చూసిన సినిమాను మళ్లీ చూడాలంటేనే కష్టం అంటుంటారు మన జనాలు. అలాంటి ఎప్పుడో 16 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాను మళ్లీ తీస్తా అంటే చూస్తారా? అంటే దాని మీద చర్చ జరగాల్సిందే. ఈ చర్చ అంతా ఎందుకో మీకు ఇప్పటికే అర్థమైపోయుంటుంది. అదే ‘ఛత్రపతి’. ప్రభాస్ తన సత్తా చాటిన సినిమాను ఇప్పుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ బాలీవుడ్‌లోకి తీసుకెళ్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కేవలం బాలీవుడ్ సినిమా కాదట. అవును ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో రూపొందిస్తారట.
ప్రభాస్ చేసిన పాత్రను బెల్లంకొండ హ్యాండిల్ చేయగలుగుతాడా లేదా అనే డౌట్ ఇంకా జనాల్లో ఉండగానే… తెలుగులోనూ ఈ సినిమా వస్తుందని వార్తలు రావడంతో ఆ కన్‌ఫ్యూజన్ ఇంకా పెరిగింది. ఏదో బాలీవుడ్‌లో రీమేక్ చేసుకుంటున్నాడు కదా… మన దగ్గర కాదు కదా అనుకుంటుడగా… తెలుగులో కూడా తీసుకొస్తాం అనేసరికి వామ్మో ఇదేం ప్లాన్ బాబూ అంటున్నారు. అయితే దీని కోసం వాళ్ల దగ్గర వేరే ఆన్సర్ ఉంది. ‘ఛత్రపతి’ సినిమాను అచ్చు గుద్దినట్లు బాలీవుడ్‌లో తీయడం లేదనేది వారి సమాధానం.
సినిమా సెకండాఫ్‌లో చాలా మార్పులు చేశారట. కాబట్టి కొత్త సినిమాలా ఉంటుందట. అలాగే ‘ఛత్రపతి’ వీవీ వినాయక్ డైరక్షన్‌లో ఎలా ఉంటుంది అని అనుకునేవారు సినిమాకు వస్తారని భావిస్తున్నారట. అయితే తెలుగు దర్శకుడు చేసిన సినిమా, అందులో ప్రస్తుతం రన్నింగ్‌లో ఉన్న స్టార్ దర్శకుడు చేసిన సినిమాను… వేరే దర్శకుడు చేయడం, దానిని మనం చూడటం కొత్త అనుభూతే.