సినిమా అంటే నందమూరి బాలకృష్ణకు ఎంత ప్యాషనో మనం కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన ఎంచుకునే పాత్రలు, దాని కోసం ఆయన పడే కష్టం, పాత్ర కోసం ఆయన తనను తాను మలచుకునే విధానం మనకు ఎప్పటి నుండో తెలుసు. సినిమా ఒప్పుకుంటే.. అది పూర్తయ్యే వరకు ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తుంటాడు. ఇది తొలి సినిమా నుండే ఉందట. దానికి ఓ ఉదాహరణ చెప్పాలంటే బాలకృష్ణ – బి.గోపాల్ కలయికలో వచ్చిన ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ గురించి చెప్పాలి. ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి మాట్లాడుకోవాలి.
‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ చిత్రీకరణ సమయంలో షూటింగ్‌కి రావడానికి బాలకృష్ణ ఓ కండిషన్ పెట్టారంటే నమ్మగలరా. అదేంటి.. బాలకృష్ణ అంటే దర్శకుల హీరో అని అంటారు కదా… మరి అలా ఎందుకు చేశారు అనుకుంటున్నారా? అసలు బాలకృష్ణ ఎందుకు అలా చేశారో తెలిస్తే బాలకృష్ణ నటన మీద ఉన్న ప్యాషన్ మీకు అర్థమవుతుంది. ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ కోసం బాలకృష్ణ చాలా హోం వర్క్ చేశారు. పోలీసులు ఎలా నడుస్తారు, ఎలా లాఠీ పట్టుకుంటారు, జీపులో ఎలా కూర్చుంటారు లాంటి విషయాలపై అవగాహన తెచ్చుకున్నారు.
సినిమా చిత్రీకరణ జరిగినన్ని రోజులూ బాలకృష్ణ ఆ పాత్రలో లీనమైపోయారట. నిజం పోలీసులానే ఫీలయ్యారట. ఆ ఫీల్ కంటిన్యూ అవ్వడానికి ఇంటి నుంచి షూటింగ్ స్పాట్‌కి పోలీసు (సినిమాలో వాడిన) జీపులోనే చిత్రీకరణకు వచ్చేవారట. ఓ రోజు చిత్రబృందానికి బాలకృష్ణ ఫోన్ చేసి సినిమాలో నేను వాడుతున్న జీపు పంపిస్తే అందులోనే షూటింగ్‌కి వస్తా అన్నారట. అప్పుడే ఆ పాత్రలో లీనమవ్వగలను అని చెప్పారట. ఎప్పుడూ ఏసీ కారులో వచ్చే బాలకృష్ణ, ఆ రోజు పోలీసు జీపులో పోలీసులా కాలు బయట పెట్టి, లాఠీ తిప్పుతూ వచ్చారట. సినిమా చిత్రీకరణ జరిగినన్ని రోజులూ అలానే వచ్చారట. ఈ విషయాల్ని ఆ మధ్య చిత్ర దర్శకుడు బి.గోపాల్ చెప్పారు.