భరత్ అనే నేను

  • April 20, 2018 / 07:15 AM IST

“శ్రీమంతుడు” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం మహేష్ బాబు-కొరటాల శివల కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం “భరత్ అనే నేను”. క్లీన్ పోలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నేడు (ఏప్రిల్ 20) మహేష్ మదర్ ఇందిరమ్మ పుట్టినరోజు సందర్భంగా విడుదలైంది. మహేష్ మునుపటి చిత్రాలు “బ్రహ్మోత్సవం, స్పైడర్” అభిమానులను నిరాశపరిచి ఉండడంతో “భరత్ అనే నేను”పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి మన అందమైన ముఖ్యమంత్రి ఆ అంచనాలను ఏమేరకు అందుకోగలిగాడో చూద్దాం..!!

కథ : సమైఖ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (శరత్ కుమార్) హఠాన్మరణంతో పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన వరదరాజులు (ప్రకాష్ రాజ్) నిర్ణయం మేరకు లండన్ నుంచి తండ్రిని కడసారి చూసుకోవాలన్న ఆశతో ఇండియాకి వచ్చి.. ఆ కోరిక నెరవేరకపోవడంతో వెనుదిరిగిపోతున్న భరత్ (మహేష్ బాబు)ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసి, ప్రమాణ స్వీకారం చేయించి అతడ్ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడతారు..

చిన్నప్పుడే లండన్ వెళ్ళిపోయి భారతదేశానికి దూరంగా పెరిగిన భరత్ కు ఇక్కడి ప్రజలు, వ్యవస్థ, పద్ధతలు నచ్చవు. పాలనతో మార్పులు తీసుకురావాలంటే వ్యవస్థ మారాలి, వ్యవస్థ మారాలి అంటే ప్రజలు బాధ్యాతాయుతంగా వ్యవహరించాలి, వారికి ఆ బాధ్యత తెలియాలంటే వారిలో భయం ఉండాలి. అందుకే శక్తి కంటే యుక్తిని ఎక్కువగా నమ్మే యువ ముఖ్యమంత్రి ముందుగా ప్రజల్లో మార్పు తీసుకురావడం కోసం దండోపాయంగా ట్రాఫిక్ రూల్స్ పాటించనివారిపై భారీ మొత్తంలో ఫైన్లు వేయడం ప్రారంభిస్తారు. భయంతో రూల్స్ ఫాలో అవ్వడం మొదలెడతారు జనాలు.

అదే తరహాలో.. కాంట్రాక్టర్లు, మీడియేటర్ల మీద కూడా దండోపాయాలు ప్రయోగించి విజయం సాధిస్తాడు భరత్. అయితే.. అదే దండోపాయాన్ని ప్రతిపక్ష నేతలపై ప్రయోగించాలని ప్రయత్నించినప్పుడు మాత్రం దారుణంగా విఫలమవుతాడు. ప్రజల కోసం పనిచేయాల్సిన రాజకీయ నాయకులు ప్రజలను దోచుకుంటున్నారని తెలుసుకొంటాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం పటిష్టమైన వ్యవస్థ నిర్మాణ సన్నాహాల్లో నిమగ్నమై ఉన్న భరత్ పై కుట్ర పన్ని తన సొంత పార్టీవారే గద్దె దించుతారు..

సరిగ్గా 8 నెలల 13 రోజులపాటు ముఖ్యమంత్రిగా సర్వ శక్తులతో తన బాధ్యతను నిర్వహించిన భరత్ ఒక్కసారిగా శక్తిహీనుడు అయిపోవడంతో ఎగసిన రాక్షస మూకలను ఒంటి చేత్తో ఎలా చిత్తు చేశాడు, అంత:కారణ శుద్ధితో ప్రజలను ప్రగతిబాటవైపు ఎలా నడిపించాడు అనేది “భరత్ అనే నేను” కథాంశం..

నటీనటుల పనితీరు : యువ ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ బాబు అందంగా కనిపించాడు, చక్కగా నటించాడు అని చెప్పుకొనేకంటే బాధ్యతగా కనిపించాడు. కళ్ళలో తీక్షణం, మాటల్లో బాధ్యత, బాడీ లాంగ్వేజ్ లో నిజాయితీ కనిపించింది. అవును ఒక బాధ్యతాయుతమైన పోయిజిషన్ లో ఉన్న మనిషి ఇలాగే ఉంటాడేమోనని ప్రతి ఒక్క ప్రేక్షకుడు అనుకొనే రీతిలో మహేష్ నటన.. కాదు కాదు బిహేవియర్ ఉంది. దుర్గా మహల్ ఫైట్ సీన్, ప్రెస్ మీట్ సీస్ లో మహేష్ పలికించిన హావభావాలు, ఎమోషన్ కి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు.

కైరా అద్వానీకి పెద్దగా సన్నివేశాలు లేకపోయినప్పటికీ.. తనదైన స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకొంది. స్వచ్చమైన ఆడపడుచులా అందంగా కనిపిస్తూనే అభినయంతోనూ ఆకట్టుకొంది. అమ్మడికి ఇక తెలుగులో మంచి క్రేజ్ రావడం ఖాయం. ప్రకాష్ రాజ్ పాత్ర ప్రెడిక్టబుల్ గా ఉన్నప్పటికీ.. ఆయన తన సీనియారిటీతో వరదరాజులు అనే పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రతో చిత్రానికి కీలకంగా మారాడు.

