Dongata Review: దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

లీడింగ్ ఓటిటి సంస్థగా దూసుకుపోతున్న ‘ఆహా’ ప్రతీ శుక్రవారం ఓ కొత్త సినిమాని విడుదల చేసి ప్రేక్షకుల్ని అలరిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని సినిమాలు థియేటర్లో రిలీజ్ అయిన కొద్దిరోజులకి ఇందులో రిలీజ్ అవుతుండగా.. మరికొన్ని మాత్రం నేరుగా రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం ‘ఆహా’ లో నేరుగా రిలీజ్ అయిన మూవీ ‘దొంగాట’.నేషనల్ అవార్డు విన్నర్ మరియు ‘పుష్ప’ విలన్ అయిన ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీని దిలీష్‌ పోతన్‌ డైరెక్ట్ చేసాడు.

2017లో మలయాళంలో ఈ మూవీ ‘తొండిముతాలుమ్‌ ద్రుక్సాక్షియుం’ అనే పేరుతో రూపొందింది. ఏకంగా 3 నేషనల్ అవార్డులను కైవసం చేసుకున్న ఈ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందించడానికి ‘ఆహా’ వారు ముందుకొచ్చారు.

కథ : రైతు కుటుంబానికి చెందిన ప్రసాద్ (సూరజ్) సూప‌ర్ మార్కెట్‌లో ప‌నిచేసే శ్రీజ‌(నిమిషా) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు.ఓ చిన్న అర్థం ద్వారా ఏర్పడిన వీరి పరిచయం అమర ప్రేమికులుగా మారేలా ప్రేరేపిస్తుంది.అయితే వీరి కులాలు వేరు కాబట్టి..ప్రసాద్ తక్కువ కులం వాడు అని భావించి శ్రీజ ఇంటి పెద్దలు వీరి పెళ్ళికి ఒప్పుకోరు.దీంతో పారిపోయి పెళ్లి చేసుకుంటారు ప్రసాద్, శ్రీజ లు.

అటు తర్వాత ప్రసాద్ రైతు కనుక వ్యవసాయం నిమిత్తం డబ్బు అవసరమై భార్య తాళిని తాకట్టు పెట్టాలని డిసైడ్ అవుతాడు. ఆ క్రమంలో ఓ రోజు బ‌స్సులో ప్ర‌యాణిస్తుండ‌గా శ్రీజ తాళిని ఇంకో ప్ర‌సాద్(ఫహాద్ ఫాజిల్) దొంగిలిస్తాడు. శ్రీజ తన తాళిని ప్రసాద్ కొట్టేయడం చూసి.. అతన్ని నిలదీయబోతుంటే అతను ఆ చైన్ ను నోట్లో వేసుకుని మింగేస్తాడు. బ‌స్సులో ఉన్న ప్ర‌యాణికులంతా ఆ దొంగ ప్ర‌సాద్‌ను పోలీసుల‌కు అప్ప‌గిస్తారు.

కానీ ప్రసాద్ ఆ చైన్‌ను దొంగిలించ‌లేద‌ని చెబుతాడు. నిజంగానే ప్రసాద్.. శ్రీజ చైన్ ను దొంగిలించలేదా? లేక కావాలనే అబద్దాలు ఆడుతున్నాడా? ఈ సమస్యని పోలీసులు ఎలా పరిష్కరించారు? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు : దొంగ ప్రసాద్ గా ఫహద్ ఫాజిల్‌ అద్భుతంగా నటించాడు. అతను నటనతో పాటు కామెడీని కూడా పండిస్తాడు. ఈ పాత్రకి నూటికి నూరు శాతం జీవం పోసాడు ఫహాద్.అమాయకపు ప్రసాద్ గా కనిపించే సూరజ్‌ కూడా అద్భుతంగా నటించాడు.మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా, రైతుగా అద్భుతంగా నటించాడు. శ్రీజ పాత్రలో నిమిషా కూడా చక్కగా ఒదిగిపోయింది. మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు : పోలీసుల్లో కొంతమంది ఏ రకంగా ప్రవర్తిస్తారు, మధ్యతరగతి వ్యక్తుల భావాలు ఏ విధంగా ఉంటాయి వారి ఆలోచనా శైలి ఏ విధంగా ఉంటుంది వంటి సందర్భాలను దర్శకుడు దిలీప్‌ పోతన్‌ తెర పై ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది.ఒకప్పటి సినిమాల్లోలా హీరో దొంగలా మారడానికి ఆ తర్వాత మంచి వాడిగా మారడానికి కారణాలు వంటివి.. ఇందులో ఫాహద్ ఫాజిల్‌ పాత్ర ద్వారా చూపించలేదు.దీంతో అతని పాత్ర మరింత నేచురల్ గా ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా ఉంది.

సజీవ్‌ పజూర్‌ కథ, శ్యామ్ పుష్కరణ్‌ డైలాగ్‌లు అందరినీ సినిమా పూర్తయ్యాక కూడా వెంటాడతాయి. రాజీవ్‌ రవి సినిమాటోగ్రఫీ, బిజిబాల్‌ సంగీతం హైలెట్ గా నిలిచాయి. తక్కువ బడ్జెట్ లో ఇంత క్వాలిటీగా మూవీ తెరకెక్కింది అంటే అందులో వాళ్ళ కృషి కూడా తెరపై కనిపించింది.

విశ్లేషణ : ఉత్తమ సహాయ నటుడు కేటగిరిలో ఫహాద్ ఫాజిల్‌కు, బెస్ట్ స్క్రీన్‌ ప్లే రైటింగ్ విభాగంలో సజీవ్‌ పజూర్‌ … నేషనల్ అవార్డులను అందుకున్నారు. అలాగే ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కూడా ఈ మూవీకి నేషనల్ అవార్డ్ లభించింది అంటే ఈ సినిమాని అక్కడి జనాలు ఎంతలా ఫీలయ్యారో అర్ధం చేసుకోవచ్చు. తెలుగు ప్రేక్షకులను కూడా ఈ మూవీ అదే విధంగా ఆకట్టుకుంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

‘ఆహా’ లో అందుబాటులో ఉన్న ఈ మూవీ కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. ప్రతీ పాత్ర గుర్తుండిపోయే విధంగా ఆకట్టుకుంటుంది. మిస్ కాకుండా చూడండి..!

రేటింగ్ : 3/5

Click Here To Read in ENGLISH

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus