అశ్వథ్థామ సినిమా రివ్యూ & రేటింగ్!

యువ కథానాయకుడిగా నాగశౌర్య రచయితగా మారి రాసిన కథ “అశ్వథ్థామ”. ఈ చిత్రాన్ని తన స్వంత బ్యానర్ మీద నిర్మించడంతోపాటు కథానాయకుడిగానూ నటించాడు. రమణతేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో మెహరీన్ కథానాయిక. ట్రైలర్ & ప్రోమోస్ సినిమా మీద ఆసక్తిని పెంచాయి.. మరి సినిమా ఆ ఆసక్తిని కంటిన్యూ చేసిందో లేదో చూద్దాం..!!

కథ: అమ్మ-నాన్న-చెల్లి-గణ (నాగశౌర్య) ఒక అందమైన కుటుంబం. చెల్లెలి పెళ్లికి కుటుంబ సభ్యులందరూ సన్నద్ధమవుతుంటారు. ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తున్న సమయంలో అప్పటివరకూ ఆనందంగా ఉన్న చెల్లెలు ఒక ఊహించని సమస్యను అన్నయ్యతో పంచుకొంటుంది. ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్న గణాకు తన చెల్లెలు మాత్రమే ఈ తరహా సమస్యను ఎదుర్కొలేదని.. చాలామంది అమ్మాయిలు ప్రాణాలు కూడా కోల్పోయారని చెబుతాడు. అసలు సమస్య సృష్టికర్త కోసం వెతకడం మొదలెడతాడు. ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఒక మూలకి వచ్చి ఆగిపోతుంటాడు.

అసలు తన చుట్టూ అంతటి బలమైన వలయాన్ని సృష్టించుకొని అమ్మాయిల ప్రాణాలతో ఆడుకొంటున్న ఆ కీచకుడు ఎవరు? అమ్మాయిల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? గణా ఆ కీచకుడ్ని పట్టుకోవడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? అనేది “అశ్వథ్థామ” కథాంశం.

నటీనటుల పనితీరు: నాగశౌర్యలోని మాస్ యాంగిల్ ను పూర్తిస్థాయిలో ఎలివేట్ చేసిన సినిమా “అశ్వథ్థామ”. శౌర్య ఒక నటుడిగా మాత్రమే కాదు ఒక రచయితగానూ పరిణితి చూపించాడు. స్క్రీన్ ప్లే రాసిన విధానం, హీరో-విలన్ నడుమ సెకండాఫ్ లో వచ్చే సీన్స్ చాలా గ్రిప్పింగ్ గా రాసుకున్నాడు. అలాగే సిస్టర్ సెంటిమెంట్ సీన్స్ లో ఎమోషన్స్ కూడా చక్కగా పండించాడు శౌర్య.

మెహరీన్ ది లిమిటెడ్ రోల్ అయినప్పటికీ.. తన ప్రెజన్స్ ను ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా జాగ్రత్తపడింది. చెల్లెలు పాత్ర పోషించిన నటి సెంటిమెంట్ సీన్స్ లో బాగా యాక్ట్ చేసింది.

కనిపించేది సెకండాఫ్ లో అయినప్పటికీ.. విలనిజాన్ని వీరలెవల్లో పండించాడు విలన్ పాత్రధారి జీషు సేన్ గుప్తా. బెంగాలీ థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో.. అతడి పాత్ర పండించే శాడిజం గగుర్పాటుకి గురి చేస్తుంది. తెలుగు ప్రేక్షకులు ఈ హింసను ఎంతవరకు జీర్ణించుకోగలరో చిన్న డౌట్ ఉంది కానీ.. మనుషులు మరీ ఇంత క్రూరంగా ఉంటారా అని జనాలు ఆశ్చర్యపోతారు కూడా. సపోర్టింగ్ రోల్స్ లో ప్రిన్స్, హరీష్ ఉత్తమన్ లు తమ పాత్రలక న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: శ్రీచరణ్ పాకాల సమకూర్చిన బాణీలు అంతంత మాత్రంగానే అనిపించినా.. నేపధ్య సంగీతం అందించిన జిబ్రాన్ మాత్రం పూర్తిగా న్యాయం చేసాడు. ఛేజింగ్ & యాక్షన్ సీన్స్ కి జిబ్రాన్‌ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు. అలాగే మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకి మరో ప్రత్యేక ఆకర్షణ. యాక్షన్ సీన్స్ తెరకెక్కించిన విధానం, క్లైమాక్స్ ఎపిసోడ్ మాస్ ఆడియన్స్ కు మంచి కిక్ ఇస్తాయి. గ్యారీ ఎడిటింగ్, పరశురామ్ శ్రీనివాస్ డైలాగ్స్, ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ డిజైన్, కె.జి.ఎఫ్ టీం కొరియోగ్రాఫ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ లు అన్నీ “అశ్వద్ధామ” సినిమాకి ప్లస్ గానే నిలిచాయి.

కథనంలో వేగం లోపించడం మాత్రం రచయిత శౌర్య & డైరెక్టర్ రమణతేజ నడుమ వేవ్ లెంగ్త్ సెట్ అవ్వలేదేమో అనిపిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ & సస్పెన్స్ నోట్ తో మొదలైన సినిమా వేగం మధ్యలో తగ్గుతుంది.. కథలో ఉన్న ఆసక్తి కథంలో అక్కడక్కడా లోపిస్తుంది. విలన్ క్యారెక్టరైజేషన్ & విలన్-హీరో కలుసుకొనే సన్నివేశాలు చాలా ఇంటెన్స్ గా ఉన్నప్పటికీ.. ఎక్కడో చిన్న వెలితి, ఏదో ఇంపాక్ట్ మిస్ అయ్యింది అనిపిస్తుంది. విలనిజం కాస్త శృతి మించిందనిపిస్తుంది కానీ.. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను ఎంగేజ్ చేయడానికి ఆమాత్రం ఉండొచ్చు అనిపిస్తుంది. సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయాల నేపధ్యంలో తెరకెక్కిన “అశ్వథ్థామ” ప్రతీకార నేపధ్యంలో వెళ్లిపోయింది కానీ.. అందుకు సరైన సమాధానంలా ఏదైనా చెప్పి ఉంటే బాగుండేది. అలాగే సెకండాఫ్ లో విలన్ క్యారెక్టర్ ను సింపుల్ గా చంపేయడం కూడా సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేదు. ఇలాంటి చిన్నపాటి మైనస్ లు పక్కన పెట్టేస్తే.. “అశ్వథ్థామ” ఒక కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.

విశ్లేషణ: నాగశౌర్య మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్ లు, గగుర్పాటుకు గురి చేసే విలనిజం కోసం “అశ్వథ్థామ” చిత్రాన్ని థియేటర్లో తప్పకుండా చూడొచ్చు. శౌర్య ఎన్నాళ్ళగానో తపిస్తున్న మాస్ ఇమేజ్ ఈ సినిమాతో రావడం ఖాయం.

రేటింగ్: 3/5

Click Here To Read English Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus