ఈ వారం చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ‘మంగళవారం’ ‘సప్త సాగరాలు ధాటి’ వంటి క్రేజీ సినిమాలతో పాటు ఇంకా చాలా చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో ‘అన్వేషి’ అనే మూవీ కూడా ఒకటి. పెద్దగా చప్పుడు లేకుండా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనన్య నాగళ్ళ.. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. పోస్టర్స్ పై కూడా ఆమెనే ఎక్కువగా హైలెట్ చేశారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో తెలుసుకుందాం రండి.
కథ: రాజమహేంద్రవరం(రాజమండ్రి) కి చెందిన కుర్రాడు విక్రమ్(విజయ్ ధరణ్). ఓ రోజు ప్రియుడితో పారిపోయిన తన ఫ్రెండ్ చెల్లిని గాలిస్తూ అను(సిమ్రాన్ గుప్తా) అనే అమ్మాయిని చూస్తాడు. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. తర్వాత ఓ బ్యాంక్ లో కలుసుకుని కాఫీకి వెళ్తారు. అక్కడే ప్రపోజ్ కూడా చేసుకుంటారు. అయితే తర్వాతి రోజు విక్రమ్ కి కాఫీ షాప్ లో కలుస్తాను అని చెప్పిన అను.. అతన్ని కలవడానికి రాదు. తన ఆచూకీ తెలుసుకుని… రావాలని ఓ లెటర్లో టాస్క్ పెట్టి వెళ్ళిపోతుంది. మొత్తానికి ఆమె మారేడుకోన అనే ఊరికి చెందిన అమ్మాయి అని హీరో కనిపెడతాడు.
కానీ విక్రమ్ ఆ ఊరికి వెళ్లి.. అను గురించి ఆరాతీయగా, ఆమె చనిపోయింది అని ఊర్లో వాళ్ళు చెబుతారు. మరోపక్క అదే ఊర్లో అను హాస్పిటల్ వద్దకి వెళ్లిన వారంతా ఏదో ఒక రకంగా మరణిస్తూ ఉంటారు. అయితే చనిపోయింది వేరే అను(అనన్య నాగళ్ళ) అని విక్రమ్ కి తెలుస్తుంది. కానీ ఈ క్రమంలో తనను కలిసిన ఓ డిటెక్టివ్(ప్రభు) కూడా మరణిస్తాడు.అతని కోసం ఆ కేసుని సాల్వ్ చేసే పనిలో హీరో ఉండగా.. అతనికి ఊహించని షాక్..లు తగులుతాయి. అవి ఏంటి? అను హాస్పిటల్ ఎవరిది? అక్కడ నిజంగానే ఆత్మ తిరుగుతుందా? వంటివి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటుల పనితీరు: విజయ్ ధరణ్ … విక్రమ్ పాత్రలో బాగానే నటించాడు. గతంలో కూడా ఇతను అనేక సినిమాల్లో హీరోగా నటించాడు కానీ ఆశించిన బ్రేక్ రాలేదు. ‘అన్వేషి’ ఇతనికి పాపులారిటీ తెచ్చిపెడుతుంది అనుకోవచ్చు. కాకపోతే విక్రమ్.. అనే పాత్రకి ఇతను ఇంకొంచెం స్లిమ్ అయ్యి చేసుంటే బాగుండేది. ఇక ఇతనికి జోడీగా చేసిన సిమ్రాన్ గుప్తా కొంత వరకు ఓకే. తక్కువ నిడివి కలిగిన పాత్రైనా అనన్య నాగళ్ళకే ఎక్కువ మార్కులు పడతాయి.
మొదటి నుండి ఈమె మంచి పాత్రలు ఎంపిక చేసుకుంటుంది కానీ.. ఎందుకో ఇంకా ఆశించిన రేంజ్ కి వెళ్లలేకపోతుంది. ఇక అజయ్ ఘోష్ ఎప్పటిలానే తన విలక్షణ నటనతో ఆకట్టుకున్నాడు. ప్రభు, ‘దిల్’ రమేష్ , ఇమ్మాన్యుయేల్ వంటి వారు ఉన్నంతలో తమ పాత్రకి న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణుల పనితీరు: దర్శకుడు వి జె ఖన్నా ఎంపిక చేసుకున్న పాయింట్ కొత్తదేమీ కాదు. మొదటి 20 నిమిషాలు చూస్తే.. నిఖిల్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ని గుర్తుచేస్తుంది. కానీ తర్వాత అసలు కథలోకి తీసుకెళ్తూ థ్రిల్ చేసే ప్రయత్నం చేశాడు. కామెడీ కూడా అక్కడక్కడా వర్కౌట్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ పాసబుల్ అనొచ్చు. అయితే సెకండ్ హాఫ్ లో కొంత ల్యాగ్ ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆలస్యంగా రావడం వల్ల .. బాగా సాగదీసినట్టు అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ కూడా సో సోగానే అనిపిస్తుంది. క్లైమాక్స్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. ప్రొడక్షన్ డిజైన్ కూడా ఓకే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి కూడా పేరు పెట్టాల్సిన అవసరం లేదు. స్క్రీన్ ప్లేని ఇంకాస్త గ్రిప్పింగ్ గా డిజైన్ చేసుకుంటే బాగుండేది. సస్పెన్స్ ని మెయింటైన్ చేసినా థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ లోపించాయి.
విశ్లేషణ: మొత్తంగా ‘అన్వేషి’ ఎటువంటి అంచనాలు లేకుండా వెళితే.. ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి. స్క్రీన్ ప్లే ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండి ఉంటే .. కచ్చితంగా సినిమా రిజల్ట్ మరోలా ఉండేది.
రేటింగ్: 2/5