బాలకృష్ణ చాలా హుషారుగా ఉంటారు. అది సినిమాల్లో అయినా, బయట అయినా. అందరితో కలివిడిగా ఉంటూ అలరిస్తుంటారు. అలాంటి సరదా వ్యక్తి పాట పాడితే ఇంకా సరదాగా ఉంటుంది. గతంలో ఓసారి బాలయ్య ఇలా పాటపాడి అలరించారు కూడా. ఇప్పుడు మరోసారి తన గొంతు సవరించాలని చూస్తున్నారట. గతంలో అనూప్ రూబెన్స్ పాడిస్తే.. ఈ సారి ఆ అవకాశాన్ని తమన్ తీసుకుంటున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
బాలకృష్ణ – తమన్ కాంబినేషన్ సూపర్ హిట్. ఇద్దరూ కలిస్తే థియేటర్లలో బాక్సులు బద్ధలైపోతాయి. మొన్నీమధ్య వచ్చిన ‘అఖండ 2: తాండవం’ సినిమాలో కూడా మనం చూశాం. మరోసారి ఈ ఇద్దరూ కలసి పని చేస్తున్నారు. అదే గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న బాలకృష్ణ 111వ సినిమా. చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ పోస్టర్‌ను ఇటీవల లాంచ్ కూడా చేశారు. ఈ సినిమా తమన్ సంగీత దర్శకుడు. అందులోనే ఇప్పుడు బాలయ్య పాడబోతున్నాడు.
అంతేకాదు ఈ పాట.. ‘బాహుబలి’ సినిమాలో ప్రముఖ సింగర్ దలేర్ మెహందీ పాడిన ‘సాహోరే బాహుబలి..’ పాటలా ఉంటుందట. అంటే ఫుల్ హైలో హై పిచ్‌లో ఈ పాటను రికార్డు చేస్తారట. గతంలో బాలయ్య ‘పైసా వసూల్’ సినిమాలో పాడిన ‘మామా ఏక్ పెగ్‌లా..’ పాట గుర్తుందా? ఆ రోజుల్లో ఆ పాట ఒక ట్రెండ్‌సెటర్. ఇప్పుడు ఇన్నాళ్లకు మళ్లీ బాలయ్య ఆ రేంజి మజా ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.
ఇక ఈ సినిమాలో బాలకృష్ణ హీరో, విలన్‌గా నటిస్తారని సమాచారం. ఇలాంటి పౌరాణిక, రాజుల టచ్ ఉన్న పాత్రలు బాలయ్య చేసి చాలా ఏళ్లయింది. అందుకే ఈ సినిమా అనౌన్స్‌మెంట్, నేపథ్యం చెప్పినప్పటి నుండి ఫ్యాన్స్ ఫుల్ హైలో అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో నయనతార మహారాణిలా కనిపించబోతోంది. ఇటీవల ఈ లుక్‌లు విడుదల చేశారు. అన్నట్లు ఇందులో తమన్నా ఓ ప్రత్యేక గీతంలో కనిపిస్తుందని టాక్.