బ్రహ్మాజీ కామెడీతోపాటు ఎమోషన్స్ సీన్స్ లోనూ అదరగొట్టాడు. “అర్జున్ రెడ్డి” ఫేమ్ రాహుల్ రామకృష్ణ, రవిశంకర్, జీవా, పోసాని కృష్ణమురళీలు పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు : దేవిశ్రీప్రసాద్ “రంగస్థలం” తర్వాత “భరత్ అనే నేను”తో మరోమారు సంగీత దర్శకుడిగా తన స్టామినాను బలంగా చాటుకొన్నాడు. పాటలతో ఆల్రెడీ అలరించిన దేవి.. బ్యాగ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టాడు. ఎలివేషన్ సీన్స్ కి మహేష్ బ్యాగ్రౌండ్ స్కోర్ భీభత్సమైన ఇంపాక్ట్ చూపింది. తిరు సినిమాటోగ్రఫీ సినిమాకి రిచ్ లుక్ తీసుకురాగా, ఫ్రేమింగ్స్ మంచి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా మహేష్ బాబుకి పెట్టిన టైట్ క్లోజ్ షాట్స్ అండ్ రివీలింగ్ షాట్స్ కి అభిమానులు ఆనందంతో మునిగితేలాలి. సినిమాలోని చాలా ఎమోషన్స్ ను, ముఖ్యంగా ఫైట్స్ సీక్వెన్స్ లను పిక్చరైజ్ చేసిన విధానం చాలా బాగుంది.

మహేష్ బాబు ముందే చెప్పినట్లుగా సినిమాలోని చాలా సన్నివేశాలను లెంగ్త్ కారణంగా ఎడిట్ చేశారు. అందులో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన హోలీ ఫైట్ కూడా ఎడిట్ అయిపోయింది. ఆ సన్నివేశాన్ని తర్వాత యాడ్ చేస్తారని తెలిసింది. అయితే.. ఆ ఫైట్ సీన్ బదులు సెకండాఫ్ లో ఉన్న కొన్ని ల్యాగ్ సీన్స్ ఎడిట్ చేసుంటే బాగుండు అనిపిస్తుంది.

దర్శకుడు కొరటాల శివ సమాజంలో ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, ప్రభుత్వ వ్యవహారం కారణంగా వ్యవస్థ పడుతున్న ఇబ్బందులను, మీడియా చేస్తున్న అనవసరమైన హడావుడిని బేస్ చేసుకొని “భరత్ అనే నేను” కథను రాసుకొన్న విధానం బాగుంది. పోలిటికల్ సినిమా అనగానే.. ప్రెజంట్ పొలిటీషియన్స్ మీద పంచ్ లు వేస్తూ, వారిని ఉద్దేశించి డూప్ లను పెట్టి అనవసరమైన చర్చలకు దారి తీయకుండా.. ప్రజల మనోభావాలను తెరకెక్కించిన విధానం బాగుంది.

ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఎందుకు మొదలెట్టదు, మారుమూల పల్లెటూర్ల సమస్యలను, రైతు సమస్యలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు, అసలు మీడియా అడ్రెస్ చేయాల్సిన చాలా విషయాలను పక్కనబెట్టి, చెత్తను మాత్రమే జనాలకు చూపుతున్నారు వంటి సీరియస్ ఇష్యూస్ ని మహేష్ బాబు లాంటి ఒక స్టార్ హీరోతో చర్చింపజేసి ఆ విషయాల మీద సగటు ప్రేక్షకులకి అవగాహన పెంచాలని కొరటాల చేసిన ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. అయితే.. తన కుటుంబ నేపధ్యం కారణంగా ఏర్పడినవో లేక ప్రభుత్వ పనితీరు మీద ఉన్న కోపమో తెలియదు కానీ.. “లోకల్ గవర్నెన్స్” (స్వయం పాలన) అనే ఆలోచన విధానం, ఆ విధానాన్ని అమలుపరచాలనే భావాలు 1920 కాలం నాటి కమ్యూనిస్టు మేధావుల మైండ్ సెట్ ను తలపించడం ఒక్కటీ పక్కన పెట్టేస్తే.. కొరటాల శివ “భరత్ అనే నేను”తో సమాజానికి ఒక బాధ్యతాయుతమైన చిత్రాన్ని అందించాడు.

విశ్లేషణ : గత రెండు సినిమాల వరుస పరాజయాలతో నీరసించిన మహేష్ వీరాభిమానులందరూ తలెత్తుకొనేలా చేసిన సినిమా “భరత్ అనే నేను”. అయితే.. కాలరేగరేసే స్థాయి కలెక్షన్స్ వస్తాయా లేదా అనేది మాత్రం అన్నీ వర్గాల ప్రేక్షకులు చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకొంటారు అనే విషయంపై ఆధారపడి ఉంది. అయితే.. మహేష్ బాబు కెరీర్ లో మాత్రం “భరత్ అనే నేను” ఒక ప్రత్యేక చిత్రంగా నిలవనుంది.

రేటింగ్ : 3/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus