“బ్రహ్మోత్సవం, స్పైడర్” సినిమాలు తీవ్రంగా నిరాశపరిచి ఉండడంతో తదుపరి చిత్రమైన “భరత్ అనే నేను” (వర్కింగ్ టైటిల్)పై మహేష్ బాబు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడు. ఒక్కసారి కథ ఒకే చేశాక షూటింగ్ లో యాక్టింగ్ చేయడం తప్ప వేరే ఏ విషయంలోనూ ఇన్వాల్వ్ అవ్వని మహేష్ బాబు “భరత్ అనే నేను” విషయంలో మాత్రం మేకింగ్ మొదలుకొని రిలీజ్ వరకూ అన్ని విషయాల్లోనూ ఇన్వాల్వ్ అవుతున్నాడట. తొలుత చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేద్దామనుకొన్నారు. కానీ.. ప్రకాష్ రాజ్ రోల్ షూట్ లేట్ అవ్వడం ప్రకటించిన తేదీకి వచ్చే అవకాశాలు లేకపోవడంతో రిలీజ్ డేట్ మార్చాలని అనుకొన్నారు.
ముందు ఫిబ్రవరి లేదా మార్చిలో చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాత దాయన్న ప్లాన్ చేసినప్పటికీ.. పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా రాజీపడకూడదు అని మహేష్ మరీ మరీ చెప్పడంతో.. కంగారేం లేకుండా ఏప్రిల్ లో సినిమాని విడుదల చేయాలని ఫిక్స్ చేశారు. మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన “పోకిరి” కూడా ఏప్రిల్ 28న విడుదలైన సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని.. “భరత్ అనే నేను” చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని సినిమా పి.ఆర్ టీం నేడు ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. మరి సినిమా యూనిట్ ఫాలో అవుతున్న ఈ “పోకిరి” సెంటిమెంట్ “భరత్ అనే నేను”కు ఏమేరకు హెల్ప్ అవుతుందో చూడాలి.