సాధారణంగా ప్రతి దర్శకుడికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. కెరీర్ మొదట్లో దాన్ని తీయలేకపోయినా, ఎప్పుడో ఒకప్పుడు దానికి ప్రాణం పోయాలని చూస్తుంటారు. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్. మురగదాస్ కూడా సరిగ్గా ఇదే చేస్తున్నారు. గజినీ, తుపాకీ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ క్రియేటివ్ డైరెక్టర్.. ఇప్పుడు తన మనసులో పాతికేళ్లుగా దాచుకున్న ఒక క్రేజీ ఐడియాను బయటకు తీస్తున్నారు. అదేంటో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం.
అందరూ స్టార్ హీరోల డేట్స్ కోసం పాకులాడుతుంటే, మురుగదాస్ మాత్రం ఒక వింత సాహసానికి రెడీ అయ్యారు. ఈసారి ఆయన సినిమాలో హీరో మనిషి కాదు, ఒక ‘కోతి’. అవును, మీరు విన్నది నిజమే. మెయిన్ లీడ్ గా ఒక కోతిని పెట్టి సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఇది ఈనాటి ఆలోచన కాదు, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచే ఈ కథను రాసుకున్నారట. అప్పట్లో పరిస్థితులు అనుకూలించక అటకెక్కిన ఈ స్క్రిప్ట్ ను ఇప్పుడు దుమ్ము దులుపుతున్నారు.
వాస్తవానికి 2001లో అజిత్ తో చేసిన ‘దీనా’ కంటే ముందే మురుగదాస్ ఈ కథను డైరెక్ట్ చేయాలనుకున్నారు. అంటే దాదాపు 25 ఏళ్ల నాటి కల ఇది. అప్పుడు బడ్జెట్ ఇబ్బందులో లేక టెక్నాలజీ లేకనో ఆగిపోయిన ఈ ప్రాజెక్ట్ కు ఇప్పుడు మోక్షం లభిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునిక టెక్నాలజీ, వీఎఫ్ఎక్స్ సాయంతో ఈ కథను ఇప్పుడున్న జనరేషన్ కి నచ్చేలా తీర్చిదిద్దాలని ఆయన డిసైడ్ అయ్యారు.
శంకర్ లాగా కమర్షియల్ సినిమాల్లో సోషల్ మెసేజ్ ఇవ్వడం మురుగదాస్ స్టైల్. కానీ ఈసారి రూట్ మార్చి పూర్తి స్థాయి వినోదాన్ని పంచబోతున్నారు. ఇది ముఖ్యంగా పిల్లలను టార్గెట్ చేస్తూ, గ్రాఫిక్స్ తో కూడిన ఒక కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతోందట. ప్రయోగాత్మక సినిమాలు చేయడం ఆయనకు కొత్త కాకపోయినా, ఒక జంతువును ప్రధాన పాత్రలో పెట్టి సినిమాను నడిపించడం మాత్రం పెద్ద సవాలే అని చెప్పాలి.
మొత్తానికి పాతికేళ్ల క్రితం కుదరని పనిని, ఇప్పుడు స్టార్ ఇమేజ్ వచ్చాక నెరవేర్చుకుంటున్నారు. ఇన్నాళ్లు స్టార్ హీరోలతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన మురుగదాస్, ఇప్పుడు ఈ ‘కోతి’ ఐడియాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. ఇటీవల మదరాసి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన, నెక్స్ట్ ఈ ప్రయోగంతో కనక హిట్ కొడితే ఇండియన్ స్క్రీన్ మీద మరొక విజువల్ వండర్ నిలిచిపోతుంది.
