ప్రపంచ సినిమా రికార్డులను తిరగరాసిన దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఆయన నుంచి సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ రికార్డులు భయపడాల్సిందే అని అంతా ఫిక్స్ అయ్యారు. ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ మీద ఉన్న అంచనాలు అలాంటివి. 2025లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనర్ అవుతుందని ట్రేడ్ పండితులు కూడా బల్లగుద్ది చెప్పారు. కానీ తీరా చూస్తే సీన్ రివర్స్ అయ్యింది. ఊహించని విధంగా ఈ విజువల్ వండర్ చతికిలపడింది.
దీనికంటే పెద్ద షాక్ ఏంటంటే, ఒక యానిమేషన్ సినిమా ముందు అవతార్ తలవంచాల్సి రావడం. నవంబర్ 26న వచ్చిన ‘జూటోపియా 2’ మొదటి రోజే 150 మిలియన్ డాలర్లు వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాన్ని అవతార్ 3 ఈజీగా క్రాస్ చేస్తుందని అనుకున్నారు. కానీ అవతార్ 3 కేవలం 137 మిలియన్ డాలర్లకే పరిమితమై, రెండో స్థానంలో నిలిచిపోవడం నిజంగా బిగ్ షాక్. దీనికి ప్రధాన కారణం నార్త్ అమెరికాలో వచ్చిన స్పందన. అక్కడ ప్రీమియర్స్ నుంచి టాక్ కొంచెం డల్ గా ఉండటంతో ఓపెనింగ్స్ తగ్గాయి.
సొంత గడ్డపై కేవలం 36 మిలియన్ డాలర్లు మాత్రమే రావడం సినిమా ఫలితాన్ని దెబ్బతీసింది. ఓవర్సీస్ లో 100 మిలియన్ డాలర్లతో పర్లేదు అనిపించినా, గ్లోబల్ టోటల్ లో మాత్రం జూటోపియా 2ను దాటలేకపోయింది. ఇక అంతకంటే దారుణమైన విషయం ఏంటంటే.. గతంలో వచ్చిన ‘అవతార్ 2’ కలెక్షన్లతో పోలిస్తే ఇది కనీసం సగం కూడా లేదు. 2022లో వచ్చిన సెకండ్ పార్ట్ ఏకంగా 441 మిలియన్ డాలర్లతో ఓపెనింగ్స్ లో సునామీ సృష్టించింది. ఆ రికార్డుతో పోలిస్తే ఇప్పుడు వచ్చిన 137 మిలియన్లు చాలా తక్కువ.
గత రెండు సినిమాలు ఈజీగా 2 బిలియన్ డాలర్ల మార్కును దాటేశాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే 1.5 బిలియన్ డాలర్లు రావడం కూడా గగనమే అనిపిస్తోంది. ఫస్ట్ డేనే ఇలా ఉంటే, లాంగ్ రన్ లో ఆ మ్యాజిక్ రిపీట్ చేయడం కష్టమే. బాక్సాఫీస్ టార్గెట్లు రీచ్ అవ్వాలంటే మాత్రం ఇప్పుడు ఏదో అద్భుతం జరగాల్సిందే. ప్రస్తుతం ఆశలన్నీ క్రిస్మస్ సెలవుల మీదే ఉన్నాయి. కామెరూన్ సినిమాలు స్లో పాయిజన్ లా నిదానంగా పికప్ అవుతాయని ఒక నమ్మకం ఉంది. మరి ఈసారి కూడా ఆ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.