తెలుగు చిత్రాల్లో కుటుంబసభ్యుల మధ్య ఉండే అనుబంధాన్ని మన దర్శకులు చాలా చక్కగా చూపించారు. అలాగే తండ్రి కొడుకులు, కూతుళ్ల మధ్య ప్రేమను కూడా మనసుకు హత్తుకునేలా తెరకెక్కించారు. రేపు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి గొప్పదనాన్ని చాటే సినిమాలపై ఫోకస్..
1. డాడీమెగాస్టార్ చిరంజీవి తండ్రి పాత్ర పోషించిన సినిమా డాడీ. బేబీ అనుష్క ఇందులో చిరు కూతురుగా నటించింది. కొడుకుగా, అన్నగా మెప్పించిన మెగాస్టార్ డాడీగా కంటతడి పెట్టించారు. బేబీ అనుష్క, చిరు మధ్య వచ్చే సన్నివేశాలకు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు.
2. నాన్నకు ప్రేమతోమాస్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో ఎన్టీఆర్.. కమర్షియల్ హంగులకు దూరంగా చేసిన మూవీ నాన్నకు ప్రేమతో. ఇందులో తన తండ్రిని మోసం చేసిన వ్యక్తి ఆటకట్టించడానికి ఎన్టీఆర్ చేసే ప్రయత్నం బాగా ఆకట్టుకుంటుంది. అలాగే పిల్లలను పెంచడానికి రాజేంద్రప్రసాద్ ఎలా కష్టపడ్డాడో చెప్పే సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది.
3. అమృతసొంత తండ్రి కాకపోయినా అంతకంటే ఎక్కువగా పెంచుకునే బిడ్డపై ప్రేమ చూపించడమే అమృత సినిమాలో అందరికీ నచ్చిన అంశం. ఇందులో తండ్రి గా మాధవన్, కూతురిగా కీర్తన అద్భుతంగా నటించి మెప్పించారు.
4. బొమ్మరిల్లుకొడుకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని తాపత్రయ పడే తండ్రి, తండ్రి బాటలో కాకుండా సొంతదారిలో నడిచి తండ్రి అంత వాడిని కావాలని కోరుకునే కొడుకు.. వీరిద్దరి మధ్య వచ్చే సంఘర్షణలను భాస్కర్ బొమ్మరిల్లు సినిమాలో నేచురల్ గా చూపించారు. తండ్రిగా ప్రకాష్ రాజ్, కొడుకుగా సిద్ధార్ద్ జీవించి అందరి హృదయాల్లో నిలిచిపోయారు.
5. సన్ అఫ్ సత్యమూర్తికొడుకు మంచి పనులు చేసి తండ్రికి మంచి పేరు తీసుకురానవసరం లేదు కానీ.. తండ్రికున్న మంచి పేరును చెడగొట్టకుండా ఉంటే చాలు. ఇదే అంశంతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన మూవీ సన్ అఫ్ సత్యమూర్తి. తండ్రి ఇచ్చిన మాట వట్టి మాట కాకూడదని ప్రాణాలను సైతం లెక్క చేయని కొడుకు పాత్రలో అల్లు అర్జున్ నటన శెభాష్ అనిపించుకుంది.
6. సుస్వాగతంబిడ్డ ఒక వయసుకు ఎదిగిన తర్వాత తండ్రి స్నేహితుడిగా ఉండాలని చెబుతుంటారు. వాటిని కొంతమంది మాత్రమే పాటిస్తుంటారు. అలా ఉంటే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టిన సినిమా సుస్వాగతం. రఘువరన్, పవన్ కళ్యాణ్ తండ్రి కొడుకులుగా కాకుండా మంచి మిత్రుల్లా నటించి అభినందనలు అందుకున్నారు.
7. కొత్త బంగారులోకంమనం ఎంత అభివృద్ధి చెందుతున్నా.. మన మధ్య ఉండే ఫీలింగ్స్ లో మార్పు ఉండదు. తండ్రి కొడుకుల మధ్య ప్రేమ ఇంకా బలపడుతుంది. నేటి తండ్రి కొడుకులుగా ప్రకాష్ రాజ్, వరుణ్ సందేశ్ కొత్త బంగారు లోకం సినిమాలో నటించి ఎందరికో స్ఫూర్తి నిచ్చారు.
8. సూర్య S/O కృష్ణన్ప్రతి కొడుక్కి తండ్రే రియల్ హీరో. ప్రతి విషయంలోనూ నాన్నని స్ఫూర్తిగా తీసుకునే కోడలు చాలామంది ఉన్నారు. అటువంటి తండ్రికొడుకులమధ్య ఉండే అనుబంధాన్ని సూర్య S/O కృష్ణన్ లో చూపించారు. తండ్రి కొడుకుల పాత్రలో సూర్య నటించి అందరి ప్రసంశలు అందుకున్నారు.
9. ఆకాశమంతఒకనికొక ఊరిలో ఒకే ఒక అయ్యా.. ఒకే ఒక అయ్యకి తోడు ఒకే ఒక అమ్మ.. ఆకాశమంత సినిమా కథని మొత్తం ఈ ఒక్క లైన్లో చెప్పేసారు. కూతురు మంచి ఇంటికి కోడలుగా వెళ్లాలని తపన పడే నాన్న గా ప్రకాష్ రాజ్ మరో మారు అద్భుతంగా నటించారు. తండ్రిని అమితంగా ప్రేమించే కూతురిగా త్రిష అందరి మనసులని దోచుకుంది.
10. నాన్నవయసు పెరిగినా బుద్ధి ఎదగని తండ్రి, అతనికి తెలివైన కూతురు. తాను లేకపోతే తండ్రి ఏమైపోతాడనే బాధపడే అమ్మాయి.. తాను దూరమైతేనే పాపాయి భవిష్య్తతు బాగుంటుందనే తండ్రి.. మొదలు నుంచి చివరి వరకు పూర్తిగా తండ్రి కూతుళ్ళ ప్రేమతో నిండిన సినిమా నాన్న. విలక్షణ నటుడు విక్రమ్ తండ్రిగా, కూతురిగా సారా తమ నటనతో అందరినీ కంటతడి పెట్టించారు.