భరత్ అనే నేను చిత్ర బృందానికి లీగల్ నోటీసులు

సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమా గత నెల 20 తేదీన రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ విడుదలయిన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తోంది. రెండు వారాల్లోనే 200 కోట్ల మెయిలు రాయిని చేరుకుని చిత్ర బృందానికి సంతోషాన్ని ఇచ్చింది. అయితే తాజాగా భరత్ అనే నేను మేకర్స్ చిక్కుల్లో పడ్డారు.

నవోదయం పార్టీ నుంచి లీగల్ నోటీసులు అందుకున్నారు. ఈ పార్టీ వారి నుంచి ఎటువంటి పరిమిషన్ లేకుండా పేరును వాడుకున్నందుకు వారు మండిపడుతున్నారు. అంతేకాదు నవోదయం పార్టీ నాయకుడు హత్య చేసినట్టుగా చూపించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. “సినిమాలో పార్టీ పేరుని నిలిపివేయడమే కాదు.. హంతకుడిగా చూపించినందుకు వారం రోజుల్లో మేకర్స్ క్షమాపణలు చెప్పాలి”అని నవోదయం పార్టీ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ 2012 లో ఈ పార్టీ కి గుర్తింపును ఇచ్చింది. అలాగే ఈ పార్టీ గత ఎన్నికల్లో చీరాల నియోజక వర్గం నుంచి పోటీ చేసింది. మరి వీరి డిమాండ్ కి డీవీవీ దానయ్య, కొరటాల శివ, మహేష్ బాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus