సాధారణంగా ఒక దర్శకుడి సినిమా ఫ్లాపయ్యిందంటే.. ఆ ఎఫెక్ట్ అనేది సదరు దర్శకుడి తదుపరి సినిమాల మీద పడుతుంది. కొన్ని ప్రాజెక్టులు డిలే అయితే.. ఇంకొన్ని ఏకంగా డ్రాప్ అయిపోతాయి. క్రిష్ కూడా అదే తరహా పరిస్థితి ఎదుర్కొన్నాడు. ఆయన తెరకెక్కించిన “ఘాటి” బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలవడమే కాక, దర్శకుడిగా క్రిష్ పనితనం మీద చాలా సందేహాలు రేకెత్తించింది. దాంతో ఆయన తదుపరి సినిమా ఏంటి అనే విషయంలో క్లారిటీ కొరవడింది.
బాలకృష్ణ కెరీర్లో కలికితురాయి లాంటి “ఆదిత్య 369”కి సీక్వెల్ గా “ఆదిత్య 999” తీద్దామనేది బాలయ్య ఆశ. ఆ సినిమాతో హీరోగా ఆయన కుమారుడు మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేసి తానే దర్శకత్వం వహిద్దామనుకున్నాడు కూడా. కానీ.. మోక్షజ్ఞ సినిమాల్లోకి రావడానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉండడం, ఒకవేళ వచ్చినా అతని టేస్ట్ వేరేలా ఉండడంతో ఆ సీక్వెల్ లో తానే నటించాలని ఫిక్స్ అయ్యారు.
ఆయన నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించడం కష్టం కాబట్టి.. తన ఫేవరెట్ డైరెక్టర్ లిస్ట్ లో ఒకరైన క్రిష్ కి ఆ బాధ్యతలు అందించాలని అనుకున్నారు. అయితే.. ఘాటి ఫ్లాప్ అవ్వడంతో బాలయ్య ఆ ఆలోచనను ఏమైనా మార్చుకున్నారా అనే సందేహాలు వెలువడ్డాయి. అయితే.. బాలయ్య మాత్రం క్రిష్ టాలెంట్ మీద నమ్మకంతో ఎలాంటి సందేహం లేకుండా “ఆదిత్య 999” చిత్రం దర్శకత్వ బాధ్యతలు క్రిష్ కి అందించాడట.
మరి క్రిష్ ఈ సువర్ణావకాశాన్ని ఎంతవరకూ సరిగ్గా వాడుకుని కమ్ బ్యాక్ ఇస్తాడో చూడాలి. ఎందుకంటే.. మంచి సినిమాలు తీస్తాడు అనే పేరు ఉన్నప్పటికీ, కమర్షియల్ గా వర్కవుట్ అయ్యే ప్రాజెక్ట్స్ అందించడంలో మాత్రం క్రిష్ ఇప్పటికెవరకు తన సత్తా చాటుకోలేదు. సో, ఈ సినిమాతో తన కళాత్మకతతోపాటుగా, కమర్షియల్ గా తన స్థాయిని పెంచుకునే ప్రయత్నంలో క్రిష్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.