ఒక సినిమా చిత్రీకరణ మూడు నెలలలు నుంచి ఆరు నెలలు జరుగుతుంది. కొన్ని స్పెషల్ సినిమాలకైతే ఏడాది పడుతుంది. ఇంకా అదే పాత్రని రెండేళ్లపాటు నటిస్తూ ఉండాలంటే ఎవరికైనా చిరాకు రావడం ఖాయం. ఎప్పుడు షూటింగ్ పూర్తి అవుతుందా అని అనుకోవడం సహజం. అయితే బాహుబలి చిత్రం మూడేళ్ళుగా చిత్రీకరణ జరుపుకుంటున్నా… ఆ చిత్ర బృందంలో ఎవరికీ విసుగు రాదు. ఎందుకు రాదో.. ఆ రహస్యాన్ని అనుష్క బయటపెట్టింది. స్వీటీ ఈ సినిమాలో దేవసేన పాత్ర పోషిస్తోంది. రెండు పార్టుల్లోనూ ఈమెది కీలక రోల్.
ఈ చిత్రం షూటింగ్ గురించి ఆమె రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. “రాజమౌళి దర్శకత్వంలో నటించడం ఒత్తిడి అనిపించదు. ఎందుకంటే ఆ షూటింగ్ జరిగే ప్రాంతం ఇంటి వాతావరణాన్ని తలపిస్తుంది. రాజమౌళి భార్య రమ, ఆమె సిస్టర్ వల్లి అక్కడే ఉండి మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ఏమైనా బాగాలేకపోతే రెస్ట్ తీసుకోవచ్చు. నిద్ర పోవడానికి, మెడిటేషన్ చేయడానికి వసతులు ఉంటాయి. అందుకే బాహుబలి షూటింగ్ మరో నాలుగేళ్లు జరిగినా నేను ఒత్తిడిగా ఫీల్ కాను ” అని అనుష్క చెప్పింది. అంతే కాదు దర్శకధీరుడి లోని మంచి గుణం గురించి వివరిస్తూ … “సెట్ లో ఉన్న ప్రతి ఒక్కరి మాటను రాజమౌళి గౌరవిస్తారు. సలహాలను స్వీకరిస్తారు. సెట్ బాయ్ చెప్పిన విషయం గురించి కూడా డైరక్టర్ టీమ్ మొత్తం ఆలోచిస్తుంది. అతను చెప్పింది ఒప్పు అనిపిస్తే పాటిస్తారు కూడా.” అని సూపర్ బ్యూటీ తెలిపింది.