Balagam Review in Telugu: బలగం సినిమా రివ్యూ & రేటింగ్!

  • March 2, 2023 / 08:47 PM IST

Cast & Crew

  • ప్రియద‌ర్శి (Hero)
  • కావ్యా క‌ళ్యాణ్ రామ్‌ (Heroine)
  • సుధాక‌ర్ రెడ్డి, ముర‌ళీధ‌ర్ గౌడ్‌, రూప లక్ష్మి, జయరాం, విజ‌య‌ల‌క్ష్మి, వేణు టిల్లు త‌దిత‌రులు (Cast)
  • వేణు యెల్దండి (Director)
  • హర్షిత్ రెడ్డి, హన్షిత (Producer)
  • భీమ్స్ సిసిరోలియో (Music)
  • ఆచార్య వేణు (Cinematography)

నిన్నటివరకూ కమెడియన్ గా అలరించిన “మున్నా” ఫేమ్ వేణు దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రం “బలగం”. దిల్ రాజు కొత్త బ్యానర్ “దిల్ రాజు ప్రొడక్షన్స్”లో నిర్మింపబడిన ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ చిత్రం నేడు (మార్చి 03) విడుదలైంది. రూరల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: సాయి అలియాస్ సాయిలు (ప్రియదర్శి) ఊర్లో ఎన్నో రకాల వ్యాపారాలు మొదలెట్టి.. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఉంటాడు. పెళ్లి చేసుకొని వచ్చిన కట్నంతో అప్పు తీర్చి సెటిల్ అవుదామనుకుంటాడు. రెండ్రోజుల్లో పెళ్ళి అనగా.. సాయి తాతయ్య (కొమురయ్య) మరణిస్తాడు.

తాతయ్య మరణం.. సాయి పెళ్ళికి అడ్డంకిగా మారడం మాత్రమే కాదు, ఏకంగా కుటుంబం మొత్తానికి తలనొప్పిగా మారుతుంది.

ఏమిటా సమస్య? కొమురయ్య తీరని కోరిక ఏమిటి? అనేది “బలగం” కథాంశం.

నటీనటుల పనితీరు: “కేరాఫ్ కంచర్లపాలెం” తర్వాత ఆ స్థాయిలో ప్రతి పాత్రకు ఒక ఆర్క్ ఉన్న సినిమా “బలగం”. కథానాయకా, నాయికలు మాత్రమే కాదు.. స్నేహితులు, బంధువులు, ఆఖరికి బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్స్ కూడా ఎలివేట్ అయ్యారు.

ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, జయరాం, రచ్చరవి, కృష్ణ.. ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రల్లో జీవించేశారు. వాళ్ళ నటన చూస్తుంటే.. నటిస్తున్నట్లుగా కాక సదరు పాత్రలతో ప్రేక్షకులు ప్రయాణం చేస్తున్నట్లుగా ఉంటుంది.

సాంకేతికవర్గం పనితీరు: భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి మెయిన్ హీరో అని చెప్పాలి. తెలంగాణ సాహిత్యాన్ని, తెలంగాణ ఆత్మను, సంస్కృతులను నరనరాల్లో పుణికిపుచ్చుకున్న భీమ్స్.. “బలగం” చిత్రానికి నిజమైన బలంగా నిలిచాడు. కాసర్ల శ్యామ్ సాహిత్యం.. తెలంగాణ జీవాన్ని సినిమాలో నింపింది. అలాగే.. గాయకుల ఎంపిక కూడా సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా నిలిచింది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ సాంగ్ ప్రతి ఒక్కరితో కన్నీరు పెట్టిస్తుంది.

ఆచార్య వేణు సినిమాటోగ్రఫీ.. సినిమాకి సహజత్వాన్ని తీసుకొచ్చింది. ఓపెనింగ్ సీక్వెన్స్ లో.. తెలవారుతున్న పల్లెటూరి అందాన్ని చక్కని నేచురల్ లైట్ తో ఎలివేట్ చేసిన విధానం.. ఆచార్య వేణు పనితనానికి ప్రతీకగా నిలుస్తుంది.

దిల్ రాజు ప్రొడక్షన్స్ సంస్థ ప్రొడక్షన్ డిజైన్ కథకు తగ్గట్లుగా ఉంది. సినిమాకి ఎంత కావాలో అంత ఖర్చు చేశారు. కాకి గ్రాఫిక్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. కథకి చాలా కీలకమైన ఆ గ్రాఫిక్స్ చాలా అసహజంగా ఉండడం సినిమాకి ఏకైక మైనస్ గా చెప్పుకోవాలి.

ఇక దర్శకుడు వేణు ఎల్డండి అలియాస్ టిల్లు వేణు గురించి చెప్పుకోవాలి. ఈ కథను అతడు మరాఠీ చిత్రం “వెంటిలేటర్”, కన్నడ చిత్రం “తిధి” నుంచి స్పూర్తి పొందినప్పటికీ.. తెలంగాణ నేటివిటీకి కథను ఆడాప్ట్ చేసుకున్న విధానం బాగుంది. సగటు మగాడి ఈగోను, సగటు మహిళ సహనాన్ని, సగటు యువకుడి వ్యక్తిత్వాన్ని, సగటు యువతి మానసిక వ్యధను అద్భుతంగా పండించాడు.

131 నిమిషాల పాటు ఒక చిన్న పల్లెటూరిలో ప్రేక్షకుల్ని కూర్చోబెట్టేశాడు. దర్శకుడిగా, కథకుడిగా వేణు 100 మార్కులతో స్టేట్ ర్యాంక్ కొట్టేశాడు. ఇండస్ట్రీకి వచ్చిన ఇన్నాళ్లకు దర్శకుడిగా తన ప్రతిభను ఘనంగా చాటుకున్న విధానం అభినందనీయం.

విశ్లేషణ: మనసుని హత్తుకొనే ఆత్మ కలిగిన సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. అలాంటి అరుదైన చిత్రమే “బలగం”. సహజమైన కథ, కథనం, సంగీతం, ఎమోషన్స్ కోసం ఈ “బలగాన్ని” కచ్చితంగా చూడాల్సిందే.

రేటింగ్: 3.5/5

Click Here To Read in ENGLISH

Rating

3.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus