హీరో – హీరోయిన్ మధ్య ఏజ్ గ్యాప్ గురించి చాలా ఏళ్లుగా చర్చ జరుగుతోంది. అయితే ఆ ఏజ్ గ్యాప్ కాంబినేషన్లు మాత్రం ఆగడం లేదు. ఎందుకంటే పాత హీరో అయినా కొత్త హీరోయిన్‌తో కాంబినేషన్ కుదిర్చి కొత్తదనం తీసుకొచ్చే పనిలో ఉన్నారు మన దర్శకనిర్మాతలు. ఈ క్రమంలో సీనియర్ హీరోల సరసన కొత్త హీరోయిన్లు మనకు కనిపిస్తున్నారు, మెప్పిస్తున్నారు కూడా. ఇలాంటి ఏజ్ గ్యాప్ కాంబినేషన్లు వచ్చి మంచి విజయాలు కూడా అందుకున్నాయి.
ఇలాంటి సినిమాలు చేయడంలో హీరోయిన్ల డెసిషన్ మేకింగ్ కీలకంగా మారుతుంది. ఎందుకంటే ఒకసారి ఏజ్ ఎక్కువగా ఉన్న హీరోతో సినిమా చేస్తే ఆ తర్వాత దాదాపు అన్ని సినిమాల్లో అలాంటి పాత్రలే వస్తాయి. అయితే ఈ భయాలేవీ లేకుండా సినిమాలను ఓకే చేసుకొని ముందుకు సాగుతోంది ఆషికా రంగనాథ్. ‘నా సామిరంగ’ సినిమాతో పెద్ద హీరో సరసన నటించిన ఆషికా.. ఆ తర్వాత ‘విశ్వంభర’ సినిమాలో చిరంజీవికి పెయిర్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా చేసింది.
దీంతో, హీరో – హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్ గురించి సరైన ఆన్సర్ ఆమెనే ఇవ్వగలదు అని చెప్పొచ్చు. అందుకే ఆమె దగ్గర ఈ విషయం ప్రస్తావిస్తే.. ఆసక్తికరమైన ఆన్సర్ ఇచ్చింది. తనకు హీరోల వయసుతో సంబంధం లేదని, సినిమాలో తన పాత్ర మాత్రమే చూస్తానని చెప్పింది. క్యారెక్టర్ నచ్చితే, హీరో వయసును పట్టించుకోనని క్లారిటీ ఇచ్చేసింది. నటిగా తెరపై నా పాత్ర ఎంత బాగుందనేది మాత్రమే నేను చూస్తానని ఫుల్ క్లారిటీగా ఉంది.
అంతేకాదు అంత పెద్ద నటులతో కలిసి పనిచేస్తే వాళ్ల అనుభవం నుండి మరిన్ని విషయాలు నేర్చుకోవచ్చు అని అంటోంది. ఆ లెక్కన వయసు అనేది ప్రామాణికం కాదు అని చెప్పినట్లే. మరి యంగ్ హీరో సినిమాలు అని అడిగిగా.. యంగ్ అయినా, సీనియర్ అయినా మన పాత్ర బాగుందా లేదా అనేది చూసుకుంటానని తేల్చేసింది.