ఒక చిన్న సినిమా, ఒక సాధారణ కాన్సెప్ట్, ఒక యువ కథానాయకుడు కలగలిస్తే వంద కోట్లు కలెక్ట్ చేశాయి. సినిమా హిట్ అవుతుంది అని అందరూ ఎక్స్ పెక్ట్ చేశారు కానీ.. ఏకంగా వంద కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని మాత్రం ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. ఆఖరికి చిత్ర కథానాయకుడు కూడా. ఆ సినిమానే “బధాయ్ హో”. ఆ హీరో ఆయుష్మాన్ ఖురానా. గత నెలలో విడుదలైన ఈ చిత్రం స్టార్ హీరోల సినిమాల రిలీజ్ లను కూడా తట్టుకొంటూ.. కేవలం కంటెంట్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకొంటూ సూపర్ హిట్ గా నిలిచింది.
ఒకానొక సందర్భంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో “భవిష్యత్ హిందీ సినిమా అంతా రాజ్ కుమార్ రావు, ఆయుష్మాన్ ఖురానా చేతిలోనే ఉంది. వాళ్ళే హిందీ సినిమా స్థాయిని పెంచుతారు” అని చెప్పాడు. అమీర్ ఖాన్ స్టేట్ మెంట్ ను ఆయుష్మాన్ ఖురానా తనదైన శైలి స్క్రిప్ట్ సెలక్షన్ తో రుజువు చేస్తున్నాడు. ఆయుష్మాన్ మునుపటి చిత్రం “అంధా ధున్” కూడా సూపర్ హిట్ గా నిలవడం విశేషం. చాలామంది యువతరం కథానాయకులు, స్టార్ హీరోలు చేయడానికి భయపడుతున్న కాన్సెప్ట్ లను యాక్సెప్ట్ చేయడం ఆయుష్మాన్ ఖురానా ప్రత్యేకత. అదే అతడి సక్సెస్ సీక్రెట్ అని కూడా చెప్పొచ్చు.