టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty) మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘బాహుబలి’ (Baahubali) తర్వాత వరుసగా భారీ సినిమాల అవకాశాలు వచ్చినా, ఆమె మాత్రం ఆచితూచి కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తోంది. 2023లో వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో (Miss Shetty Mr Polishetty) మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన అనుష్క, ఇప్పుడు క్రిష్ జాగర్లమూడితో (Krish Jagarlamudi) కలిసి ఘాటి (Ghaati) అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నా, ప్రమోషన్ల విషయంలో మేకర్స్ మాత్రం మౌనంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.
క్రిష్ డైరెక్షన్‌లో అనుష్క నటిస్తున్న ఈ సినిమాలో అనుష్క పూర్తిగా డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుందట. టాలీవుడ్‌లో ఆమెకు ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో సూపర్ హిట్ రికార్డు ఉన్న సంగతి తెలిసిందే. అరుంధతి (Arundhati), రుద్రమదేవి (Rudramadevi), భాగమతి (Bhaagamathie) వంటి సినిమాలతో తన సత్తా నిరూపించుకున్న అనుష్క, ఘాటితో మరోసారి ఫుల్ స్కోప్ క్యారెక్టర్‌లో అలరించనుందని సమాచారం. ఈ సినిమాలో తమిళ నటుడు విక్రమ్ ప్రభు కీలక పాత్ర పోషిస్తున్నాడు.
క్రిష్ సినిమాలకు యూనిక్ కాన్సెప్ట్ ఉండటం, పీరియాడికల్ టచ్ ఉండటం సహజం. అయితే, ఏప్రిల్ 18న రిలీజ్ అంటూ ప్రకటించినా, ఇప్పటి వరకు ప్రొమోషన్లు ఏమీ ప్రారంభించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఒక్క టీజర్ మినహా సినిమాపై మేకర్స్ నుంచి ఎటువంటి అప్‌డేట్ రాకపోవడం కూడా సినీ ప్రేమికులను నిరాశపరిచే అంశంగా మారింది. అనుష్క సినిమాలకు సాధారణంగా ప్రీ రిలీజ్ హైప్ ఉంటుందన్న సంగతి తెలిసిందే.
కానీ ఈసారి మాత్రం సినిమా ఆలస్యం అవుతుందా లేక అకస్మాత్తుగా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారా అన్నదే ఆసక్తికరంగా మారింది. క్రిష్ గత చిత్రం హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) నుంచి బయటకు రావడం వివాదాస్పదంగా నిలిచినప్పటి నుంచి ఈ సినిమాపై మరింత ఒత్తిడి పెరిగింది. మరి ‘ఘాటి’ మేకర్స్ ఏప్రిల్ 18నే సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారా లేక రీషెడ్యూల్ చేయనున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.