ప్రపంచవ్యాప్తంగా బాహుబలి కంక్లూజన్ 1600 కోట్లను వసూలు చేసింది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ అనేక రికార్డులను.. అవార్డులను సొంతంచేసుకుంది. అలాగే పలు జాతీయ, అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో బాహుబలి-2ను ప్రత్యేకంగా షో వేశారు. ఈ మధ్యే ముగిసిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో బాహుబలి-2 స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. ఈ సినిమాని చైనా, జపాన్ లోను రిలీజ్ చేయాలనీ నిర్మాతలు గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం జపనీస్ భాషలో డబ్బింగ్ పూర్తి అయినట్లు తెలిసింది. అంతేకాదు జపాన్ సెన్సార్ బోర్డు సభ్యుల వద్దకు కూడా వెళ్లిందని.. వారు జి సర్టిఫికెట్ ని అందించారని చిత్ర బృందం వెల్లడించింది.
ఇది మన యు సర్టిఫికెట్ తో సమానమని తెలిపింది. అన్ని పనులు పూర్తికావడంతో ఈనెల 29 న జపాన్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ప్రభాస్, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్ తమ నటనతో జపనీయులు మనసు దోచుకోవడం గ్యారంటీ అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. బాహుబలి బిగినింగ్ జపాన్లో ఆశించినంత విజయం సాధించలేదు. అప్పుడు ప్రచారం సరిగా లేకపోవడం వల్ల కలక్షన్స్ తగ్గిందని.. ఈ సారి ఆ మిస్టేక్ చేయకుండా గట్టిగానే ప్రచారం చేయడానికి అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ సిద్ధమయ్యారు. మరి అక్కడ బాహుబలి 2 ఎన్నికోట్లు సాధిస్తుందో.. చూడాలి.