశ్రమ మెరుగైన భవిష్యత్తు కోసం అందరం ఐక్యతతో ఉండాలని నిర్మాతలకు ఫిల్మ్‌ ఛాంబర్‌ పిలుపునిచ్చింది.

ఇక ఫిల్మ్‌ ఫెడరేషన్‌, ఫిల్మ్‌ ఛాంబర్‌ మధ్య ఏర్పడిన ఈ గ్యాప్‌ వల్ల ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న సినిమాలు ఆగిపోతాయి. దీంతో విడుదల తేదీలు ప్రకటించేసి రిలీజ్‌కి రెడీగా ఉన్న సినిమాల పరస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. దీంతో రిలీజ్‌ డేట్స్‌ మారే అవకాశం ఉంది. అయితే ఇదంతా ఈ బంద్‌ ఎక్కువ రోజులు ఉంటేనే. చూద్దాం మరి ఏమవుతుందో?

అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus