ANR National Awards 2024: చిరంజీవికి ఏఎన్నార్‌ అవార్డు.. కార్యక్రమం హైలైట్స్‌ ఇవే.. స్టార్లు చెప్పిన విషయాలివే!

ఏఎన్నార్‌ అవార్డు ప్రదానోత్సవంలో ఆసక్తికర ఘటనలు చాలా జరిగాయి. ఎవరికి ఎవరి మీద ఎంత గౌరవం ఉంది, ఎంత అభిమానం ఉంది అనేది కనిపించింది. ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌కు (Amitabh Bachchan)  ఎదురెళ్లి చిరంజీవి పాదాలకు నమస్కరించగా.. ఆయన అంతే ప్రేమగా దగ్గరకు తీసుకొని గౌరవం చూపించారు. ఏఎన్నార్‌  (Akkineni Nageswara Rao)  అవార్డును అమితాబ్‌ బచ్చన్‌ చేతుల మీదుగా అందుకున్నాక చిరంజీవి మాట్లాడుతూ అమితాబ్‌తో తన పరిచయం, అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. అంతకుముందు నాగార్జున (Nagarjuna) , అమితాబ్‌ మాట్లాడుతూ చిరంజీవి గురించి, ఏఎన్నార్‌ గురించి గొప్పగా చెప్పారు.

ANR National Awards 2024

ఏఎన్నార్‌ ప్రేమ అద్భుతం.. నాగ్‌ దేవుడిచ్చిన స్నేహం

* పద్మ భూషణ్‌ అవార్డు వచ్చినప్పుడు తనను సినిమా పరిశ్రమ సన్మానించిందని, ఆ సమయంలో అమితాబ్‌ తన గురించి ‘చిరంజీవి కింగ్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా’ అని అనడంతో చిన్న వణుకు వచ్చిందని చిరంజీవి చెప్పారు. ఆ సమయంలో తన నోట మాట రాలేదన్నారు. అంతగా తన మనసు అమితానందంతో నిండిపోయిందని చెప్పారు.

* హిందీలో తొలి సినిమా ‘ప్రతిబంధ్‌’ చేసినప్పుడు అమితాబ్‌కు చూపించారు చిరంజీవి. ఆయన సినిమా చూస్తున్నంతసేపూ ఆందోళనగా ఉన్నారట. సినిమా అయ్యాక బిగ్‌బీ వచ్చి ‘పవర్‌ ఫుల్‌ యాక్టింగ్‌ నీది, సమాజానికి అవసరమైన సినిమా చేశావ్‌’ అని మెచ్చుకున్నారట.

* ‘‘సైరా’లో నా గురువు పాత్ర కోసం అమితాబ్‌ బచ్చన్‌ కాంటాక్ట్‌ అయితే ఆయన వెంటనే ఒప్పుకున్నారని చెప్పిన చిరు.. షూటింగ్‌ తర్వాత ‘ఫార్మాలిటీస్‌’ గురించి మొహమాటపడుతూ అడిగితే.. నీ మీద ప్రేమతో ఈ సినిమా చేస్తున్నాను. ఫార్మాలిటీస్‌ అని నన్ను ఇన్‌సల్ట్‌ చేయొద్దు అని అన్నారు అని చిరంజీవి చెప్పారు.

* ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఓ నానుడి ఉంది. నా విషయంలో అయితే తొలుత రచ్చ గెలిచి ఇప్పుడు ఇంట గెలిచాను. టాలీవుడ్‌ వజ్రోత్సవాల సమయంలో లెజండరీ పురస్కారం ప్రదానం చేయబోయారు. కానీ ఆ రోజు కొందరు హర్షించక ఆ పురస్కారాన్ని తీసుకోవడం సముచితం అనిపించలేదు. అందుకే ఆ అవార్డుని ఓ క్యాప్సుల్‌ బాక్స్‌లో పడేశాను అని నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు చిరు.

* ఈ రోజు ఏఎన్నార్‌ అవార్డును అందుకుంటూ ‘నేను ఇంట గెలిచాను.. రచ్చ గెలిచాను’ అని అంటున్నాను. నాకు పద్మభూషణ్‌, పద్మ విభూషణ్‌ వరించినా గిన్నిస్‌ బుక్‌లో స్థానం దక్కినా.. ఈ అవార్డు విషయంలో చాలా ఆనందంగా ఉన్నాను అని చిరు తెలిపారు.

* ఏఎన్నార్‌ అభిమానుల్లో సీనియర్‌ మోస్ట్‌ ఫ్యాన్‌ మా అమ్మే. ఆమె కడుపులో నేను ఉన్నప్పుడు నాన్నను బతిమలాడి నాగేశ్వరరావు సినిమా ‘రోజులు మారాయి’కి వెళ్లింది. మధ్యలో చిన్నపాటి సమస్య వచ్చి జట్కా బండి తిరగబడినా ఆమె వెరవలేదు. సినిమా చూడాల్సింది అని పట్టుబట్టి చూసింది అని నాటి రోజుల్ని చెప్పారు చిరు.

* నాగేశ్వరరావు అంటే అమ్మకున్న అభిమానం.. రక్తం ద్వారా నాకు వచ్చిందేమో. ఆయన డ్యాన్స్‌లంటే నాకు ఇష్టం. ఆయన సినిమాల్లో పాటలకు ఇంట్లో డ్యాన్స్‌లు వేసేవాణ్ని. ఓసారి అక్కినేని నా గురించి మాట్లాడుతూ ‘నాకు ఎముకలు ఉన్నాయి, కానీ చిరంజీవికి ఎముకలు లేవు’ అని అన్నారు. అంతగా నన్ను అభిమానించారు అని తెలిపారు.

* ‘కాలేజీ బుల్లోడు’ వంద రోజుల ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు.. నన్ను లేచి నిలబడి ప్రేక్షకుల్ని పలకరించి వారి అభిమానాన్ని ఆస్వాదించమన్నారు. ఓ పెద్ద హీరో నా లాంటి కుర్ర హీరోకు అభిమానాన్ని షేర్‌ చేయడం అంటే పెద్ద విషయం అంటూ అక్కినేని గొప్పతనం గురించి చెప్పారు చిరు.

* నాగార్జున నాకు ఆరోగ్య సూత్రాలు తెలిపే డాక్టర్‌. నేను ఇప్పటికీ యంగ్‌గా, సరదాగా ఉన్నానంటే నాగార్జున కూడా ఓ కారణం. ఈ విషయంలో నాగ్‌ని కూడా గుడ్డిగా ఫాలో అవుతా. అక్కినేని కుటుంబం మా కుటుంబ సభ్యుల్లాంటివారే. నాగ్‌ లాంటి స్నేహితుణ్ని నా మనసులో పదిలం చేసుకుంటాను అని చిరంజీవి అన్నారు.

చిరును చూసి గ్రేస్‌ నేర్చుకోమన్నారు

* చిరంజీవి హిట్లు, సూపర్‌హిట్లు, రికార్డుల గురించి అందరికీ తెలిసిందే. ఇటీవలే గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో కూడా చోటు సంపాదించారు అని చెప్పిన నాగ్‌.. ఆయన సినిమాల్లోకి రాకముందు చిరు గురించి తండ్రి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నారు.

* అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిరంజీవి ఓ పాట చిత్రీకరణలో ఉండగా.. అక్కినేని.. నాగార్జునను పిలిచి.. ‘చిరంజీవి అక్కడ డ్యాన్స్‌ చేస్తున్నాడు. సినిమాల్లోకి వద్దామనుకుంటున్నావ్‌ కదా వెళ్లి చూడు. నేర్చుకోవచ్చు’ అని చెప్పారట. అలా చూసిన తనకు చిరు డ్యాన్స్‌లో గ్రేస్‌ చూసి భయం పట్టుకుందని చెపపారు. ఆయనలాగా డ్యాన్స్‌ చేయగలుతామా అని అనిపించిందని చెప్పారు.

* అమితాబ్‌ బచ్చన్‌కు గతంలో ఈ అవార్డు ఇచ్చినప్పుడు అనుకున్న ప్రొటోకాల్‌ ప్రకారం చిరంజీవిని స్టేజీ పైకి ఆహ్వానించలేమని చెప్పాను. దానికి ఆయన ‘అందులో అభ్యంతరం ఏముంది వస్తా. ముందు కూర్చొని వేడుక చూస్తా’ అని అన్నారు అని నాగార్జున తెలిపారు.

* చిరంజీవి, అమితాబ్‌ భారతీయ సినిమాకు ఎనలేని కృషి చేశారు. అందుకే వారిద్దరు ‘ఏబీసీ’ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా అని పొగిడేశారు నాగ్‌. ‘కల్కి 2898 ఏడీ’  (Kalki 2898 AD) సినిమాలోని బిగ్‌బీని చూసి.. నా ఒరిజినల్‌ మాస్ హీరో ఈజ్‌ బ్యాక్‌ అని అనుకున్నానని నాగ్‌ చెప్పారు.

నేనూ టాలీవుడ్‌ సభ్యుడినే..

* నా కుమారులు అయినంత మాత్రాన మీరు నా వారసులు కాలేరు. నా వారసులైనవారే, నా కుమారులవుతారు అని మా నాన్న చెప్పేవారు అని అమితాబ్‌ తన తండ్రి హరివంశ్‌రాయ్‌ బచ్చన్‌ రాసిన కవితను గుర్తు చేసుకున్నారు. ఏఎన్నార్‌ విషయంలో నాగార్జున, ఆయన కుటుంబం ఆ మాటను చేసి చూపించింది అని బిగ్‌బీ అన్నారు.

* ఈ క్రమంలో లంచ్‌ కోసం చిరంజీవి కోసం చిరంజీవి పంపిన ఫుడ్‌ గురించి సరదాగా మాట్లాడారు. లంచ్‌ కోసం ఫుడ్‌ పంపిస్తారు అంటే నా హోటల్‌ రూమ్‌ నిండా ఆ భోజనం పట్టేసింది. ఓ పెద్ద బాస్కెట్‌ నిండా ఫుడ్‌ పంపించారు. మీకు హాస్పిటాలిటీకి, మీ ప్రేమకు నా ధన్యవాదాలు అని అమితాబ్‌ చెప్పారు.

* తమ సినిమాల్లో భాగం చేసి నన్ను తెలుగు సినిమా పరిశ్రమ మనిషిని చేసినందుకు చిరంజీవి, నాగార్జున, నాగ్‌ అశ్విన్‌కు (Nag Ashwin)  ధన్యవాదాలు. టాలీవుడ్‌లో నేనూ సభ్యుడినే అని గర్వంగా చెప్పుకుంటాను. అలాగే రాబోయే సినిమాల్లో నాకు అవకాశం ఇవ్వడం మరవొద్దు అని నవ్వేశారు అమితాబ్‌.

 

మణిరత్నం మెచ్చుకున్న నటిపై ఏమిటీ పిచ్చి ట్రెండ్స్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus