చెన్నై నుంచి చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కి తరలి వచ్చినప్పుడు.. అందరూ ఇక్కడే స్టూడియోలను నిర్మించారు. నందమూరి, అక్కినేని, రామానాయుడు, కృష్ణ కుటుంబ సభ్యులు సొంతంగా స్టూడియోలను నిర్మించుకున్నారు. అలాగే అతిపెద్ద స్టూడియోని రామోజీరావు నెలకొల్పారు. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో చిత్ర పరిశ్రమకూడా రెండుగా చీలిపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో రామానాయుడు స్టూడియో మినహా వసతులు లేకపోవడంతో అక్కడికి చిత్ర పరిశ్రమని కదిలించడానికి సంశయించారు. అందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సినీ పరిశ్రమకు వైజాగ్ లో 316 ఎకరాల్ని కేటాయించేందుకు జీవో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలిసింది.
ఈ స్థలంలో స్టూడియోల నిర్మాణానికి అనుమతులు ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రఖ్యాత ఏవీఎం స్టూడియోస్ సైతం ఓ కొత్త స్టూడియో ఏర్పాటుకు ఆసక్తిగా ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు వియ్యంకుడు నందమూరి నటసింహం బాలకృష్ణకు 10 నుంచి 20 ఎకరాల మేర స్టూడియో నిర్మాణానికి స్థలం ఇచ్చే అవకాశం ఉందని టాక్. అందుకు తగ్గ పనులను బాలయ్య సన్నిహితులు మొదలు పెట్టిన్నట్టు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. చంద్రబాబు కొత్త నిర్ణయం వల్ల వైజాక్ మరో ఫిలిం హబ్ గా మారనుందని భావిస్తున్నారు.