అ! రివ్యూ & అనాలసిస్

  • February 17, 2018 / 08:48 AM IST

నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై తెరకెక్కిన చిత్రం “అ!”. కాజల్, నిత్యామీనన్, రెజీనా, ఈషా రెబ్బ, ప్రియదర్శి, అవసరాల శ్రీనివాస్, మురళీశర్మ ముఖ్యపాత్రధారులుగా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా యువ ప్రతిభాశాలి ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ మొదలుకొని ట్రైలర్ వరకూ విశేషమైన ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఏమేరకు అర్ధమైంది, అసలు దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడు అనేది సమీక్షలో చర్చించుకొందాం. శుక్రవారం సినిమా చూడగానే ఈ విశ్లేషణ ఇవ్వాలి అనిపించినా.. ఆడియన్స్ వ్యూయింగ్ ఎక్స్ పీరియన్స్ ను పాడుచేయడం ఇష్టం లేక కాస్త లేట్ గా ఇవాళ పోస్ట్ చేయడం జరుగుతుంది.

కథ : కాళి (కాజల్ అగర్వాల్) చిన్నప్పట్నుంచి ఫేస్ చేసిన రకరకాల సమస్యల కారణంగా “స్ప్లిట్ పర్సనాలిటీతో డిజార్డర్”తో బాధపడుతుంటుంది. చిన్న పి‌ల్లగా ఉన్నప్పుడే లైంగిక వేదింపులను ఎదుర్కొంటుంది, ఆ వేదింపుల కారణంగా ఆమె మానసిక స్థితి దెబ్బతింటుంది. ఆ తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నించినప్పటికీ ఆమెకున్న మానసిక రుగ్మతి కారణంగా ఎక్కడా జాబ్ దొరకదు, అప్పుడే డ్రగ్స్ కు బానిస అవుతుంది. డ్రగ్స్ కొనుక్కోవడానికి డబ్బు లేకపోవడంతో దొంగతనాలు కూడా చేస్తుంది. ఆ డ్రగ్స్ మత్తు నుంచి బయటపడడం కోసం చాలా ప్రయత్నిస్తుంది. కుదిరితే టైమ్ లో వెనక్కి వెళ్ళి తాను చేసిన తప్పులను సరిచేయాలనుకొంటుంది. కానీ.. ఏదీ కుదరదు. పైగా తనలోని మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ తనని వేధిస్తుంటుంది. అందుకే ఆత్మహత్య చేసుకొని దేహాన్ని వీడి ఈ బాధల నుంచి బయటపడాలనుకొంటుంది. ఆఖరిసారిగా ఒక హోటల్ కి వెళ్ళి తనకు ఇష్టమైన ఫుడ్ ను ఆర్డర్ చేసి మనస్ఫూర్తిగా చనిపోవాలని డిసైడ్ అవుతుంది.

సినిమాలో కాజల్ కాకుండా నిత్యామీనన్, రెజీనా, ఈషా రెబ్బ, మురళీశర్మ, ప్రియదర్శి లాంటి ఆర్టిస్టులందరూ ఉన్నప్పటికీ వాటి గురించి ఎందుకని ఎక్కడా ప్రస్తావించలేదు అనేది విశ్లేషణలో అర్ధమవుతుంది.

నటీనటుల పనితీరు : నిజానికి కాజల్ పాత్ర నిడివి చాలా తక్కువ. కానీ ఆమె లుక్, క్యారెక్టరైజేషన్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. ఆమె స్టార్ పవర్, క్రేజ్ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. దర్శకుడు కాజల్ పాత్ర ద్వారా కథను చాలా కన్విన్సింగ్ గా చెప్పాలని ప్రయత్నించాడు. అతడి ప్రయత్నానికి కాజల్ బాగా హెల్ప్ అయ్యింది. నిత్యామీనన్, ఈషా రెబ్బాలది ఇదివరకూ తెలుగు తెరపై చూడకపోయిన క్యారెక్టరైజేషన్ కాకపోయినా.. డేరింగ్ రోల్స్. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ఒక సీరియస్ ఇష్యూని వీరి పాత్రల ద్వారా దర్శకుడు సమాజానికి అసభ్యతకు తావులేకుండా వివరించిన విధానం బాగుంది.

