సినిమా టికెట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన మాట మీద నిలబడటం లేదు. ప్రజల కోసం టికెట్ ధరలు తగ్గించామని గొప్పలు చెప్పుకొని కొన్ని రోజులు ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టిన ఏపీలోని జగన్ ప్రభుత్వం, ఆ తర్వాత సినిమా పెద్దల మధ్యవర్తిత్వంతో కాస్త దిగొచ్చి రేట్లు పెంచింది. అంతేకాదు సినిమా విడుదలైన తొలి రోజుల్లో టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇచ్చింది. దీని కోసం ఒక జీవోను కూడా పాస్ చేసింది.
అయితే ఇప్పుడు ఆ జీవోను ప్రభుత్వమే సరిగ్గా అమలు చేయడం లేదు. దంతో ఈ విషయం వైరల్‌గా మారింది. మహేష్‌బాబు హీరోగా పరశురామ్ తెరకెక్కించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా ఈ నెల 12న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారం పాటు సినిమా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇచ్చింది. టికెట్ ధరల పెంపు అవకాశం ఇవ్వడం తప్పుకాదు.
ఎందుకంటే ఎప్పటి నుండో సినిమా పరిశ్రమ అడుగుతున్నది ఇదే. అయితే అంతా నిబంధనలు ప్రకారం, జీవోల ప్రకారం అని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు జీవోను విరుద్ధంగా ఎందుకు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చినట్లు అనేది తెలియడం లేదు. ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో ప్రకారం హీరో రెమ్యూనరేషన్ మినహాయిచి చూస్తే సినిమా బడ్జెట్ రూ. 100 కోట్లు ఉంటే సినిమా టికెట్ ధర పెంచుకునే అవకాశం ఇస్తారు.
అలాగే సినిమా చిత్రీకరణ ఆంధ్రప్రదేశ్‌లో కనీసం 20 శాతం జరిగి ఉంటే టికెట్ రేటు పెంచుకునే అవకాశం ఇస్తారు. ‘సర్కారు వారి పాట’ విషయంలో ఇవేవీ కనిపించడం లేదు. లేవు కూడా. కానీ టికెట్ రేట్లు పెంచారు. మరిలాంటప్పుడు జీవోలు జారీ చేయడం ఎందుకో అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘ఆచార్య’ సినిమా విషయంలో ఇంచుమించు ఇలానే జరిగింది. అయితే వడ్డీల లెక్క ఎక్కువై సినిమా బడ్జెట్ పెరిగింది అంటూ ఓ లెక్క చెప్పారు. మరి ‘సర్కారు వారి పాట’కు కూడా ఇలాంటిదేదో చెబుతారేమో.
Most Recommended Video
అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!