కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకులను అలరించిన ‘టిల్లు’ వేణు అలియాస్ వేణు యెల్దండి దర్శకుడిగా మారి ‘బలగం’ అనే ఫీల్ గుడ్, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించి, ప్రేక్షకులతో పాటు పరిశ్రమ వర్గాల వారిని ఆశ్చర్యపరిచాడు.. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో.. తెలంగాణ నేపథ్యం, పల్లెటూరి వాతవరణంలో సహజమైన పాత్రలతో.. మానవ సంబంధాలను మనసుల్ని కదిలించేలా చూపించి కంటతడి పెట్టించాడు.. ‘‘ఇది చిన్న సినిమా కాదు.. ప్రేక్షకులు మనసులు గెలిచిన సినిమా’’ అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు..
వేణు లాంటి హాస్యనటుడు ఇలాంటి సున్నితమైన భావోద్వేగాలు కలిగిన కథను ఇంతలా హ్యాండిల్ చేస్తాడని ఎవరూ ఊహించలేదసలు.. ఇటీవల ఓటీటీలోకి వచ్చినా కానీ ఇప్పటకీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.. టీమ్ అంతా కొద్ది రోజులుగా సంబరాలు చేసుకుంటున్నారు.. ఇలాంటి సమయంలో వారితో పాటు ప్రేక్షకులను కూడా బాధ పెట్టే, భావోద్వేగానికి గురిచేసే సంఘటన ఒకటి తెలిసింది.. ‘బలగం’ సినిమా క్లైమాక్స్‌లో కొమురవ్వ, మొగిలయ్య దంపతులు అందరి హృదయాలను కదిలించారు.. కనిపించేది కాసేపే అయినా ఆకట్టుకున్నారు..
ప్రస్తుతం మొగిలయ్య అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. కరోనా సమయంలో రెండు కిడ్నీలు పాడవడంతో కొద్దికాలంగా డయాలసిస్ చేయించుకుంటున్నారు.. అప్పటినుండి కంటిచూపు కూడా మందగించింది..విషయం తెలిసి వేణు.. వరంగల్ జిల్లా దుగ్గొండిలోని కొమురవ్వ, మొగిలయ్యల ఇంటికి వెళ్లి.. లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశాడు.. చిత్ర నిర్మాత దిల్ రాజుతో మాట్లాడి మరింత సాయమందేలా చూస్తానని వారికి హామీ ఇచ్చాడు.. కాగా గత కొంత కాలంగా మొగిలయ్య శరీరం డయాలసిస్‌కు కూడా సహకరించడం లేదంటున్నారు వైద్యులు..
డయాలసిస్ చేసే క్రమంలో రక్తం ఎక్కించేందుకు అవసరమైన ఆపరేషన్ పాయింట్ దొరకడం చాలా కష్టంగా ఉందంటున్నారు.. దీనికోసం ఇప్పటికే మొగిలయ్య శరీరంపై దాదాపు 11చోట్ల రంధ్రాలు చేశారట.. చివరకు ఛాతి మీది నుంచి కూడా రక్తం ఎక్కిస్తున్నారట.. ఈక్రమంలోనే మొగిలయ్య తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు సమాచారం.. తాజాగా ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు, మొగిలయ్యకు అండగా ఉంటానని చెప్పారు.. ఇకనుండి మొగిలయ్యను అంబులెన్స్‌లోనే ఆస్పత్రికి తీసుకెళ్లి మెరుగైన వైద్యమందించి.. అంబులెన్స్‌లోనే ఇంటికి తరలించాలని.. నాణ్యమైన మందులివ్వాలని అధికారులను ఆదేశించారు..