దర్శకుల్లో కొందరికి మొదటి సినిమా ఫలితం కెరీర్ ను ఒక్కసారిగా మార్చేస్తుంది. కొన్ని సార్లు రెండో సినిమా అవకాశమే రాకపోవచ్చు. కానీ మొదటి సినిమానే డిజాస్టర్ అయితే? చాలామంది దర్శకుల కేరీర్ అక్కడితోనే ముగిసిపోతుంది. అయితే ‘గని’ (Ghani) ఫెయిల్యూర్ తర్వాత పెద్దగా కనిపించని దర్శకుడు కిరణ్ కొర్రపాటి (Kiran Korrapati).. ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీతో ఇండస్ట్రీని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు. తన రెండో సినిమాను నేరుగా హిందీలో స్టార్ట్ చేయడం, అది కూడా ప్రముఖ నిర్మాత బ్యానర్‌పై కావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
మెగా హీరో వరుణ్ తేజ్‌తో (Varun Tej) 2023లో వచ్చిన ‘గని’ సినిమా బాక్సింగ్ నేపథ్యంతో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించారు. ఉపేంద్ర (Upendra Rao), సునీల్ శెట్టి (Suniel Shetty) వంటి స్టార్లు ఉన్నా.. కథ, కథనాల్లో సరైన ఎమోషన్ లేకపోవడంతో సినిమా డిజాస్టర్‌గా మిగిలింది. థియేట్రికల్‌గా నష్టాలు మిగిల్చిన ‘గని’ తర్వాత కిరణ్ కనిపించలేదు. అంతా అతడిని ఒకే సినిమాతో ముగిసిపోయిన దర్శకుడిగా భావించారు.
కానీ తాజాగా ఆయన బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు. ఉత్తర భారతంలో పవిత్రంగా భావించే వారణాసిలో ఘాట్‌లపై పూజలు నిర్వహించి హిందీ సినిమాను అధికారికంగా లాంచ్ చేశారు. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న వ్యక్తి సాజిద్ ఖురేషీ. హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో ఇప్పటికే అయిదు సినిమాలు నిర్మించిన ఈ నిర్మాత.. కిరణ్ (Kiran Korrapati) టాలెంట్‌ను నమ్మి ఈ ఛాన్స్ ఇచ్చారని సమాచారం. సినిమాను ముంబయి, లక్నో లొకేషన్లలో భారీగా షూట్ చేయనున్నారు. ఈసారి కథ విషయంలో కిరణ్ ప్రత్యేక కసరత్తు చేశారట.
గతంలో వచ్చిన లోపాలను దృష్టిలో పెట్టుకుని మంచి స్క్రిప్ట్‌తో బాలీవుడ్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవాలని పట్టుదలగా ఉన్నారట. ప్రస్తుతం కాస్టింగ్ ప్రక్రియ జరుగుతుండగా, ఒక ప్రముఖ యాక్టర్‌ని హీరోగా తీసుకునే అవకాశం ఉందని టాక్. ఇటీవలే సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga), గోపీచంద్ మలినేని (Gopichand Malineni) బాలీవుడ్‌లో తమ అడుగులు వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ లిస్టులో కిరణ్ కొర్రపాటి చేరడం గమనార్హం. ఒక డిజాస్టర్ తర్వాత పునర్జన్మలా బాలీవుడ్ ప్రయాణం ప్రారంభించిన ఈ యువ దర్శకుడికి ఈసారి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.