నందమూరి బాలకృష్ణ తో లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ వంటి బ్లాక్ బస్టర్స్ అలాగే సమర సింహారెడ్డి, నరసింహ నాయుడు వంటి ఇండస్ట్రీ హిట్స్ తెరకెక్కించిన దర్శకుడు బి.గోపాల్.. మళ్ళీ బాలయ్యతో సినిమా చేస్తున్నారు అంటే అంచనాలు ఏ స్థాయిలో ఏర్పడతాయి అన్న విషయాన్ని మీ ఊహకే వదిలేస్తున్నాను. పైగా ఇంద్ర వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లు కావడంతో ‘పలనాటి బ్రహ్మనాయుడు’ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సీమసింహం, చెన్న కేశవ రెడ్డి చిత్రాలు సోసొగా ఆడినా ‘పలనాటి బ్రహ్మనాయుడు’ చిత్రం రికార్డులు తిరగ రాస్తుంది అని అంతా అనుకున్నారు.
మొదటి రోజు ఈ చిత్రానికి జరిగిన బుకింగ్స్ చూసి.. ట్రేడ్ సైతం షాక్ తింది. కానీ మొదటి షో పడిన తర్వాత ప్రేక్షకులే కాదు అభిమానులు కూడా పెదవి విరిచారు. సినిమా బాగోలేదు అంటే.. తర్వాత సినిమా హిట్ అవుతుంది లే అని సరిపెట్టుకుంటారు అభిమానులు. కానీ తమ అభిమాన హీరోని అత్యంత ఘోరంగా చూపిస్తూ ఎలివేట్ చేయడం వారు తట్టుకోలేకపోయారు. తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్లిపోవడం, కుర్చీలో కూర్చున్న మనిషి ముందుకు రావడం, కోడిపుంజు వెళ్ళి రౌడీ ని చంపడం వంటివి చూసి అభిమానులకు నవ్వాలో, ఏడవాలో కూడా తెలియని పరిస్థితి. పోనీ ఈ సినిమాలో బాలయ్యకు ఏమైనా సూపర్ నేచురల్ పవర్స్ ఉన్నట్టు చూపించినా.. ఏదో ఒక రకంగా డైజెస్ట్ చేసుకునే వారేమో.
నిజానికి బాలయ్య పై ట్రోలింగ్ అనేది ఈ సినిమా నుండే మొదలైంది. ఇక ఈ సినిమా రిజల్ట్ గురించి బాలయ్య ఓ సందర్భంలో మాట్లాడుతూ..’ ఏదో డైరెక్టర్ చెప్పారని చేశాను కానీ.. తర్వాత నాకు అనిపించింది.. తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్లిపోవడం ఎంటా అని ‘ అంటూ నవ్వుకున్నారు. ఇక దర్శకుడు మాట్లాడుతూ..’ మా బాలయ్య బంగారం.. నేను చెప్పింది గుడ్డిగా చేసేశాడు కనీసం అప్పుడు ఓ మాట కూడా నన్ను అడగలేదు.. ఆ సినిమా రిజల్ట్ చూశాక నన్ను ఒక్క మాట కూడా అనలేదు’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం విడుదలై ఈరోజుతో 18 ఏళ్ళు పూర్తి కావస్తోంది. 2003 వ సంవత్సరం జూన్ 5 న ఈ చిత్రం విడుదలైంది. 18 ఏళ్ళ తర్వాత బాలయ్య, బి.గోపాల్ కాంబినేషన్లో మరో మూవీ రాబోతుంది అని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది.