వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సూర్య తన ఫేవరెట్ డైరెక్టర్ కె.వి.ఆనంద్ దర్శకత్వంలో నటించిన చిత్రం “కాప్పన్”. ఈ చిత్రాన్ని “బందోబస్త్”గా అనువదించి విడుదల చేస్తున్నారు. రెండు నెలల క్రితమే విడుదలవ్వాల్సిన ఈ చిత్రం కారణాంతరాల వలన ఎట్టకేలకు నేడు విడుదలైంది. మరి ఈ సినిమా సూర్యకు ఫ్లాపుల నుంచి ఊరటనిచ్చిందా లేదా అనేది చూద్దాం..!!
కథ: స్పెషల్ ప్రోటక్షన్ గ్రూప్ (ఎస్.పి.జి)కి చెందిన కమాండర్ కిషోర్ (సూర్య)ను ప్రధానమంత్రి చంద్రకాంత్ వర్మ (మోహన్ లాల్)కు ప్రధాన సెక్యూరిటీ ఇన్ చార్జ్ గా నియమిస్తారు. అప్పటికే ప్రధానిని చంపడానికి కుట్ర జరుగుతుందని సీరియస్ ఇన్ఫో ఉన్న కారణంగా అది ప్రయత్నిస్తున్నవారు ఎవరు అని ఇన్వెస్టిగేట్ చేస్తున్న తరుణంలోనే.. ఒక మిలటరీ ఆపరేషన్ లో ప్రధామంత్రిని హతమారుస్తారు.
అసలు ఒక దేశ ప్రధానిని చంపేంత అవసరం, నెట్వర్క్ ఎవరికి ఉంది? అని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలెట్టిన కిషోర్ కి కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి. ఏమిటా నిజాలు? ఇంతకీ అసలు దొంగలు ఎవరు అనేది తెలియాలంటే “బందోబస్త్” చూసి తెలుసుకోండి.
నటీనటుల పనితీరు: సూర్య, మోహన్ లాల్ వంటి అద్భుతమైన నటులు ఉన్నప్పటికీ.. వారి నుంచి పాత్రకు తగ్గ నటనను రాబట్టుకోలేకపోయాడు దర్శకుడు కె.వి.ఆనంద్. సూర్య పోషించిన పాత్రలో చాలా షేడ్స్ ఉన్నప్పటికీ.. అవి ఎందుకు వస్తున్నాయో అర్ధం కాదు. మోహన్ లాల్ పాత్ర మోడీని తలపిస్తుంది కానీ.. ఒక డీప్ క్యారెక్టరైజేషన్ అనేది ఉండదు.
ఇక నిజజీవిత భార్యాభర్తలు సాయేషా, ఆర్య పోషించిన పాత్రలు ఏమిటనేది దర్శకుడు కె.వి.ఆనంద్ క్లారిటీ ఇస్తే బాగుంటుంది.
సాంకేతికవర్గం పనితీరు: ఒక సాధారణ కథ తీసుకొని.. ఆ కథలో కొన్ని అసాధారణ అంశాలను జొప్పించి.. ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో సినిమాను నడిపించడంలో కె.వి.ఆనంద్ సిద్ధహస్తుడు. ఆయన తెరకెక్కించిన “రంగం, వీడొక్కడే, అనేకుడు, బ్రదర్స్” అన్నీ వేటికవే వైవిధ్యంగా ఉంటాయి. కానీ.. మొదటిసారి కెమెరామెన్ టర్నడ్ డైరెక్టర్ అయిన కె.వి.ఆనంద్ కథకుడిగా-దర్శకుడిగా దారుణంగా ఫెయిల్ అయ్యాడనిపిస్తుంది. అసలు కథ అనేది చివరి వరకు అర్ధం కాదు, ఒక కొలిక్కి కూడా రాదు. ఇక ఆ కథనం ఏంటో.. మధ్యలో ఆ పాటలు ఎందుకు ఇరికించాడో? దేశ ప్రధానిని చంపడం అంటే ఏదో లోకల్ ఎమ్మెల్యేను చంపినంత ఈజీ అన్నట్లు చూపించడం ఏమిటో? అనేది ఎంత ఆలోచించినా అర్ధం కాని విషయం.
హరీష్ జైరాజ్ నేపధ్య సంగీతం, పాటలు ఈ సినిమాకి పెద్ద మైనస్. ఎం.ఎస్.ప్రభు సినిమాటోగ్రఫీ & ప్రొడక్షన్ వేల్యుస్ బాగున్నాయి కానీ.. వాళ్ళ ఖర్చు మొత్తం ఏమాత్రం ఆకట్టుకోలేని కథ-కథనాల కారణంగా బూడిదలో పోసిన పన్నీరుని తలపిస్తుంది.
విశ్లేషణ: సూర్య అంటే విపరీతమైన అభిమానంతోపాటు.. లాజిక్స్ అనేవి పొరపాటున కూడా పట్టించుకోకుండా చూడగలిగితేనే “బందోబస్త్”ను ఒకసారి ఓపిగ్గా చూడవచ్చు. లేదంటే మాత్రం కష్టమే.