‘మా’ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా తన గెలుపు పక్కా అని.. తనకు ఎంతమంది ఆశీర్వాదాలు ఉన్నాయో ఎవరికీ తెలియదని సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఆయన స్వతంత్రంగా జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం ఆయన అనతరం విలేకరులతో మాట్లాడారు. ‘మా’ ఎన్నికల్లో తాను రాకెట్ లా దూసుకెళ్తున్నానని.. తన విజయాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు.
తాను గెలిస్తే.. 100 మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందేలా కృషి చేస్తానని చెప్పారు. ‘మా’ అసోసియేషన్ కి భవనం కావాలి.. కానీ జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతంలో ప్యాలెస్ కడతామంటే కుదరదని అన్నారు. ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందో లేదో తెలియదు కానీ.. కాస్త దూరమైనా కోకాపేట ప్రాంతంలో స్థలం తీసుకొని.. వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించాలని అన్నారు. దానికోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరకు వెళ్లి.. స్థలం ఇవ్వమని అడగాలని అన్నారు.
అయ్యేపనుల గురించి మాట్లాడితే మంచిదని సెటైర్లు వేశారు. ఫండ్స్ కోసం విదేశాలకు వెళ్తామని చేసిన వ్యాఖ్యలను బండ్ల గణేష్ తప్పుబట్టారు. అంత అవసరం లేదని.. సినిమా ఇండస్ట్రీలో వినోదాన్ని పంచె కళాకారులూ చాలా మంది ఉన్నారని.. అలాంటిది వేరే వాళ్ల దగ్గరకు వెళ్లి ఫండ్ తీసుకురావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మన హీరోలు బంగారు గనులని.. కోహినూర్ వజ్రాలని.. ఆ వజ్రాలు ప్రకాశిస్తే.. ఎన్నో భవనాలు కట్టొచ్చని అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ప్రోగ్రాం చేసి.. వచ్చిన డబ్బుతోనే ఇళ్లు కట్టొచ్చని అన్నారు.