Baby Review in Telugu: బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

  • July 14, 2023 / 08:25 AM IST

Cast & Crew

  • ఆనంద్ దేవరకొండ (Hero)
  • వైష్ణవి చైతన్య (Heroine)
  • విరాజ్ అశ్విన్, నాగబాబు, లిరిష కూనపరెడ్డి (Cast)
  • సాయి రాజేష్ (Director)
  • ఎస్.కె.ఎన్ (Producer)
  • విజయ్ బుల్గానిన్ (Music)
  • ఎమ్ఎన్ బాల్ రెడ్డి (Cinematography)

‘దొరసాని’ ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ‘పుష్పక విమానం’ ‘హైవే’ వంటి డిఫెరెంట్ మూవీస్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు ఆనంద్ దేవరకొండ. ఇతను విజయ్ దేవరకొండ తమ్ముడు అయినప్పటికీ.. సొంతంగా ఎదగాలి అనే తపనతో సినిమాలు చేస్తున్నాడు. ఇదే క్రమంలో ఇప్పుడు ‘బేబీ’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఎక్కువ హైప్ ను సొంతం చేసుకున్న మూవీ ఇదే అని చెప్పాలి. టీజర్, ట్రైలర్స్.. అందులోని డైలాగులు అలాగే ఈ సినిమాలోని పాటలు అన్నీ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి. మరి ఆ అంచనాలను ‘బేబీ’ ఎంత వరకు అందుకుందో ఓ లుక్కేద్దాం రండి:

కథ: వైష్ణవి(వైష్ణవి చైతన్య) ఓ బస్తీలో నివసించే అమ్మాయి. తన స్కూల్ మేట్, అలాగే తన ఎదురింట్లో ఉండే అబ్బాయి ఆనంద్(ఆనంద్ దేవరకొండ) ని ప్రేమిస్తుంది. అయితే కొన్నాళ్ల తర్వాత ఆనంద్ 10 వ తరగతి ఫెయిల్ అయ్యి ఆటో నడుపుకుంటూ ఉంటాడు. వైష్ణవి టెన్త్ ఆ తర్వాత ఇంటర్ కూడా పాసయ్యి బి.టెక్ లో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతుంది. అలా బి.టెక్ లో జాయిన్ అయ్యాక…ఆమెకు విరాజ్ (విరాజ్ అశ్విన్) తో పరిచయం ఏర్పడుతుంది. అతని వల్ల వైష్ణవి చాలా పాష్ గా మారిపోతుంది. మరోపక్క అతని బాయ్ ఫ్రెండ్ అయిన ఆనంద్ ను దూరం పెడుతుంటుంది. ఈ క్రమంలో విరాజ్ .. వైష్ణవిని ట్రాప్ చేసి పడక సుఖం చూడాలనుకుంటాడు. ఆ తర్వాత ఆమెను వదిలించుకోవాలి అనేది అతని ప్లాన్.మరి అతని ప్లాన్ సక్సెస్ అయ్యిందా? లేక ఆనంద్ – వైష్ణవి ల ప్రేమ నిలబడిందా? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు: ఈ విభాగంలో హీరోయిన్ వైష్ణవి చైతన్యకే ఎక్కువ మార్కులు పడతాయి. డీగ్లామర్ గా కనిపించినా.. పాష్ గా కనిపించినా ఎక్కడా ఆమె నటన విషయంలో తగ్గలేదు. సాంగ్స్ లో కూడా ఈమె పలికించిన హావభావాలు బాగున్నాయి. ఇక హీరో ఆనంద్ దేవరకొండ.. గత సినిమాల కంటే బెటర్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. కొన్ని సన్నివేశాల్లో ‘అర్జున్ రెడ్డి’ లో తన అన్న విజయ్ దేవరకొండని కూడా గుర్తుచేశాడు అని చెప్పాలి. ఎమోషనల్ డైలాగ్స్ ను అతను చెప్పిన విధానం బాగుంది. విరాజ్ అశ్విన్.. తనకు అలవాటైన పాష్ అబ్బాయి పాత్రని ఈజ్ తో చేసేశాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు: దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత ఎస్.కె.ఎన్ ఇద్దరూ సోషల్ మీడియాలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు. మీమ్స్ ను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. వాటి స్ఫూర్తితోనే ‘బేబీ’ ని రూపొందించారేమో అనే ఫీలింగ్ మొదటి నుండి కలుగుతూ ఉంటుంది. అయితే ఎమోషనల్ డైలాగ్స్ , అలాగే యూత్ కి కనెక్ట్ అయ్యే ఎమోషనల్ సన్నివేశాలతో సేఫ్ గేమ్ ఆడేశారు అని చెప్పాలి. ‘బేబీ’ కొత్త కథేమీ కాదు. ‘ప్రేమిస్తే’ ‘7/జి బృందావన కాలనీ’ వంటి తమిళ సినిమాల పోలికలు కూడా కనిపిస్తాయి. ఇప్పటి యూత్.. ఆ సినిమాలు కనుక చూడకపోతే వారికి ‘బేబీ’ చాలా ఫ్రెష్ గా అనిపించే అవకాశాలు ఉన్నాయి. విజయ్ బుల్గానిన్ సంగీతానికి ఫుల్ మర్క్స్ పడిపోతాయి. నేపథ్య సంగీతంతో కూడా సినిమాకు ప్రాణం పోశాడు. ఎమ్ఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా హైలెట్ అని చెప్పాలి. సినిమా రన్ టైం మాత్రం కొంచెం ఎక్కువ అనే ఫీలింగ్ కలిగిస్తుంది. ఎస్.కె.ఎన్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ: కథలో కొత్తదనం లేకపోయినా ఫస్ట్ హాఫ్, డైలాగ్స్, సాంగ్స్, నటీనటుల పెర్ఫార్మన్స్ వంటి వాటి కోసం కచ్చితంగా ఓసారి ‘బేబీ’ ని చూడొచ్చు. యూత్ ని అలాగే మాస్ ఆడియన్స్ ని ‘బేబీ’ ఆకట్టుకునే అవకాశాలు ఎక్కువే ఉన్నాయని చెప్పాలి.

రేటింగ్ : 2.75/5

Rating

2.75
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus