ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ లో టాలెంట్ ఉన్నవాళ్లు అప్పుడప్పుడు వేరే జోన్ లోకి వెళ్లి ప్రయోగాలు చేయడం కామన్. కానీ ప్రపంచమే మెచ్చిన సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ ఇప్పుడు మేకప్ వేసుకుని నటుడిగా మారుతున్నారంటే మాత్రం నమ్మశక్యంగా లేదు. ఇన్నాళ్లు తన స్వరాలతో మ్యాజిక్ చేసిన ఈ ఆస్కార్ విన్నర్, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించడానికి రెడీ అయ్యారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది.
అసలు విషయం ఏంటంటే.. ప్రభుదేవా హీరోగా వస్తున్న ‘మూన్ వాక్’ అనే కామెడీ ఎంటర్టైనర్ లో రెహమాన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. గతంలో కొన్ని పాటల్లో తళుక్కున మెరిసినా, ఇలా పూర్తి స్థాయి పాత్ర చేయడం ఇదే తొలిసారి. ఇందులో ఆయన ఒక సినిమా దర్శకుడి పాత్రలో కనిపించబోతున్నారు. బయట చాలా సైలెంట్ గా, కూల్ గా ఉండే రెహమాన్, సినిమాలో మాత్రం ఒక యంగ్ అండ్ యాంగ్రీ డైరెక్టర్ గా కనిపిస్తారట. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఫ్యాన్స్ కు ఆశ్చర్యంగా ఉంది.
ఈ సినిమాను మనోజ్ ఎన్ఎస్ డైరెక్ట్ చేస్తున్నారు. బిహైండ్ వుడ్స్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రెహమాన్ పాత్ర కథను మలుపు తిప్పేలా ఉంటుందని టాక్. ఒకవైపు ప్రభుదేవా స్టెప్పులు, మరోవైపు రెహమాన్ నటన.. ఈ కాంబినేషన్ వినడానికే చాలా క్రేజీగా అనిపిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ గా ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన రెహమాన్, ఇప్పుడు నటుడిగా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారో చూడాలి.
నిజానికి రెహమాన్ లాంటి లెజెండ్ నటిస్తున్నారంటే ఆ సినిమాకు ఆటోమేటిక్ గా గ్లోబల్ అప్పీల్ వచ్చేస్తుంది. పాటల రచయితగా, నిర్మాతగా సత్తా చాటిన ఆయన, ఇప్పుడు నటుడిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించబోతున్నారు. మరి ఆ కోపంగా ఉండే డైరెక్టర్ పాత్రలో రెహమాన్ జీవించేస్తారో లేక జస్ట్ అలా వచ్చి వెళ్తారో తెలియాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.
