ప్రపంచమంతా ఎదురుచూస్తున్న బాహుబలి కంక్లూజన్ పాటలు నిన్న విడుదలయ్యాయి. ఆదివారం రామోజీ ఫిలిం సిటీలో జరిగిన బాహుబలి ప్రీ రిలీజ్ వేడుకలో ఆడియోని నెట్లో రిలీజ్ చేశారు. మరకతమని కీరవాణి స్వరపరిచిన పాటలకు రివ్యూ రాసేంత పరిజ్ఞానం, రాజమౌళి ఓకే చేసిన తర్వాత అందులో తప్పులు పట్టేంత మేధస్సు లేదు కానీ.. సంగీత ప్రియులకు బాహుబలి కంక్లూజన్ లోని పాటల గురించి పరిచయం చేసే ప్రయత్నమే ఇది.
సాహోరే బాహుబలిపంజాబీ గాయకుడు దలర్ మెహింది నోటా బాహుబలి అనే పేరు వింటుంటే రోమాలు నిక్కబొడు చుకున్నాయి. బాహుబలి 2 మోషన్ పోస్టర్ సమయంలో ఆ గొంతు మనకి పరిచయమే. ఇప్పుడు పూర్తి గా “సాహోరే బాహుబలి” రూపంలో వినవచ్చు. అతనికి కీరవాణి, మౌనిమ జత కలవడంతో సాంగ్ ని మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోంది. కె.శివ శక్తి దత్త, డా.కె. రామకృష్ణ కలం నుంచి వచ్చిన ప్రతి పదం కొత్తగా ఉంది. అమరేంద్ర బాహుబలి మహిష్మతి సామ్రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుడైన తరుణంలో రాజమాత, బాహుబలి గొప్పదనాన్ని వర్ణిస్తూ సాగే ఈ పాట అదరహో అనిపించింది.
హంస నావ‘ఓరోరి రాజా.. వీరాధి వీర..’ అంటూ మొదలయ్యే ఈ పాట అమరేంద్ర బాహుబలి, దేవసేనలు హంస నావలో విహారానికి వెళ్లిన సమయంలో వచ్చే యుగళ గీతం. దేవసేన బాహుబలిపై తనకున్న ప్రేమను ఈ పాటలో చెబుతుంది. ఇక చైతన్య ప్రసాద్ అందించిన ‘హాయి అయినా హంస నావలోన .. నీగాలి సోకుతుంటే పైన.. మెచ్చిందిలే దేవసేన’ వంటి సాహిత్యం చాలా రొమాంటిక్ గా అనిపిస్తోంది. సోని, దీపులు తమ గాత్రంతో సొగసులు అద్దారు.
కన్నా నిదురించరాదేవ సేనను పరిచయం చేసే సమయంలో వచ్చే పాటలా “కన్నా నిదురించరా” ఉంది. ఇష్ట దైవమైన శ్రీకృష్ణుడిని తలచుకుంటూ పాడే పాటలా అనిపిస్తోంది. ఈ పాటకు సినిమాకు అనుబంధం ఏమిటో ఇప్పుడే చెప్పలేము కానీ.. ఇది వరకు తెలుగు సినిమాల్లో వచ్చిన శ్రీ కృష్ణిడిని ఆరాధించే పాటల జాబితాలో చేరిపోయింది. కీరవాణి సాహిత్యం అందించిన ఈ పాటను శ్రీనిధి, వి. శ్రీసౌమ్య సుకుమారంగా ఆలపించారు.
దండాలయ్యామహిష్మతి రాజ్యాన్ని వదిలి సామాన్యుడిగా అమరేంద్ర బాహుబలి వెళ్లిపోయేటప్పుడు అతన్ని అభిమానించే ప్రజలు పాడే పాట “దండాలయ్యా”. రాజ్యాన్ని విడిచిపోవద్దని వేడుకొని … ఆ తర్వాత తమ గూడెంలో ఉండేందుకు వచ్చిన బాహుబలిని స్వాగతించడాన్ని ఈ పాటలో గమనించవచ్చు. ఇందుకు మనసుకు హత్తుకునే సాహిత్యాన్ని ఎం. ఎం. కీరవాణి అందించగా కాల భైరవ తన గొంతుతో మాధుర్యాన్ని నింపారు.
ఒక ప్రాణంయువగాయకుడు కాల భైరవ ఆలపించిన మరో అద్భుతమైన పాట ‘ఒక ప్రాణం… ఒక త్యాగం’. సినిమాలో కీలక సమయంలో రానున్న పాట అందరినీ కదిలిస్తోంది. ముఖ్యంగా అమరేంద్ర బాహుబలి స్వయంగా మృత్యువుని ఆహ్వానించే విధానాన్ని, కట్టప్ప నిస్సహాయకతను, రాజమాత ఆవేదనను ఇందులో నింపారు. బాహుబలి తనలోని ప్రతి రక్తపు బొట్టును శివుడికి సమర్పించినట్టు యుద్ధం చేయనున్నట్లు ఈ సాహిత్యం కళ్లకు కడుతోంది.
బాహుబలి 2 పాటలు విన్న తర్వాత బాహుబలి మొదటి పార్ట్ కంటే కీరవాణి ఇందుకోసం ఎక్కువ శ్రమించినట్లు తెలుస్తోంది. సంగీత దర్శకునిగానే కాదు.. రచయితగా మంచి సాహిత్యాన్ని అందించారు. అన్ని భాషల్లో అర్ధాలు మారకుండా ఉండాలని అతను ఏరుకున్న పదాలను గమనిస్తే కీరవాణి కష్టం స్పష్టమవుతోంది. “కన్నా నిదురించరా” అనే ఒక పాట మినహా మిగతావన్నీ ఆణిముత్యాల్లా మెరుస్తున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.