చేసినవి మూడు సినిమాలే.. ఇంకా చెప్పాలంటే రెండు సినిమాలే.. అప్పుడు రజనీకాంత్‌ను డైరెక్ట్ చేసే అవకాశం సంపాదించాడా? కొన్ని నెలల క్రితం ఇంకా చెప్పాలంటే సిబి చక్రవర్తి పేరు చర్చలోకి వచ్చే ముందు వరకు తెలుగు, తమిళ సినిమా పరిశ్రమల్లో ఆ కుర్ర దర్శకుడి గురించే మాట్లాడుకున్నారు. ఆ యంగ్ డైరక్టరే అశ్వత్ మరిముత్తు. ఈ పేరు చెబితే గుర్తుకు రావడం తెలుగువారికి కష్టమే కానీ.. ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమా దర్శకుడు అని చెబితే అర్థమైపోతుంది. నిజానికిది అది ‘డ్రాగన్’. ఆ దర్శకుడి గురించే ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో చర్చ.
దానికి కారణం ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ప్రాజెక్ట్‌ల గురించి చెబుతూ చెప్పిన కొన్ని విషయాలే. ప్రస్తుతం అశ్వత్ మరిముత్తు.. శింబు కోసం ఓ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే సినిమాను ఓకే చేసుకున్న ఆయన.. ప్రస్తుతం డైలాగ్ వెర్షన్‌ను రెడీ చేస్తున్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ ‘డ్రాగన్’ సినిమాకు, ఇప్పుడు శింబు సినిమాకు మధ్యలోని గ్యాప్‌లో ఏం చేశారు అనేది చెప్పుకొచ్చారు. అప్పుడు రజనీకాంత్ సినిమా ప్రస్తావన వచ్చింది.
రజనీకాంత్ – కమల్ హాసన్ కాంబినేషన్‌లో ఓ సినిమా త్వరలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అది కాకుండా హీరో రజనీ, నిర్మాత కమల్ కాంబినేషన్‌లో ఓ సినిమా ఇటీవల ఘనంగా అనౌన్స్ అయింది కూడా. సిబి చక్రవర్తి ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. అయితే ఆ యన ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చే ముందు సుందర్.సి వచ్చారు. ఆయన బయటకు వచ్చేశాక అశ్వత్ మరిముత్తు పేరు వినిపించింది. కానీ ఫైనల్‌గా ఓకే అవ్వలేదు. ఏమైంది అని అడిగితే.. తాను చెప్పిన కథ రజనీకాంత్‌కి బాగా నచ్చిందని.. కానీ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు అని చెప్పారు.
అయితే, ఆ కథను కమల్ హాసన్‌కి కూడా చెప్పానని.. ఇద్దరిలో ఎవరో ఒకరు తర్వాతనైనా ఈ సినిమా చేసే అవకాశం ఉందని చెప్పారు అశ్వత్. అంతగా వారిద్దరికీ నచ్చినా ఎందుకు ఇప్పుడు చేయడం లేదో వారికే తెలియాలి. చూద్దాం తర్వాతనైనా ఆ సినిమా చేస్తారేమో. అన్నట్లు విజయ్ కోసం కూడా తన దగ్గర ఓ కథ ఉందని అశ్వత్ చెప్పారు.