హీరోగా కెరీర్ ను మొదలెట్టిన ఎనిమిదేళ్ళలో కేవలం నాలుగు సినిమాల్లో నటించిన సుశాంత్ ఇప్పటివరకూ కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోలేకపోయాడు. తాజాగా జి.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో సుశాంత్ హీరోగా నటించిన చిత్రం “ఆటాడుకుందాం రా”. కన్ఫ్యూజన్ కామెడీ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి “ఆటాడుకుందాం రా”తోనైనా కథానాయకుడిగా సుశాంత్ హిట్ కొట్టాడా? లేదా? అనే విషయం తెలుసుకొందాం..!!
కథ : విజయ్ రామ్ (మురళీశర్మ), ఆనంద్ (ఆనంద్) ఇద్దరూ ప్రాణ స్నేహితులు. ఒక వ్యాపార లావాదేవీలో శాంతారామ్ (ఫిరోజ్ అబ్బాసి) కారణంగా శత్రువుల్లా మారిపోతారు. అప్పటివరకూ ఆనంద్ ను విపరీతంగా నమ్మిన విజయ్ రామ్ అప్పట్నుంచి అతడ్ని మోసగాడిగా చూస్తుంటాడు.
కట్ చేస్తే.. కార్తీక్ (సుశాంత్) విజయ్ రామ్ ఫ్యామిలీలోకి ప్రవేశిస్తాడు. శాంతారామ్ కారణంగా నష్టపోయిన ఆస్తులన్నిట్నీ గిరిజారావు (బ్రహ్మానందం)ను ఉపయోగించుకొని తిరిగి సంపాదించి పెడతాడు. అసలు కార్తీక్ ఎవరు? విజయ్ రామ్ కుటుంబానికి ఎందుకు సహాయం చేస్తాడు? అనేది “ఆటాడుకుందాం రా” కథాంశం.
నటీనటుల పనితీరు : కార్తీక్ పాత్రలో సుశాంత్ స్టైలిష్ గా కనిపించాడు. నటన పరంగా మునుపటి సినిమాలతో పోల్చి చూస్తే పర్వాలేదనుకొనే స్థాయిలోనే తన ప్రతిభ ప్రదర్శించాడు. డైలాగ్ డెలివరీ విషయంలో మాత్రం ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. సోనమ్ హీరోయిన్ గా అందచందాల ప్రదర్శన విషయంలో మొహమాటం చూపనప్పటికీ.. హావభావాల ప్రకటన విషయంలో చాలా పొదుపు వ్యవహరించింది. అమ్మడు అందాలతోపాటు నటనకు కూడా కాస్త మెరుగులు దిద్దితే మంచిది.
విలన్ పాత్రలో ఫిరోజ్ అబ్బాసి విగ్రహ పుష్టి అన్నట్లుగా తెర నిండుగా కనిపించినప్పటికీ.. విలనిజం మాత్రం ప్రదర్శించలేకపోయాడు. గిరిజారావు గా బ్రహ్మానందం నవ్వించడానికి చేసిన ప్రయత్నం సక్సెస్ అయ్యింది. అయితే.. టైమ్ మెషీన్ ఎపిసోడ్స్ అన్నీఆకట్టుకున్నాయి. పోసాని, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, ఆనంద్ లు తమ తమ పాత్రల పరిధి మేరకు ఫర్వాలేదనిపించుకొన్నారు.
సాంకేతికవర్గం పనితీరు : “పల్లెకు పోదాం” రీమిక్స్ సాంగ్ మినహా అనూప్ “ఆటాడుకుందాం రా” చిత్రంలో తన పాత సినిమాల్లోని పాటలన్నిట్నీ కలిపి కొట్టేశాడనేలా ఉన్నాయి ట్యూన్స్. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే.. సీన్ తో సంబంధం లేకుండా వాయించి పడేశాడు. దాశరధి శివేంద్ర కెమెరా పనితనం బాగుంది. ఎమోషన్ ను పట్టించుకోకుండా లైటింగ్ ను వాడిన విధానం మినహా ఓకే అనిపించుకొన్నాడు.
శ్రీధర్ సీపాన మరోమారు తన ప్రాసల బాణాలను ప్రేక్షకులపైకి సంధించాడు. ప్రాస కోసం పడిన ప్రయాస ప్రతి మాటలోనూ కనిపిస్తుంది. ఇక కథ విషయంలో “అతడు” మరియు శ్రీనువైట్ల సినిమాలను మిక్సీలో వేసి ఆడియన్స్ ను అందించాడు. గౌతంరాజు ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉంటే బాగుందనిపించింది.
సినిమాలో కంటెంట్ లేకపోయినా.. కామెడీతో ఆడియన్స్ ను అలరించి ఇప్పటివరకూ చాలా సేఫ్ గేమ్ ప్లే చేసిన జి.నాగేశ్వర్రెడ్డి “ఆటాడుకుందాం రా” విషయంలో శ్రీధర్ సీపాన అందించిన కథలో విషయం లేకపోవడంతో తన దర్శకత్వ ప్రతిభ చూపడానికి పెద్దగా అవకాశం లభించలేదు.
విశ్లేషణ : కన్ఫ్యూజన్ కామెడీ అనేది తెలుగు సినిమాకి బాగా అచ్చోచ్చిన హిట్ ట్రాక్. అయితే.. కామెడీకి మంచి కథనం కూడా తోడవ్వాలీ అప్పుడే ఆడియన్స్ ను ఆకట్టుకోగల సినిమా రూపొందుతుంది. “ఆటాడుకుందాం రా” విషయంలో నాగేశ్వర్రెడ్డి తనదైన మ్యాజిక్ ను పూర్తి స్థాయిలో క్రియేట్ చేయలేకపోయినప్పటికీ.. ఓవరాల్ గా పర్వాలేదనిపించుకొన్నాడు.
సో, హోల్ అండ్ సేల్ గా అలరించే చిత్రం “ఆటాడుకుందాం రా”.