భారత చలన చిత్ర చరిత్రలో బాహుబలి2 ఓ సంచలనం. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా 1000కోట్ల వసూళ్లను తాకి చూపించింది. అన్ని భాషలలో కలిపి బాహుబలి2 1500కోట్లకు పైగా ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది. జపాన్, చైనా దేశాలలో కూడా స్థానిక భాషలలో కూడా విడుదలైన బాహుబలి2, ఆ వసూళ్లను కుడా కలుపుకుంటే మరింత పెరిగే అవకాశం కలదు. 2017లో నమోదైన ఈ రికార్డు చెరిపి వేసిన చిత్రం లేదు.
బాహుబలి2 తరహాలో దేశంలోని అనేక చిత్ర పరిశ్రమలలో భారీ చిత్రాలు తెరకెక్కినా.. బాహుబలి 2 చిత్ర వసూళ్ళలో సగం కూడా సాధించలేకపోయాయి. అంత పెద్ద రికార్డు బాహుబలి పేరిట నమోదయ్యింది. కానీ ఏ రికార్డు శాశ్వతం కాదు, కొంచెం సమయం తీసుకున్నా ప్రతి రికార్డు బద్దలు కావలసిందే. వంద ఏళ్ల చిత్ర కలిగిన చిత్ర పరిశ్రమలో ఏ ఒక్క రికార్డు శాశ్వతంగా నిలబడలేదు. ఐతే బాహుబలి రికార్డు చెరిగిపోయే పరిస్థితి లేదు అనేది తాజాగా వినిపిస్తున్న వాదన. దానికి కారణం ప్రస్తుత పరిస్థితులే. కరోనా వైరస్ కారణంగా థియేటర్స్ కి పునర్వై భవం వచ్చే సూచనలు అయితే లేవు.
ఈ వైరస్ పూర్తిగా సమసిపోయినా ప్రేక్షకులు థియేటర్స్ పై ఆసక్తి చూపకపోవచ్చు. కాబట్టి భవిష్యత్తులో థియేటర్స్ నుండి వందల కోట్ల వసూళ్లు వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చని కొందరి అభిప్రాయం. ఆ లెక్కన బాహుబలి2 స్థాయి వసూళ్లు ఎంత గొప్ప సినిమాకైనా దక్కుతాయనే గ్యారంటీ లేదు. మరో వైపు డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ ప్రజల జీవితాలలోకి చొచ్చుకుపోతుండగా, థియేటర్స్ ఎప్పటిలా ప్రేక్షకుల మొదటి ఛాయిస్ గా ఉండవు. కావున బాహుబలి రికార్డు ఇక చెదరకపోవచ్చు.