బాలకృష్ణుడు

నారా రోహిత్ కథానాయకుడిగా పవన్ మల్లెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “బాలకృష్ణుడు”. ఫ్యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో రెజీనా కథానాయికగా నటించింది. చానాళ్ళుగా సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్న నారా రోహిత్ కు ఈ చిత్రమైనా హిట్ ఇచ్చిందా లేక మరోమారు నిరాశపరిచిందా అనేది తెలుసుకొందాం..!!

కథ : బాల అలియాస్ బాలకృష్ణుడు (నారా రోహిత్) బాపూ అనే గూండా దగ్గర పనిచేస్తుంటాడు. హైద్రాబాద్ లో ఉండే ఆద్య (రెజీనా)ను సేఫ్ గా చూసుకోవడం కోసం రోజుకి రెండు లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఆమెకు తెలియకుండానే ఆమె బాడీ గార్డ్ లా వ్యవహరిస్తుంటాడు. అదే టైమ్ లో ఆమెతో ప్రేమలోనూ పడతాడు. కట్ చేస్తే.. ఆద్యను చంపడం కోసమే జైల్ నుంచి తప్పించుకువచ్చిన ప్రతాప్ రెడ్డి (అజయ్) అనుకోకుండా బాల కార్ ఎక్కడం, ప్రతాప్ ను బాల కిడ్నాప్ చేసి అతడ్ని అతడి శత్రువులకు 10 కోట్ల రూపాయలకు అమ్మేయడం జరుగుతుంది. ఈ గోడవతో ఏమాత్రం సంబంధం లేని వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ (పృధ్వీ) కూడా ఇరుక్కుంటాడు. అసలు ఆద్యను చంపాలని ప్రతాప్ రెడ్డి ఎందుకు ఆరాటపడుతుంటాడు? ఆద్యను ప్రేమిస్తున్న బాల ఆమెను కాపాడి తన ప్రేమను గెలుచుకోగలిగాడా? వంటి ప్రశ్నలకు సమాధానమే “బాలకృష్ణుడు” చిత్రం.

నటీనటుల పనితీరు : పబ్లిసిటీలో చెప్పినట్లుగా నారా రోహిత్ ఏ ఒక్క ఫ్రేమ్ లోనూ సిక్స్ ప్యాక్ చూపించకపోగా.. ఒక్కో ఫ్రేమ్ లో ఒక్కోలా కనిపిస్తూ కన్ఫ్యూజ్ చేశాడు. పర్సనాలిటీ విషయం పక్కన పెడితే.. పెర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం ఎప్పట్లానే అదరగొట్టాడు. అయితే.. ఫైట్ సీక్వెన్స్ ల విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవాల్సింది. ఏదో కామెడీ ఫైట్స్ లా కనిపించాయే తప్ప ఎక్కడా ఎమోషన్ కానీ ఎలివేషన్ కానీ కనిపించలేదు.

రెజీనాను ఈ సినిమాలో యాక్టింగ్ పర్పస్ కంటే ఎక్కువగా గ్లామర్ షోకి వాడారు. ఆమె చేత పొట్టిపొట్టి మిడ్డీలు వేయించి లో యాంగిల్, టాప్ యాంగిల్లో కెమెరాలు పెట్టి ఆమె యద లోతులను, తొడ సౌందర్యాలను స్క్రీన్ పై ప్రెజంట్ చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపించాడు దర్శకుడు. దాంతో ఆమె ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ ఎవరూ పట్టించుకొలేదు. పృధ్వీ మరోమారు తన కామెడీ టైమింగ్ తో వీరలెవల్లో నవ్వించాడు. ముఖ్యంగా పృధ్వీ సింగిల్ లైన్ పంచ్ డైలాగులకి థియేటర్ లో జనాలు విరగబడి నవ్వడం ఖాయం. ఫ్యాక్షన్ లీడర్ రోల్ లో అజయ్ చాలా కన్విన్సింగ్ గా ఉన్నాడు కానీ.. క్యారెక్టర్ కి సరైన డెప్త్ లేకపోవడంతో విలనిజం అనుకొన్న స్థాయిలో పండలేదు. రమ్యకృష్ణ, వెన్నెలకిషోర్ వంటి సీజన్డ్ ఆర్టిస్ట్స్ చిన్న చిన్న పాత్రలకి పరిమితం అయిపోయారు.

సాంకేతికవర్గం పనితీరు : మణిశర్మ నేపధ్య సంగీతంతో సినిమాని రక్తి కట్టించాడు. అయితే.. ఆయన రూపొందించిన బాణీలు బాగున్నప్పటికీ, పిక్చరైజేషన్ సరిగా లేకపోవడంతో ఆ పాటలు జనాలకి సరిగా ఎక్కవు. నిర్మాణ విలువలు సహకరించలేదో లేక ఆర్టిస్ట్స్ సహకరించలేదో తెలియదు కానీ.. విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. పాటల పిక్చరైజేషన్ వరకూ పర్లేదు కానీ.. హీరోయిన్స్ క్లివేజ్ మీద ఎక్కువ కాన్సన్ ట్రేట్ చేయడం, ఫైట్ సీక్వెన్స్ లను చిత్రించిన విధానం ఏమాత్రం ఆకట్టుకోలేకపోగా చిరాకు పెట్టింది. స్ట్రయిట్ స్క్రీన్ ప్లేలో కూడా ఏదో కన్ఫ్యూజన్ క్రియేట్ చేద్దామని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.

దర్శకుడు పవన్ మల్లెల కథపై పెద్దగా శ్రద్ధ చూపలేదు సరికదా స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకొనే విధంగా రాసుకోలేదు. పృధ్వీ క్యారెక్టర్ మాత్రం పూర్తిస్థాయి కామెడీ పండించేలా బాగా డిజైన్ చేసుకొన్నాడు. అందువల్ల సినిమా మొత్తంలో కేవలం పృధ్వీ క్యారెక్టర్ మాత్రమే ఆడియన్స్ ను ఓ మోస్తరుగా ఆకట్టుకొంటుంది. ఆల్రెడీ ఈ తరహా కథలు తెలుగులో కోకొల్లలుగా వచ్చి ఉండడం, సినిమాలో పృధ్వీ కామెడీ మినహా ఆకట్టుకొనే అంశం ఒక్కటి కూడా లేకపోవడం వంటి కారణాల వల్ల దర్శకుడిగా పవన్ మల్లెల ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి.

విశ్లేషణ : మాస్ ఆడియన్స్ కు కావాల్సిన అందాల ఆరబోతలు, ఐటెమ్ సాంగ్, ఫైట్స్, కామెడీ వంటి అంశాలన్నీ పుష్కలంగా ఉన్నప్పటికీ సరైన కథనం లేకపోవడంతో ఆడియన్స్ ను ఆకట్టుకోలేని “బాలకృష్ణుడు” చిత్రాన్ని కేవలం పృధ్వీ కామెడీ కోసం ఒకసారి చూడవచ్చు.

రేటింగ్ : 1.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus