కన్నడలో రూపొంది పాన్ ఇండియన్ సినిమాగా విడుదలైన తాజా చిత్రం “బనారస్”. జైడ్ ఖాన్ & సోనాల్ మొంటీరో జంటగా నటించిన ఈ చిత్రానికి జయతీర్ధ దర్శకుడు. ఇప్పటివరకూ విడుదలైన టీజర్ & ట్రైలర్ సినిమా మీద ఎలాంటి ఆసక్తి రేకెత్తించలేకపోయాయి. మరి సినిమా ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ: ఎలాగైనా ధని (సోనాల్)ను తన ప్రేమలో పడేస్తానని ఫ్రెండ్స్ దగ్గర బెట్ కడతాడు సిద్ధార్ధ్ (జైడ్ ఖాన్). ఆ క్రమంలో ఆమెను ప్రపోజ్ చేసి.. ఆమెను ఆకట్టుకుంటాడు. అదే సందర్భంలో తనకు తెలియకుండానే ఆమెను సమస్యలో పడేస్తాడు. తర్వాత తప్పు తెలుసుకొని..
ఆమెకు క్షమాపణ చెప్పడం కోసం బనారస్ వెళతాడు. కట్ చేస్తే.. బనారస్ వచ్చిన సిద్ధార్ధ్ కు కొన్ని విచిత్రమైన సందర్భాలు ఎదురవుతుంటాయి. ఎందుకలా జరుగుతుంది? ఈ పరిస్థితికి టైమ్ లూప్ అనేది ఎలా ఉపయోగపడింది? అనేది “బనారస్” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.
నటీనటుల పనితీరు: పరిచయ చిత్రమైనప్పటికీ.. జైడ్ ఖాన్ చక్కగా నటించాడు. హీరోయిన్ సోనాల్ తో అతడి కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. సినిమాకి హైలైట్ గా పేర్కొనాల్సిన ఏకైక విషయం వీళ్ళ కెమిస్ట్రీ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
సోనాల్ హావభావాలు, స్క్రీన్ ప్రెజన్స్ బాగున్నాయి. ఆమెకు నటిగా మంచి భవిష్యత్ ఉంది. మిగతా ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎప్పట్లానే తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. ఒక సాధారణ కథను దృశ్యకావ్యంలా మలచడంలో అతడి పనితనం కనిపించింది. ముఖ్యంగా బనారస్ లొకేషన్స్ ను భలే చూపించాడు. ఎడిటింగ్ మాత్రం ఇంకాస్త షార్ప్ గా ఉంటే బాగుండేది. దర్శకుడు జయతీర్ధ పేపర్ మీద రాసుకున్న కథను.. సినిమాగా తెరకెక్కించడంలో తడబడ్డాడు.
ముఖ్యంగా ఇంటర్వెల్లో ట్విస్ట్ రివీల్ అయ్యాక సెకండాఫ్ ను సరిగా నడిపించలేకపోయాడు. అందువల్ల సినిమా ఎంత కలర్ ఫుల్ గా ఉన్నా.. ఆడియన్స్ బోర్ ఫీలవుతారు. సో, దర్శకుడిగా పర్వాలేదనిపించుకున్న జయతీర్ధ, కథకుడిగా మాత్రం ఫెయిల్ అయ్యాడు. ప్రొడక్షన్ డిజైన్ & వి.ఎఫ్.ఎక్స్ వర్క్ బాగున్నాయి.
విశ్లేషణ: ఒక మంచి ప్రేమకథకు విజువల్ బ్యూటీతోపాటు.. కథనం కూడా చాలా ముఖ్యం. ఆ విషయాన్ని చిత్రబృందం కాస్త సీరియస్ గా తీసుకొని ఉంటే బాగుండేది. అది మిస్ అవ్వడంతో “బనారస్” యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది.
రేటింగ్: 2/5