వచ్చే సంక్రాంతి సీజన్‌కి టాలీవుడ్‌లో ఎవరూ కోరుకోని పరిస్థితి ఏర్పడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో ఐదు సినిమాలు టాలీవుడ్ నుండి రెడీ అవుతుండగా.. రెండు సినిమాలు కోలీవుడ్ నుండి సిద్ధమవుతున్నాయి. అయితే వీటిలో ఏవి ఆ టైమ్ వచ్చేసరికి ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు అనేది తర్వాత చూడొచ్చు. అయితే వాయిదా సాధ్యం కాని రెండు సినిమాలు ఉన్నాయి. ఎందుకంటే అవి డబ్బింగ్ సినిమాలు. అయితే వాళ్లు తెలుగులోకి వస్తారా అనేదే ఇక్కడ ప్రశ్న.
వచ్చే పొంగల్ ఫైట్‌కి రెడీ అవుతున్న సినిమాల్లో తొలుత రాకపోతేనే బెటర్ అనుకునే రెండు సినిమాలు ‘జననాయగన్’, ‘పరాశక్తి’. విజయ్ చివరి సినిమా అని చెబుతున్న ‘జననాయగన్’ సంక్రాంతికే రానుంది. ఈ సినిమా జనవరి 9న తీసుకురాబోతున్నారు. శివకార్తికేయన్ సినిమా ‘పరాశక్తి’ని జనవరి 14న తీసుకురానున్నారు. ఈ రెండు సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేయాలని టీమ్స్ ప్లాన్ చేస్తున్నాయి. అయితే వీటికి సంబంధించిన ప్రచారం పనులు తెలుగు నాట ఇంకా స్టార్ట్ చేయలేదు. ఒకవేళ స్టార్ట్ చేసినా థియేటర్లు అనుకున్నన్ని దొరుకుతాయా అనేది చూడాలి.
సిటీల్లో మల్టీప్లెక్సుల్లో స్క్రీన్లు దొరకొచ్చేమో కానీ.. సింగిల్ థియేటర్లలో తమిళ సినిమాలను వేసే పరిస్థితి ఈ పొంగల్‌కి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఆపేసి.. తెలుగు సినిమాల హడావుడి తగ్గాక వేసుకోవాలి. అది కూడా సినిమా హిట్టయితేనే. టాక్ బాగుంది కాబట్టి అప్పుడు మనవాళ్లు కూడా చూసే అవకాశం ఉంది. ఇక రెండేళ్ల క్రితం కూడా ఇలాంటి పరిస్థితే రావడం గమనార్హం. అప్పుడు జనవరిలో శివ కార్తికేయన్ ‘అయలన్’, ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ ఇలా రావాల్సి ఉన్నా వాయిదా పడ్డాయి. చూద్దాం మరి.. ఆ ఇప్పుడు ‘పరాశక్తి’, ‘జననాయగన్’ సినిమాలను తెలుగులో కొనుక్కున్న నిర్మాతలు ఏం నిర్ణయం తీసుకుంటారో.
ఇక సంక్రాంతికి తెలుగులో చిరంజీవి ‘మన శంకర్ వరప్రసాద్ గారు’, ప్రభాస్ ‘ది రాజా సాబ్’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ ఉన్నాయి.