ఆర్. నారాయణ మూర్తి అనగానే ఎక్కువగా విప్లవాత్మక సినిమాల్లో నటిస్తుంటారు అని అంతా భావిస్తారు. అయితే, ఆయన కెరీర్ ఆరంభంలో అన్ని రకాల సినిమాలు చేశారు. ఈ విషయం చాలా మందికి తెలిసుండకపోవచ్చు.కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘నేరము శిక్ష’ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ను ప్రారంభించిన ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా అంటే ‘అర్ధరాత్రి స్వాతంత్య్రం’ అనే చెప్పాలి. అటు తర్వాత చిరంజీవితో కలిసి ‘కోతల రాయుడు’ ‘ప్రాణం ఖరీదు’ వంటి సినిమాల్లో కూడా నటించారు అనే విషయం ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో రూపొందిన ‘ఒరేయ్ రిక్షా’ సినిమా అతనికి ‘పీపుల్స్ స్టార్’ అనే ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. అయితే అటు తర్వాత ఆయన కమర్షియల్ సినిమాలు చేయడం మానేశారు. జనాల్లో చైతన్యం నింపడానికి కేవలం విప్లవాత్మక సినిమాలు అయితేనే కరెక్ట్ అని భావించారు ఆర్.నారాయణ మూర్తి.
దీంతో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించే ఛాన్సులు కూడా మిస్ చేసుకున్నారు. ఇందులో ‘టెంపర్’ మాత్రమే ఉంది అని అంతా అనుకున్నారు. ఆ సినిమాలో పోసాని కృష్ణమురళి చేసిన పాత్రకి ముందుగా ఆర్.నారాయణ మూర్తిని అనుకున్నారు పూరి.
కానీ ఆ ఆఫర్ ను ఆర్.నారాయణ మూర్తి సున్నితంగా తిరస్కరించారు.కమర్షియల్ సినిమాలు చేయనని చెప్పినట్టు కూడా అప్పట్లో టాక్ నడిచింది. బహుశా అందుకేనేమో త్రివిక్రమ్ సినిమాలో కూడా ఛాన్స్ మిస్ చేసుకున్నారు ఆర్.నారాయణ మూర్తి. అవును ఈరోజు జరిగిన ‘యూనివర్సిటీ పేపర్ లీక్’ అనే సినిమా ప్రెస్ మీట్ జరిగింది. ఆర్.నారాయణ మూర్తి ప్రధాన పాత్ర పోషించిన సినిమా ఇది. దీనికి గెస్ట్ గా దర్శకుడు త్రివిక్రమ్ విచ్చేశారు.
ఇందులో భాగంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘మీకు తెలుసో లేదో.. మీ కోసం నా సినిమాలో ఓ పాత్రని రాసుకున్నాను. కానీ మీరు చేయరు అని కచ్చితంగా మా వాళ్ళు చెప్పారు. డబ్బుతో ఆర్.నారాయణ మూర్తిని కొనలేరు అని చాలా మంది చెప్పారు. అందుకే మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు’ అంటూ త్రివిక్రమ్ ఆర్.నారాయణ మూర్తితో అన్నారు. దీంతో ఆర్.నారాయణ మూర్తి మిస్ చేసుకున్న త్రివిక్రమ్ సినిమా ఏంటా? అని అంతా నెటిజెన్లు చర్చించుకుంటున్నారు.