రెజీనా పాత్ర స్వభావం కంటే ఆమె స్టైలింగ్ బాగుంది. అయితే.. ఆ పాత్ర పోషించాలంటే మాత్రం చాలా ధైర్యం కావాలి. అవసరాల శ్రీనివాస్ తన క్యారెక్టర్ కి న్యాయం చేసినా.. అతడి విగ్ మాత్రం సెట్ అవ్వలేదు.
ప్రియదర్శి క్యారెక్టర్ మంచి ఫన్ ని జనరేట్ చేసింది. ముఖ్యంగా వంట రాకపోయినా వచ్చినట్లు మ్యానేజ్ చేయడానికి మనోడు పడే ఇబ్బందులు ఆరోగ్యకరమైన హాస్యాన్ని పంచాయి. చేపగా నాని, చెట్టుగా రవితేజలు వాయిస్ ఓవర్ తోనే హిలేరియస్ గా నవ్వించడంతోపాటు మంచి ఎమోషన్ ను క్రియేట్ చేశారు. ముఖ్యంగా రవితేజ “చెట్టు కష్టాలు, చెట్టు వల్ల మనిషి పొందే లాభాలను వివరించిన విధానం బాగుంది.

సాంకేతికవర్గం పనితీరు : ముందుగా దర్శకుడి గురించి మాట్లాడుకోవాలి. ప్రశాంత్ వర్మ రాసుకొన్న కథ కంటే ఆ కథను నడిపించిన విధానాన్ని మెచ్చుకోవాలి. స్క్రీన్ ప్లే పరంగా “ఐడెంటిటీ, ఇన్సైడ్ ఔట్, ఇసై” లాంటి సినిమాలను గుర్తుకుతెచ్చినా తన మార్క్ వేయగలిగాడు.

ఈ సినిమాలో కనిపించే ప్రతి పాత్ర కాజల్ క్యారెక్టర్ ఒక్కొదశలో ఎదుర్కొన్న ఇబ్బందులు, పరిస్థితులకు ప్రతిరూపం.
చిన్నప్పుడు ట్యూషన్ మాస్టర్, మావయ్య కారణంగా లైంగికంగా వేధించబడ్డ పాత్రకు నిదర్శనం చిన్న పాప క్యారెక్టర్.
పెద్దయ్యాక మగాళ్ళంటేనే అసహ్యం పెంచుకొని వేరే ఆడదానికి దగ్గరైన ఎమోషన్ ఈషా, ఆమెను అక్కున చేర్చుకొన్న మరో అమ్మాయి నిత్యామీనన్.
నాకు నేనే గొప్ప అని భావించే అహంభావానికి ప్రతీక మురళీశర్మ పాత్ర.
చేసిన తప్పులను సరిదిద్దుకోవడం కోసం పడిన తాపత్రయమే అవసరాల శ్రీనివాస్ రోల్.
ఉద్యోగం లేక, రాక మదనపడే ప్రయాసకి ప్రతిరూపం ప్రియదర్శి క్యారెక్టర్.
బాధలను తట్టుకోలేక డ్రగ్స్ కి బానిసై ఆ ఎడిక్షన్ నుంచి బయటపడానికి మదనపడే మనస్తత్వమే రెజీనా.

సినిమా చూసిన తర్వాత కాజల్ క్యారెక్టర్ కి ఉన్నది మల్టీపుల్ డిజార్డర్ కాబట్టి మహా అయితే తనకున్న సమస్యల్ని ఊహించుకొంటే సరిపోతుంది కదా మరి మిగతా పాత్రలైన.. రెజీనా బోయ్ ఫ్రెండ్, మురళీశర్మను ఆటపట్టించే మెజీషియన్ రోల్స్ ఎందుకు అని సందేహం రావచ్చు. కాజల్ పాత్రకి చిన్నప్పట్నుంచి మగాళ్లని ద్వేషించేదిగా చూపిస్తారు. అందుకే ఆమె తన జీవితంలో చేసిన తప్పులకి మగాళ్లు చేసినట్లుగా చిత్రీకరించారు. అందుకే అవసరాల శ్రీనివాస్ చేస్తున్న తప్పును సరిదిద్దేందుకు ఒక లేడీ క్యారెక్టర్ వస్తుంది.

కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. ఆ లేయర్స్ ను ఎస్టాబ్లిష్ చేసినంత అద్భుతంగా ఎలోబరేట్ చేయలేకపోయాడు ప్రశాంత్ వర్మ. ముఖ్యంగా క్లైమాక్స్ లో కన్విన్సింగ్ గా ఎక్స్ ప్లైన్ చేయలేకపోయాడు. బుల్లెట్స్ పేలుతున్న సమయంలో కాజల్ తల పట్టుకోవడం ప్రీ క్లైమాక్స్ లో చూపించాడు.. అక్కడ్నుంచే ఇదంతా కాజల్ మేధో మదనం అని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించాడు. కాజల్ ఆత్మహత్య చేసుకోవడం ఎంతవరకూ సమంజసం అనే అనుమానం కూడా రావోచ్చు. కానీ.. ఇక్కడ దర్శకుడు చంపింది కాజల్ ను కాదు, ఆమె మెదడులోని ఆలోచనలను, అందుకే క్లైమాక్స్ షాట్ లో అందరూ నేలకొరిగినట్లు చూపించారు. తాను శారీరికంగా చనిపోయినా.. తన అవయవాల ద్వారా బ్రతికే ఉండాలనే ఉద్దేశ్యం ఉన్న మంచి మనిషిగా ఆమె క్యారెక్టర్ ను ఎలివేట్ చేసిన విధానం అభినందనీయం. అయితే.. చిక్కుముడులు వేయడం కంటే వాటిని ఎలాంటి చిక్కులు పడకుండా విడదీయడం ముఖ్యం అనే అంశాన్ని మాత్రం విస్మరించాడు. ఒక్కసారిగా తాడు తెంచేశాడు. దాంతో అప్పటివరకూ ఆ తాడుపై అల్లుకున్న కథ మొత్తం నేలకొరిగింది. సో, అన్ని కీలకమైన విభాగాలను చాలా జాగ్రత్తగా నిబద్ధతో హ్యాండిల్ చేసి ఒక డైరెక్టర్ గా సక్సెస్ అయిన ప్రశాంత్ వర్మ, ఒక కథకుడిగా మాత్రం విఫలమయ్యాడు. అయితే.. ఈ పరాజయం దారుణమైనది కాదు, దార్శకనీయమైనది.

కార్తీక్ ఘట్టమనేని కెమెరా వర్క్ ఈ సినిమాకి ప్రాణం. ఇంటర్వెల్ లో రివీల్ చేసేవరకూ సినిమా మొత్తం ఒకే ప్లేస్ లో జరుగుతోందనే విషయం ప్రేక్షకుడికి తెలియదు. అందుకు కళా దర్శకుడు సాహి సురేష్ ను కూడా మెచ్చుకోవాలి. దర్శకుడి ఆలోచనకి తన ఆర్ట్ వర్క్ తో ప్రాణం పోసాడు. మార్క్ రాబిన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సస్పెన్స్ ను బాగా ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు బాగున్నప్పటికీ.. ఇంకాస్త బెటర్ సీజీ వర్క్ ఉంటే ఇంకాస్త బాగుండేది అనిపిస్తుంది.

విశ్లేషణ : కొందరికి ఈ సినిమా అర్ధమవ్వచ్చు, కొందరికి అర్ధం కాకపోవచ్చు. అయితే.. కమర్షియల్ గా వర్కాటవుతుందా లేదా అనే విషయం పక్కన పెట్టేస్తే.. తెలుగులో ప్రయోగాత్మక చిత్రాలు రావు అనే అపవాదును మాత్రం తొలగిస్తుంది. భవిష్యత్ లో ఈ తరహా కథలను రాసుకొనే దర్శకులకు ఉత్సాహాన్నిస్తుంది. అందువల్ల “అ!” సినిమా అర్ధం కాకపోవచ్చు కానీ.. అర్ధం లేని సినిమా మాత్రం కాదు.

రేటింగ్ : 2.5/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus