అర్ధనారి

  • July 1, 2016 / 05:56 AM IST

అర్జున్ యజత్ హీరోగా ఇదివరకు ‘గీతోపదేశం’ అనే సినిమాలో నటించాడు. కానీ ఆశించినంత గుర్తింపు మాత్రం లభించలేదు. భాను శంకర్ డైరెక్టర్ గా సుమారుగా నాలుగైదు సినిమాలు చేసిన తన ప్రతిభకు తగ్గ సినిమా అయితే రాలేదు. సమాజానికి సందేశాన్ని ఇచ్చే విధంగా భాను శంకర్ ఒక కథను సిద్ధం చేసుకొని అర్జున్ యజత్ ను ప్రధాన పాత్రలో ‘అర్ధనారి’ అనే చిత్రాన్ని రూపొందించారు. మరి ఈ సినిమాతో అయినా.. వీరిద్దరికి సక్సెస్ లభించిందో లేదో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం..!

కథ : అర్ధనారి(అర్జున్ యజత్) ఓ హిజ్రా తాండాలో చేరి సమాజంలో ఉన్న పోలీసులను, రాజకీయనాయకులను కొందరు ప్రముఖులను చంపేస్తూ ఉంటాడు. పోలీసులు ఎంతగా ప్రయత్నించినా.. అర్ధనారిని మాత్రం పట్టుకోలేకపోతారు. ఈలోగా అర్ధనారి ఏకకంగా రాష్ట్ర ముఖ్యమంత్రినే కిడ్నాప్ చేస్తాడు. ఆ సమయంలో హత్యలు చేస్తుంది.. అర్ధనారీనే అని ఓ టీకొట్టులో పని చేసే అబ్బాయి పోలీసులకు చెబుతాడు. అయితే పోలీసులు మాత్రం ఆ విషయాన్ని నమ్మరు. అర్ధనారిని పట్టుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ స్పెషల్ టీమ్ కు క్లూ దొరుకుతుంది. అర్ధనారి ఎక్కడున్నాడో తెలుసుకొని వెళ్లేసరికి అతడు ముఖ్యమంత్రిని కూడా చంపేస్తాడు. అసలు అర్ధనారి వరుస హత్యలు చేయడానికి గల కారణాలేంటి..? అర్ధనారి నిజంగానే హిజ్రానా..? లేక అబ్బాయే కావాలని అలాంటి వేషం వేసుకొని అందరిని చంపుతున్నాడా..? అన్ని హత్యలు చేసిన అర్ధనారికి చివరికి ఏం జరిగింది..? ఈ విషయాలు అన్ని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..!

నటీనటుల పెర్ఫార్మన్స్ : ఈ సినిమా మొత్తం అర్ధనారి పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఆ పాత్రలో నటించిన అర్జున్ యజత్ రెండు షేడ్స్ లో కనిపిస్తాడు. మొదటి భాగంలో హిజ్రాగా తన నటనతో ఒకే అనిపించాడు. రెండో భాగంలో దేశభక్తి గల ఓ పౌరుడిగా ప్రేక్షకులను మెప్పిస్తాడు. హీరోయిన్ గా నటించిన మౌర్యానికి ఇది మొదటి చిత్రమైనా.. తన నటనతో పర్వాలేదనిపించింది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో జ్యోతి ఈ సినిమాలో కొత్తగా కనిపించింది. విలన్ గా మధు పెర్ఫార్మన్స్ ఒకే అనిపిస్తుంది.

సాంకేతికవర్గం పనితీరు : రవివర్మ మ్యూజిక్ అంత గుర్తుపెట్టుకుని విధంగా అనిపించదు. క్రైమ్, థ్రిల్లర్ జోనర్ లో ఉండే చిత్రాలను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ముఖ్యం. కానీ ఈ సినిమాలో నేపధ్య సంగీతం అంత ఎఫెక్టివ్ గా ఉండదు. దాని వలన సన్నివేశాలు బావున్నప్పటికీ డల్ గా అనిపిస్తాయి. ఫొటోగ్రఫీ సో.. సో.. గా ఉంటుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పి ఉంటే బావుండేది. సెకండ్ హాఫ్ లో సినిమాను సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఈ సినిమాకు ప్లస్ అంటే కథే. డైరెక్టర్ అనుకున్న కథను చక్కగా ఎగ్జిక్యూట్ చేయగలిగాడు. రొటీన్ సినిమాలొస్తున్న ఈరోజుల్లో దేశభక్తి గురించి జనాలు మర్చిపోతున్న ఈ కాలంలో సమాజానికి ఒక సందేశం ఇవ్వాలని దర్శకుడు చేసిన ప్రయత్నం సక్సెస్ అయిందనే చెప్పాలి. కథనం ఇంకాస్త ఎఫెక్టివ్ గా ఉంటే సినిమా ఇంకా బావుండేది. నిర్మాణ విలువలు
ఒకే అనిపిస్తాయి.

విశ్లేషన : బాధ్యత లేని వాడిని భారతదేశంలో బ్రతికే హక్కు లేదని బాధ్యతారహితంగా ప్రవర్తించే ప్రతి ఒక్కరినీ శిక్షించాలనుకుంటాడు ఓ వ్యక్తి. అయితే ఆ దేశభక్తి వలనే తన కుటుంబాన్ని దూరం చేసుకున్న తను దానికి కారనమైన వారందరినీ చంపాలనుకుంటాడు. ఓ రివెంజ్ డ్రామాగా నడిచే ఈ కథలో సాధారణ ప్రేక్షకులు కోరుకునే ఎంటర్టైన్మెంట్, కామెడీ ఉండవు. సీరియస్ త్రిల్లర్ గా సాగే కథ ఇది. మల్టీప్లెక్స్ ఆడియన్స్ ను ఈ సినిమా ఆకట్టుకోలేకపోయినా.. బి, సి, ఆడియన్స్ కు మాత్రం బాగా కనెక్ట్ అవుతుంది. కానీ కొన్ని పాయింట్స్ మాత్రం చాలా సిల్లీగా ఉంటాయి. రాష్ట్రముఖ్యమంత్రిని ఇంత సులభంగా కిడ్నాప్ చేయచ్చా.. అనిపిస్తుంది. డైరెక్టర్ అలాంటి పాయింట్స్ ను జాగ్రత్తగా డీల్ చేసి ఉంటే బావుండేది.

రేటింగ్ : 1.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus